బంగ్లాదేశ్, వెస్టిండీస్ (Bangladesh vs West Indies) జట్ల మధ్య నిన్న (అక్టోబర్ 27) జరిగిన వన్డే మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బంగ్లా ఆటగాడు తస్కిన్ అహ్మద్ (Taskin Ahmed) సిక్సర్ కొట్టిన బంతికే ఔటయ్యాడు. బంగ్లాదేశ్ 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాలుగో బంతికి ఇది జరిగింది.
When you think you've won but life pulls an UNO reverse ◀️#BANvWI pic.twitter.com/neEUjd6bcZ
— FanCode (@FanCode) October 27, 2025
బంగ్లా గెలుపుకు చివరి 3 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. రొమారియో షెపర్డ్‌ను తస్కిన్ ఎదుర్కొన్నాడు. షెపర్డ్ సంధించిన ఫుల్ లెంగ్త్ డెలివరిని తస్కిన్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాదాడు. బంతిని బౌండరీ ఆవల పడగానే తస్కిన్ కాలు పొరపాటున వికెట్లను తాకింది. దీంతో బెయిల్ కింద పడి తస్కిన్ హిట్ వికెట్‌గా (ఆఖరి వికెట్) వెనుదిరగాల్సి వచ్చింది.
ఫలితంగా బంగ్లాదేశ్ మరో రెండు బంతులు మిగిలుండగానే ఆలౌటై, 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ వన్డేలో (మొదటిది) తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
షాయ్ హోప్ (46 నాటౌట్), రోవ్‌మన్ పావెల్ (44 నాటౌట్), అలిక్ అథనాజ్ (34), బ్రాండన్ కింగ్ (33) రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, రిషద్ హొస్సేన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం 166 లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటై, లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జేడన్ సీల్స్, జేసన్ హోల్డర్ తలో 3 వికెట్లు తీయగా.. అకీల్ హొసేన్ 2, ఖారీ పియెర్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిమ్ హసన్ (33), తౌహిద్ హృదోయ్ (28), నసుమ్ అహ్మద్ (20) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 ఇదే వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది.
కాగా, ఇరు జట్ల మధ్య తాజాగా ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి, మూడు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ గెలవగా.. రెండో వన్డేలో వెస్టిండీస్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ పరిమిత ఓవర్లల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది.


