భారత పురుషల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. ఆదివారం వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో చేధించింది.
దీంతో మూడు వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(71 బంతుల్లో 84), డెవాన్ కాన్వే(56), హెన్రీ నికోల్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.
విరాట్ విధ్వంసం..
అనంతరం భారీ లక్ష్య చేధనలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తనదైన శైలిలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ దశలో సునాయసంగా సెంచరీ మార్క్‌ను అందుకునేలా కన్పించిన కోహ్లి.. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.
కేవలం 7 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోల్పోయాడు. కోహ్లి మొత్తంగా 91 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(56), వైస్ కెప్టెన శ్రేయస్ అయ్యర్(49) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
అయితే కోహ్లి ఔటయ్యాక భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. దీంతో భారత డగౌట్‌లో కాస్త టెన్షన్ నెలకొంది. కానీ కేఎల్ రాహుల్(21 బంతుల్లో 29) ప్రశాంతంగా ఆడుతూ మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. హర్షిత్ రాణా(23 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాడ్ బౌలర్లలో కైల్ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆశోక్, క్లార్క్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం రాజ్‌కోట్ వేదికగా జరగనుంది.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్


