నేడు మోదీ, మెర్జ్‌ కీలక భేటీ  | PM Narendra Modi to host German leader to bolster trade | Sakshi
Sakshi News home page

నేడు మోదీ, మెర్జ్‌ కీలక భేటీ 

Jan 12 2026 2:22 AM | Updated on Jan 12 2026 2:22 AM

PM Narendra Modi to host German leader to bolster trade

ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతమే లక్ష్యంగా చర్చలు 

ఇరుదేశాల బంధం 75 వసంతాలు పూర్తిచేసుకుంటున్న వేళ కీలక పరిణామం 

రూ.1.5 లక్షల కోట్లు దాటిన ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 

గాందీనగర్‌లో విస్తృతస్థాయిలో చర్చలు 

కైట్‌ ఫెస్టివల్‌లో పతంగులు ఎగరేయనున్న అగ్రనేతలు!

సాక్షి, న్యూఢిల్లీ: ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్‌లర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌లు సోమవారం గుజరాత్‌లో భేటీకానున్నారు. ఇందుకు గాందీనగర్‌లోని మహాత్మాగాంధీ మందిర్‌ వేదికకానుంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు మోదీ, మెర్జ్‌లు తొలుత అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అక్కడ మహాత్మునికి నివాళులరి్పస్తారు. తర్వాత 10 గంటల సమయంలో సబర్మతీ నదీతీరంలో జరుగుతున్న ప్రఖ్యాత ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. ఇరు నేతలు స్వయంగా పతంగులను ఎగరేసే అవకాశముంది. 

తర్వాత నేరుగా గాం«దీనగర్‌కు చేరుకుంటారు. అక్కడి మహాత్మామందిర్‌లో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కీలక అంశాలపై విస్తృతస్థాయి చర్చించనున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిపై సమీక్ష జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, నైపుణ్య శిక్షణ, రవాణా రంగాల్లో పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. రక్షణ, భద్రత, శాస్త్ర సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, పరిశోధన, హరిత ఇంధనం, సుస్థిరాభివృద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాల వంటి కీలక అంశాలపైనా విస్తృతస్థాయిల చర్చ జరగనుంది. 

అత్యంత నమ్మకమైన నేస్తంగా జర్మనీ.. 
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో భారత్‌కు యూరప్‌లో అత్యంత నమ్మకమైన నేస్తంగా జర్మనీ అవతరించింది. కేవలం వాణిజ్యానికే పరిమితమైన సంబంధాలు నేడు రక్షణ, అంతరిక్షం, హరిత ఇంధనం, సాంకేతికత వంటి కీలక రంగాలకు విస్తరించి, ఇరు దేశాల మైత్రిని సరికొత్త శిఖరాలకు చేర్చాయి. 1951లో భారత్‌తో దౌత్య సంబంధాలు ఏర్పరుచుకున్న తొలి దేశాల్లో జర్మనీ ఒకటి. 2026 నాటికి ఈ బంధం 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో భారత్‌కు జర్మనీ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దీనికి నిదర్శనమే జర్మనీ నూతన ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ తన తొలి ఆసియా పర్యటన కోసం భారత్‌ను ఎంచుకోవడం. ఇరు దేశాల మధ్య 2000వ సంవత్సరంలో కుదిరిన ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ 2025 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుని రజతోత్సవాలు జరుపుకోవడం ఈ బంధంలోని దృఢత్వాన్ని చాటిచెబుతోంది. 

రక్షణ రంగంలో ‘రెడ్‌ కార్పెట్‌’.. 
ఒకప్పుడు రక్షణ పరికరాల ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించిన జర్మనీ నేడు తన వైఖరిని పూర్తిగా మార్చుకుని భారత్‌కు ఈ రంగంలో ఎర్రతివాచీ పరిచి మరీ ఆహా్వనిస్తోంది. రక్షణ ఎగుమతుల నియంత్రణలను సడలించి, భారత్‌కు అత్యాధునిక సాంకేతికతను అందించేందుకు సిద్ధమైంది. హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న వేళ ఇండో–పసిఫిక్‌ ప్రాంత భద్రతలో జర్మనీ తన భాగస్వామ్యాన్ని పెంచుకుంది. ఇటీవల జరిగిన ‘మలబార్‌–2025’ నావికా విన్యాసాల్లో జర్మనీ పాల్గొనడం, భారత వాయుసేన నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘తరంగ్‌ శక్తి–1’ విన్యాసాల్లో జర్మన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పాలుపంచుకుంది. 

రికార్డు స్థాయిలో వాణిజ్యం.. 
యూరోపియన్‌ యూనియన్‌లో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా జర్మనీ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో రూ.1.51 లక్షల కోట్ల(16.65 బిలియన్‌ డాలర్ల)కు చేరింది. భారత్‌లో ఇప్పటికే సీమెన్స్, ఫోక్స్‌ వ్యాగన్, డీహెచ్‌ఎల్‌ వంటి 2,000కు పైగా జర్మనీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. జర్మనీలో 215కు పైగా భారతీయ కంపెనీలు ఐటీ, ఆటోమొబైల్, ఫార్మా రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి.

ఉన్నత విద్య కోసం జర్మనీకి ఛలో.. 
విద్య, పరిశోధన, ఉపాధి రంగాల్లోనూ ద్వైపాక్షిక బంధం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు విదేశీ విద్య అంటే అమెరికా, బ్రిటన్‌లవైపే చూసే భారతీయ విద్యార్థులు ఇప్పుడు జర్మనీకి సైతం పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ప్రస్తుతం జర్మనీలో 60 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. జర్మనీలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం. ఇరు దేశాల మధ్య కుదిరిన ‘మైగ్రేషన్‌ అండ్‌ మొబిలిటీ’ ఒప్పందం ద్వారా భారతీయ నిపుణులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు మరింత సులభతరమయ్యాయి. ఇస్రో, జర్మన్‌ స్పేస్‌ సెంటర్‌ (డీఎల్‌ఆర్‌) మధ్య 1974 నుంచి కొనసాగుతున్న అంతరిక్ష పరిశోధనల సహకారం నేడు మరింత విస్తృతమైంది. ఐఐటీ మద్రాస్‌ వంటి భారతీయ విద్యాసంస్థలు జర్మన్‌ వర్సిటీలతో కలిసి డ్యూయల్‌ డిగ్రీలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఇలా.. సంస్కృతి నుంచి సాంకేతికత వరకు, రక్షణ నుంచి వాణిజ్యం వరకు అన్ని రంగాల్లోనూ భారత్‌–జర్మనీ బంధం ‘డబుల్‌ ఇంజిన్‌’ వేగంతో దూసుకెళ్తోంది.  

గ్రీన్‌ ఎనర్జీకి జర్మనీ భరోసా.. 
పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో జర్మనీ భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. 2030 నాటికి భారత్‌లో హరిత ఇంధన ప్రాజెక్టుల కోసం 10 బిలియన్‌ యూరోల ఆర్థిక సాయం అందించేందుకు జర్మనీ కట్టుబడి ఉంది. అహ్మదాబాద్, సూరత్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులతో పాటు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని గ్రీన్‌ ఎనర్జీ కారిడార్లు, కొచి్చలో వాటర్‌ మెట్రో ప్రాజెక్టుకు జర్మనీ ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తోంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement