రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో (Ranji Trophy) భాగంగా బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్ (Urvil Patel) విధ్వంసకర శతకం బాదాడు. 327 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 96 బంతుల్లోనే 16 ఫోర్ల సాయంతో సెంచరీ చేశాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఉర్విల్.. టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, ఆకాశ్‌దీప్‌ను సమర్దవంతంగా ఎదుర్కొని శతక్కొట్టాడు.
34 ఓవర్ల అనంతరం గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఇప్పటివరకే వచ్చిన జట్టు స్కోర్‌లో ఉర్విల్‌దే సింహభాగం. అతనికి జతగా జైమీత్ పటేల్ (34) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవాలంటే మరో 177 పరుగులు చేయాలి. చివరి రోజు ఆటలో రెండో సెషన్ కొనసాగుతుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. సుదీప్ ఘరామీ (56), ఇషాన్ పోరెల్ (51), సుమంత గుప్తా (63) అర్ద సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగులు చేసింది. సిద్దార్థ్ దేశాయ్ 4 వికెట్లతో సత్తా చాటాడు.
అనంతరం బరిలోకి దిగిన గుజరాత్.. షాబాజ్ అహ్మద్ (19-5-34-6) చెలరేగడంతో 167 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మనన్ హింగ్రాజియా (80 నాటౌట్) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. బెంగాల్ బౌలర్లలో షాబాజ్‌తో పాటు మహ్మద్ షమీ (18.3-6-44-3) కూడా సత్తా చాటాడు.
112 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సుదీప్ ఘరామీ (54), అనుస్తుప్ మజుందార్ (58) అర్ద సెంచరీలతో రాణించారు. సిద్దార్థ్ దేశాయ్ 5 వికెట్లతో సత్తా చాటాడు.
27 ఏళ్ల ఉర్విల్ పటేల్ గత ఐపీఎల్ సీజన్ మధ్యలో వన్ష్ బేడీ స్థానంలో సీఎస్‌కేలో చేరాడు. 3 మ్యాచ్‌ల్లో అద్బుతమైన స్ట్రయిక్‌రేట్‌తో (212.50) 68 పరుగులు చేశాడు.
ఉర్విల్‌కు భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు ఉంది. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురపై అతను 28 బంతుల్లోనే శతక్కొట్టాడు.


