దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 (Syed Mushtaq Ali Trophy 2025)లో గుజరాత్ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్-సి గ్రూపులో భాగంగా బుధవారం నాటి మ్యాచ్‌లో సర్వీసెస్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ఉర్విల్ పటేల్ (Urvil Patel) విధ్వంసకర శతకం కారణంగా గుజరాత్ విజయం నల్లేరు మీద నడకలా మారింది.
182 పరుగులు
హైదరాబాద్‌లోని జింఖాన స్టేడియం వేదికగా టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సర్వీసెస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్ గౌరవ్ కొచ్చర్ (37 బంతుల్లో 60) మెరుపు అర్ధ శతకం బాదగా.. అరుణ్ కుమార్ (29), జయంత్ గోయత్ (7 బంతుల్లో 29) రాణించారు.
గుజరాత్ బౌలర్లలో హేమాంగ్ పటేల్, అర్జాన్ నాగ్వాస్వల్లా చెరో రెండు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్, రవి బిష్షోయి, విశాల్ జేస్వాల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆది నుంచే దూసుకుపోయింది.
చెలరేగిన ఓపెనర్లు
ఓపెనర్లలో ఆర్య దేశాయ్ ధనాధన్ ఇన్నింగ్స్ (35 బంతుల్లో 60)తో హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. మొత్తంగా 37 బంతుల్లో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు.
321కి పైగా స్ట్రైక్‌రేటుతో
ఉర్విల్ విధ్వంసకర శతక ఇన్నింగ్స్‌లో పన్నెండు ఫోర్లు, పది సిక్సర్లు ఉన్నాయి. 321కి పైగా స్ట్రైక్‌రేటుతో అతడు పరుగులు రాబట్టడం గమనార్హం. మిగతావారిలో రిపాల్ పటేల్ డకౌట్ అయినా పెద్దగా ప్రభావం పడలేదు. 12.3 ఓవర్లలోనే కేవం రెండు వికెట్లు నష్టపోయి గుజరాత్ 183 పరుగులు చేసి జయభేరి మోగించింది. శతక వీరుడు ఉర్విల్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
నమ్మకం నిలబెట్టుకున్నాడు
కాగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఉర్విల్ పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు చెన్నై అతడిని రిటైన్ చేసుకుంది. ఇక ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెడుతూ సొంత జట్టు గుజరాత్ తరఫున ఉర్విల్ తొలి మ్యాచ్‌లోనే ఇరగదీయడం గమనార్హం. కాగా ఏడాది ఐపీఎల్‌లో ఉర్విల్ మూడు మ్యాచ్‌లు ఆడి 68 పరుగులు చేశాడు.
చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం


