భారత్‌లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది
మనందరం ఐకమత్యంతోఆ దుష్టశక్తులను ఓడిద్దాం
‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’లో ప్రధాని మోదీ పిలుపు
ఆలయం కోసం పోరాడిన యోధులను స్మరిస్తూ కొనసాగిన శౌర్యయాత్ర
ఢమరుక నాదాల నడుమ 108 అశ్వాలతో ఊరేగింపు
సోమనాథ్: వెయ్యేళ్ల సోమనాథ్ చరిత్ర విధ్వంసం, పరాజయానికి సంబంధించినది కాదని.. అది మహోన్నత పునర్‌నిర్మాణ, విజయం చరిత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చరిత్రాత్మక సోమనాథ్ ఆలయం విధ్వంసానికి గురైన ప్రతిసారీ మరోసారి నిర్మితం అవుతూనే ఉందని తెలిపారు. ఖడ్గం మొనతో ప్రజల హృదయాలు గెలుచుకోలేమని స్పష్టంచేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సోమనాథ్ ఆలయ పునర్‌నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ మన మధ్యనే చురుగ్గా ఉన్నాయని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా, ఐక్యంగా ఉంటూ ఆయా శక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఆదివారం గుజరాత్ రాష్ట్రం గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. మహాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయం సమీపంలోని సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ విగ్రహం వద్ద నివాళులరి్పంచారు. అనంతరం ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’లో పాల్గొన్నారు. తర్వాత అక్కడే ఏర్పాటుచేసిన భారీ బహిరంగ కార్యక్రమంలో వేలాది మంది భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘సోమనాథ్ మందిరంపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి. ఈ దాడులకు విద్వేషమే ప్రేరణగా నిలిచింది. మనకు నిజాలు తెలియకుండా కుట్రలు చేశారు’’ అని గత ప్రభుత్వాలపై మోదీ మండిపడ్డారు.
బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకున్నవారే..
‘‘సోమనాథ్ ఆలయంపై దాడుల వెనుక మతపరమైన విద్వేషం ఉంది. సరిగ్గా వెయ్యేళ్ల క్రితం అతిపెద్ద దాడి జరిగింది. ఇది కేవలం సంపద కోసం జరిగిన దాడి కాదు. గర్భాలయంలో సోమనాథుడి విగ్రహాన్ని ముక్కలు చేశారు. ఇంత జరిగినా కొందరు మన కళ్లుగప్పాలని చూశారు.
సంపద లూటీ కోసమే దాడులు అంటూ కట్టుకథలు అల్లారు. విద్వేషం, వేధింపులు, ఉగ్రవాద చరిత్రను దాచేయాలని కుట్రలు సాగించారు. నిజంగా సొంత మతం పట్ల నిబద్ధత కలిగినవారు ఉగ్రవాద భావజాలాన్ని సహించరు. బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకున్నవారే మతపరమైన ఉగ్రవాదం ఎదుట మోకరిల్లుతారు’’ అని అన్నారు.
మనం మరింత శక్తివంతంగా మారాలి
‘‘మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక∙సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ గొప్ప ప్రతిజ్ఞ చేశారు. సోమనాథ్ ఆలయాన్ని పునరి్నరి్మస్తామని చెప్పారు. కానీ, అప్పటి పాలకులు ఆయనకు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. 1951లో ఆలయ ప్రారంభోత్సవానికి తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హాజరుకాకుండా అభ్యంతరాలు వ్యక్తంచేశారు. వెళ్లొద్దని చెప్పారు. హెచ్చరికలను లెక్కచేయకుండా ఆలయాన్ని ఆయన ప్రారంభించారు.
ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిన అవే శక్తులు ఇప్పటికీ మనుగడలో ఉన్నాయి. కత్తులు, కుట్రలతో కాకుండా ఇతర మార్గాల్లో మన దేశాన్ని వ్యతిరేకిస్తున్నాయి. స్వలాభం కోసం మన మధ్య చిచ్చుపెట్టి, ముక్కలుగా విభజించాలని చూస్తున్న దుష్ట శక్తులను కచి్చతంగా ఓడించాలి’’ అని అన్నారు. ‘‘గజినీ మహమ్మద్ 1026లో సోమనాథ్‌పై దాడి చేశాడు.
ఆ తర్వాత 18వ శతాబ్దంలో ఔరంగజేబ్ పాలన దాకా ఎన్నోసార్లు విధ్వంసాలు జరిగాయి. ఈ మందిరాన్ని మసీదుగా మార్చేందుకు ప్రయత్నించారు. కానీ, విధ్వంసం జరిగిన ప్రతిసారీ శివ శక్తులు ఆలయాన్ని మళ్లీ నిర్మించుకున్నారు. వీరిలో మాల్వా రాణి అహిల్యాభాయి హోల్కర్ సైతం ఉన్నారు.
విదేశీ దురాక్రమణదారులు మన దేశాన్ని కూడా ధ్వంసం చేయడానికి శతాబ్దాలపాటు ప్రయతి్నంచారు. దేశం ఏనాడూ వారి ఎదుట తలవంచలేదు. ముష్కరుల నుంచి సోమనాథ్ మందిరాన్ని కాపాడుకోవడానికి వీర్ హమీర్‌జీ గోహిల్, వేగ్‌దాజీ భిల్ వంటి ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.
శౌర్య యాత్రలో మోగిన ఢమరుకం
విదేశీయుల దాడుల నుంచి సోమనాథ్ ఆలయాన్ని రక్షించుకునే క్రమంలో వీరమరణం పొందిన అసంఖ్యాక యోధులను స్మరించుకుంటూ ఆదివారం సోమనాథ్ పట్టణంలో 108 అశ్వాలతో భారీ శౌర్యయాత్ర నిర్వహించారు. ర్యాలీని ప్రారంభిస్తూ ప్రధాని మోదీ సైతం ఢమరుకం మోగించి, ఢంకా బజాయించారు. వందలాది మంది భక్తులు ఢమరుకాలను మోగిస్తూ ముందునడవగా 108 మేలుజాతి అశ్వాలు ఠీవీగా నడుస్తూ వాళ్లను అనుసరించాయి. వెనకాలే ఓపెన్‌టాప్ వాహనంలో ప్రధాని మోదీ వెంటరాగా రిషి కుమారులు ఆయన వెంట వచ్చారు.
శంఖ్ సర్కిల్ నుంచి వీర్ హమీర్‌జీ గోహిల్ సర్కిల్ దాకా దాదాపు కిలోమీటర్‌పైగా ఈ శౌర్యయాత్ర కన్నులపండువగా కొనసాగింది. ఇరువైపులా బారులు తీరిన భక్తులపై జనం పూలవర్షం కురిపించారు. యాత్ర పొడవునా శివభక్తులు, కళాకారులు సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. సోమనాథ్ ఆలయం దాకా యాత్ర జరిగింది. ఆలయ చరిత్రను వివరిస్తూ సాగిన డ్రోన్ల ప్రదర్శన ఆకట్టుకుంది. సోమనాథ్‌ను దర్శించుకోవడం దేవుని గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నానంటూ ప్రధాని మోదీ తర్వాత ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు.


