నితీశ్ కుమార్ రెడ్డి.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గతేడాది భారత్ తరపున మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో టీమ్ మెనెజ్‌మెంట్ విఫలమైందనే చెప్పుకోవాలి. ఒక సిరీస్‌కు ఎంపిక చేస్తే మరొక సిరీస్‌కు పక్కన పెట్టడం, ఒకవేళ ఎంపికైనా తుది జట్టులో చోటు ఇవ్వకపోవడం వంటివి అతడి కెరీర్‌ను వెనుక్కి నెట్టిస్తున్నాయి.
అంతేకాకుండా అతడిని ఆల్‌రౌండర్‌గా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుని కేవలం బ్యాటింగ్‌కు పరిమితం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన నితీశ్.. ఇప్పటివరకు 20 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 100.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇప్పుడు మరోసారి ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ పట్ల టీమ్ మెనెజ్‌మెంట్ కఠినంగా వ్యవహరించింది.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంతో నితీశ్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నారు. కానీ వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డే తుది జట్టులో మాత్రం నితీశ్‌కు చోటు దక్కలేదు.
అతడిని కాదని స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్‌మెంట్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. అతడికి అవకాశమివ్వనప్పుడు ఎందుకు ఎంపిక చేస్తున్నారని పఠాన్ మండిపడ్డాడు.
"నితీశ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ ఇవ్వనప్పుడు, అతడిని ప్రధాన జట్టుకు ఎందుకు ఎంపిక చేస్తున్నారు? టీమ్‌తో పాటు ఉంటాడు.. కానీ తుది జట్టులో కన్పించడు. అతడిని పక్కన పెట్టడానికి ఏదో సరైన కారణముంది. ఒకవేళ తుది జట్టులో చోటు ఇచ్చినా.. ఒకట్రెండు ఓవర్లు బౌలింగ్, 8 స్ధానంలో బ్యాటింగ్‌కు పంపుతారు. ఇది సరైన విధానం కాదు. రెగ్యూలర్‌గా అవకాశమివ్వకపోతే ఎప్పటికీ అతడిని ఒక మంచి ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దలేరు.
హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే నితీశ్‌కు వరుస అవకాశాలు ఇవ్వాలి. హార్దిక్ కూడా కెరీర్ ఆరంభంలో వరుస అవకాశాలు పొందడం వల్లే స్టార్‌గా ఎదిగాడన్న విషయం మర్చిపోవద్దు" అని స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs NZ: కోహ్లి అరుదైన ఘనత.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్


