కోహ్లి పరుగుల బాటతో...  | India defeat New Zealand in the 1st ODI | Sakshi
Sakshi News home page

కోహ్లి పరుగుల బాటతో... 

Jan 12 2026 5:59 AM | Updated on Jan 12 2026 5:59 AM

India defeat New Zealand in the 1st ODI

తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్‌ విజయం 

రాణించిన గిల్, అయ్యర్‌ 

మిచెల్, కాన్వే, నికోల్స్‌ అర్ధ సెంచరీలు వృథా 

14న రాజ్‌కోట్‌లో రెండో వన్డే 

అనుభవం లేని ఆటగాళ్లతో వచ్చిన న్యూజిలాండ్‌ అదరగొట్టింది. గెలిచేందుకు అవసరమైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. కానీ ఛేదనలో మొనగాడు, ‘కింగ్‌ కోహ్లి’ కుదురుకొని ఆడటంతో పెద్ద లక్ష్యం కూడా దిగివచ్చింది. ఒకదశలో జేమీసన్‌ వణికించినా... 8 పరుగుల వ్యవధిలోనే కోహ్లి, జడేజా, అయ్యర్‌ల వికెట్లు కోల్పోయినా... కేఎల్‌ రాహుల్‌ చేసిన విలువైన పరుగులతో టీమిండియా తొలి వన్డేలో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.  

వడోదర: భారత బ్యాటింగ్‌ ‘కింగ్‌’ కోహ్లి మరోసారి ఛేజింగ్‌లో తన విలువ ఏంటో నిరూపించుకున్నాడు. కోహ్లి సాధికారిక ఆటతీరు కారణంగా... తొలి వన్డేలో న్యూజిలాండ్‌ 300 పరుగులు చేసినా ఓటమిని తప్పించుకోలేకపోయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ఫై గెలిచింది. టాస్‌ నెగ్గిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన కివీస్‌ నిరీ్ణత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీస్కోరు చేసింది.

 డారిల్‌ మిచెల్‌ (71 బంతుల్లో 84; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డెవాన్‌ కాన్వే (67 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్‌), హెన్రీ నికోల్స్‌ (69 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. ‘హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌’ సిరాజ్, హర్షిత్‌ రాణా, ప్రసిధ్‌ కృష్ణ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్‌ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీని చేజార్చుకోగా... గిల్‌ (71 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. జేమీసన్‌కు 4 వికెట్లు దక్కాయి. రెండో వన్డే 14న రాజ్‌కోట్‌లో జరుగుతుంది. 

అదిరే ఆరంభం 
ఓపెనర్లు కాన్వే, నికోల్స్‌ చూడచక్కని అర్ధసెంచరీలతో కివీస్‌కు శుభారంభమిచ్చారు. 21 ఓవర్ల వరకు భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు. హర్షిత్‌ రెండో స్పెల్‌ 2–0–13–2తో విలువైన వికెట్లు పడగొట్టడంతో న్యూజిలాండ్‌ తడబడింది. 117/0 స్కోరుతో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్‌ 38వ ఓవర్‌ వచ్చేసరికి 198/5తో కష్టాల్లో పడింది. ఇలాంటి దశలో మిచెల్‌ మెరుపులతో కివీస్‌ ఇన్నింగ్స్‌ను మళ్లీ నిలబెట్టాడు. æ 

కోహ్లి నడిపించడంతో... 
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ధాటిగా ఆడే క్రమంలో రోహిత్‌ శర్మ (26; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అవుటయ్యాడు. కెప్టెన్‌ గిల్‌కు జతయిన కోహ్లి చకచకా పరుగులు రాబట్టారు. రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించాక గిల్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి విరాట్‌ జట్టు స్కోరును 200 దాటించాడు. సెంచరీకి చేరువవుతున్న దశలో కోహ్లిని జేమీసన్‌ అవుట్‌ చేశాడు. అప్పుడు భారత్‌ స్కోరు 234/3. ఇక చేయాల్సింది 67 పరుగులే కాగా చేతిలో 7 వికెట్లున్నాయి. కానీ జేమీసన్‌ ధాటికి అయ్యర్, జడేజా (4) పెవిలియన్‌ చేరారు. అయితే హర్షిత్‌ రాణా (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్‌ (21 బంతుల్లో 29 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌)  ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. 

స్కోరు వివరాలు 
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (బి) రాణా 56; నికోల్స్‌ (సి) రాహుల్‌ (బి) రాణా 62; యంగ్‌ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 12; మిచెల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్‌ 84; ఫిలిప్స్‌ (సి) అయ్యర్‌ (బి) కుల్దీప్‌ 12; మిచెల్‌ హే (బి) ప్రసిధ్‌ 18; బ్రేస్‌వెల్‌ రనౌట్‌ 16; ఫోక్స్‌ (బి) సిరాజ్‌ 1; క్లార్క్‌ (నాటౌట్‌) 24; జేమీసన్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 300. 
వికెట్ల పతనం: 1–117, 2–126, 3–146, 4–170, 5–198, 6–237, 7–239, 8–281. 
బౌలింగ్‌: సిరాజ్‌ 8–0–40–2, హర్షిత్‌ రాణా 10–0–65–2, సుందర్‌ 5–0–27–0, ప్రసిధ్‌ కృష్ణ 9–0–60–2, కుల్దీప్‌ 9–0–52–1, జడేజా 9–0–56–0. 

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) బ్రేస్‌వెల్‌ (బి) జేమీసన్‌ 26; గిల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) అశోక్‌ 56; కోహ్లి (సి) బ్రేస్‌వెల్‌ (బి) జేమీసన్‌ 93; శ్రేయస్‌ (బి) జేమీసన్‌ 49; జడేజా (సి) క్లార్క్‌ (బి) జేమీసన్‌ 4; రాహుల్‌ (నాటౌట్‌) 29; హర్షిత్‌ (సి) హే (బి) క్లార్క్‌ 29; సుందర్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 306. 
వికెట్ల పతనం: 1–39, 2–157, 3–234, 4–239, 5–242, 6–279. 
బౌలింగ్‌: జేమీసన్‌ 10–1–41–4, ఫోక్స్‌ 10–0–49–0, ఆదిత్య అశోక్‌ 6–0–55–1, క్లార్క్‌ 10–0–73–1, బ్రేస్‌వెల్‌ 8–0–56–0, ఫిలిప్స్‌ 4–0–21–0, మిచెల్‌ 1–0–7–0.

2: మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్‌ కోహ్లి రెండో స్థానానికి ఎగబాకాడు. 557 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 28,068 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ (664 మ్యాచ్‌ల్లో 34,357 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంక ప్లేయర్‌ కుమార సంగక్కర (594 మ్యాచ్‌ల్లో 28,016 పరుగులు) మూడో స్థానానికి పడిపోయాడు.

1: అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 28 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా కోహ్లి ఘనత వహించాడు. సచిన్‌ టెండూల్కర్‌ (644 ఇన్నింగ్స్‌) పేరిట ఉన్న రికార్డును కోహ్లి (624 
ఇన్నింగ్స్‌) బద్దలు కొట్టాడు.
45: వన్డేల్లో కోహ్లికి లభించిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు. ఈ జాబితాలో సచిన్‌ (62), సనత్‌ జయసూర్య (48) ముందున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement