టీమిండియా జోరుకు బ్రేక్‌.. సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓట‌మి | South africa bring India back to earth, hand massive Super 8 loss | Sakshi
Sakshi News home page

T20 WC 2026: టీమిండియా జోరుకు బ్రేక్‌.. సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓట‌మి

Feb 22 2026 10:56 PM | Updated on Feb 23 2026 9:06 AM

South africa bring India back to earth, hand massive Super 8 loss

టీ20 ప్ర‌పంచ‌క‌ప్-2026లో టీమిండియా జోరుకు సౌతాఫ్రికా బ్రేక్‌లు వేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో 76 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘోర ప‌రాజ‌యం పాలైంది. 188 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా, స‌ఫారీ బౌల‌ర్ల ధాటికి విల్లవిల్లాడింది.

ల‌క్ష్య చేధ‌న‌లో సూర్య కుమార్ సేన 18.5 ఓవ‌ర్ల‌లో 111 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బ్యాట‌ర్ల‌లో శివ‌మ్ దూబే(42) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఈ మ్యాచ్‌లోనూ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. కేవ‌లం 15 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔటయ్యాడు.

సౌతాఫ్రికా బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. కేశవ్ మ‌హారాజ్ మూడు, బాష్ రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో స‌ఫారీలు బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ అద‌ర‌గొట్టారు.

మిల్ల‌ర్ అదుర్స్‌..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. 30 ప‌రుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ద‌క్షిణాఫ్రికాను మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు ఆదుకున్నారు. ప్రోటీస్ బ్యాట‌ర్ల‌లో డేవిడ్ మిల్ల‌ర్‌(63) టాప్ స్కోర‌ర్ నిల‌వ‌గా.. బ్రెవిస్‌(45), స్ట‌బ్స్‌(44) రాణించారు.

భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి, శివ‌మ్ దూబే త‌లా వికెట్ సాధించారు. ఇక భార‌త్ సెమీఫైన‌ల్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల‌లోనూ త‌ప్ప‌నిసరిగా విజ‌యం సాధించాలి. టీమిండియా త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఫిబ్ర‌వ‌రి 26న జింబాబ్వేతో త‌ల‌ప‌డ‌నుంది. ఆ త‌ర్వాత వెస్టిండీస్‌తో భార‌త్ ఆడ‌నుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement