టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో దుమ్ములేపిన విరాట్.. ఇప్పుడు కివీస్‌తో వన్డేల్లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు.
క్రీజులోకి వచ్చినప్పటి నుంచే భారీ షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా అత్యంతవేగంగా ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.
కింగ్ కోహ్లి కేవలం 624 ఇన్నింగ్స్‌లలోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ ఫీట్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(644) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ముగ్గురే ముగ్గురు 28,000 పరుగులు సాధించారు. కోహ్లి కంటే ముందు కుమార సంగక్కర(28,016), సచిన్ టెండూల్కర్(34,357) ఈ ఘనత సాధించారు.
సంగక్కర రికార్డు బ్రేక్..
అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి చేరాడు. ఈ మ్యాచ్‌లోనే 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ స్ధానంలో సంగక్కర ఉండేవాడు. తాజా మ్యాచ్‌తో అతడిని కోహ్లి అధిగమించాడు. కోహ్లి కంటే ముందు సచిన్ ఒక్కడే ఉన్నాడు. అయితే కోహ్లి కేవలం ఒక్క ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతుండడంతో సచిన్ రికార్డు బ్రేక్ చేయడం కష్టమనే చెప్పాలి.
చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'


