breaking news
Friedrich Merz
-
వ్యూహాత్మక సుస్థిరత సాధిద్దాం
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అంశాలు, యుద్ధాలు, ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, జర్మనీ ఉమ్మడిగా నినదించాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా పరస్పరం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఇరుదేశాలు ఉమ్మడిగా నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్‌లు విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత సోమవారం ఢిల్లీలో ఇరుదేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. రక్షణ, వాణిజ్యం,భూ అయస్కాంత లోహాలు, సెమీకండక్టర్లు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. అంతర్జాతీయ సమస్యలకు ఉమ్మడిగా పరిష్కారాలు సూచించే స్థాయికి ద్వైపాక్షిక బంధాలను ధృడపర్చుకోవాలని నేతలు నిర్ణయించుకున్నారు. రక్షణ పారిశ్రామిక సహకారం, ఉన్నత విద్యారంగంలో మరింత మెరుగైన సహకారం సహా 19 అంశాలపై రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పూర్తిస్థాయిలో వాణిజ్యానికి బాటలుపడేలా భారత్–యూరోíపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా సాకారం చేసుకోవాలని మోదీ, మెర్జ్‌లు అభిలíÙంచారు. విదేశాలకు విమానాల్లో ప్రయాణించే భారతీయులు జర్మనీ మీదుగా వెళ్తున్నప్పుడు అవసరమయ్యే ట్రాన్సిట్ వీసాతో పనిలేకుండా వీసారహిత ప్రయాణాలకు అనుమతించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. దీంతో భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలు సులభతరం కానున్నాయి. పెరిగిన సహకారమే పరస్పర విశ్వాసానికి ప్రతీక సంయుక్త ప్రకటన వేళ మోదీ మాట్లాడారు. ‘‘రక్షణ, భద్రత రంగాల్లో ఏటికేడు పెరుగుతున్న సహకారమే ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం, ఐక్య దార్శనికతకు ప్రబల నిదర్శనం. వాణిజ్య ఒప్పందం సాఫీగా సాగేలా పూర్తి స్థాయి సహాయసహకారాలు అందిస్తున్న చాన్స్‌లర్ మెర్జ్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం బలపడేలా మార్గసూచీ కోసం కలిసి పనిచేద్దాం. దీంతో సహఅభివృద్ధి, సహ ఉత్పత్తిలో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’’అని మోదీ అన్నారు. ‘‘పారదర్శకమైన, స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నాం. సముద్ర చట్టాలపై ఐక్యరాజ్యసమితి తీర్మానాలను గౌరవిస్తాం. నూతన ద్వైపాక్షిక ఇండో–పసిఫిక్ సంప్రదింపుల వ్యవస్థను ప్రారంభిస్తున్నాం. ఇండియా–పశి్చమాసియా–యూరప్ ఆర్థిక నడువాకు మా మద్దతు కొనసాగుతుంది’’అని ఇరునేతలు సంయుక్త ప్రకటనలో స్పష్టంచేశారు. ఇండో–పసిఫిక్ సముద్రజలాల్లో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత్, జర్మనీ ఈ నిర్ణయానికొచ్చాయి. నైపుణ్య కార్మికులకెంతో డిమాండ్ ఈ సందర్భంగా చాన్స్‌లర్ మెర్జ్ మాట్లాడారు. ‘‘ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు బలపడుతున్నాయి. భారత్ నుంచి ఏటా నైపుణ్య కార్మికులు, సహాయకులు, నర్సుల డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లోని ఆరోగ్యసంరక్షణ వృత్తినిపుణులకు జర్మనీలో ఎంతో గిరాకీ ఉంది. అయితే సరఫరా వ్యవస్థలు, ముడి పదార్థాల తరలింపులో బడా శక్తుల జోక్యం పెరిగిపోయింది. దీనిని భారత్, జర్మనీ ఉమ్మడిగా ఎదుర్కోనున్నాయి’’అని మెర్జ్ పరోక్షంగా చైనా, అమెరికాలను విమర్శించారు. ‘‘జర్మనీ విశ్వవిద్యాలయాలకు ఇదే నా స్వాగతం. భారత్‌లోకి అడుగుపెట్టి మీ వర్సిటీల క్యాంపస్‌లను ఆరంభించండి. ప్రతిభావంతులైన భారతీయ యువత మీ జర్మనీ ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి కృషిచేస్తోంది. సమగ్ర మార్గసూచీ అనేది విద్యారంగంలో భాగస్వామ్యాన్ని సమున్నత శిఖరాలకు చేర్చుతుంది’అని మోదీ అన్నారు. -
నేడు మోదీ, మెర్జ్ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్‌లు సోమవారం గుజరాత్లో భేటీకానున్నారు. ఇందుకు గాందీనగర్‌లోని మహాత్మాగాంధీ మందిర్ వేదికకానుంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు మోదీ, మెర్జ్‌లు తొలుత అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అక్కడ మహాత్మునికి నివాళులరి్పస్తారు. తర్వాత 10 గంటల సమయంలో సబర్మతీ నదీతీరంలో జరుగుతున్న ప్రఖ్యాత ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటారు. ఇరు నేతలు స్వయంగా పతంగులను ఎగరేసే అవకాశముంది. తర్వాత నేరుగా గాం«దీనగర్‌కు చేరుకుంటారు. అక్కడి మహాత్మామందిర్‌లో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కీలక అంశాలపై విస్తృతస్థాయి చర్చించనున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిపై సమీక్ష జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, నైపుణ్య శిక్షణ, రవాణా రంగాల్లో పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. రక్షణ, భద్రత, శాస్త్ర సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, పరిశోధన, హరిత ఇంధనం, సుస్థిరాభివృద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాల వంటి కీలక అంశాలపైనా విస్తృతస్థాయిల చర్చ జరగనుంది. అత్యంత నమ్మకమైన నేస్తంగా జర్మనీ.. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో భారత్‌కు యూరప్‌లో అత్యంత నమ్మకమైన నేస్తంగా జర్మనీ అవతరించింది. కేవలం వాణిజ్యానికే పరిమితమైన సంబంధాలు నేడు రక్షణ, అంతరిక్షం, హరిత ఇంధనం, సాంకేతికత వంటి కీలక రంగాలకు విస్తరించి, ఇరు దేశాల మైత్రిని సరికొత్త శిఖరాలకు చేర్చాయి. 1951లో భారత్‌తో దౌత్య సంబంధాలు ఏర్పరుచుకున్న తొలి దేశాల్లో జర్మనీ ఒకటి. 2026 నాటికి ఈ బంధం 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో భారత్‌కు జర్మనీ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దీనికి నిదర్శనమే జర్మనీ నూతన ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తన తొలి ఆసియా పర్యటన కోసం భారత్‌ను ఎంచుకోవడం. ఇరు దేశాల మధ్య 2000వ సంవత్సరంలో కుదిరిన ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ 2025 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుని రజతోత్సవాలు జరుపుకోవడం ఈ బంధంలోని దృఢత్వాన్ని చాటిచెబుతోంది. రక్షణ రంగంలో ‘రెడ్ కార్పెట్’.. ఒకప్పుడు రక్షణ పరికరాల ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించిన జర్మనీ నేడు తన వైఖరిని పూర్తిగా మార్చుకుని భారత్‌కు ఈ రంగంలో ఎర్రతివాచీ పరిచి మరీ ఆహా్వనిస్తోంది. రక్షణ ఎగుమతుల నియంత్రణలను సడలించి, భారత్‌కు అత్యాధునిక సాంకేతికతను అందించేందుకు సిద్ధమైంది. హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న వేళ ఇండో–పసిఫిక్ ప్రాంత భద్రతలో జర్మనీ తన భాగస్వామ్యాన్ని పెంచుకుంది. ఇటీవల జరిగిన ‘మలబార్–2025’ నావికా విన్యాసాల్లో జర్మనీ పాల్గొనడం, భారత వాయుసేన నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘తరంగ్ శక్తి–1’ విన్యాసాల్లో జర్మన్ ఎయిర్ ఫోర్స్ పాలుపంచుకుంది. రికార్డు స్థాయిలో వాణిజ్యం.. యూరోపియన్ యూనియన్‌లో భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా జర్మనీ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో రూ.1.51 లక్షల కోట్ల(16.65 బిలియన్ డాలర్ల)కు చేరింది. భారత్‌లో ఇప్పటికే సీమెన్స్, ఫోక్స్ వ్యాగన్, డీహెచ్ఎల్ వంటి 2,000కు పైగా జర్మనీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. జర్మనీలో 215కు పైగా భారతీయ కంపెనీలు ఐటీ, ఆటోమొబైల్, ఫార్మా రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి.ఉన్నత విద్య కోసం జర్మనీకి ఛలో.. విద్య, పరిశోధన, ఉపాధి రంగాల్లోనూ ద్వైపాక్షిక బంధం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు విదేశీ విద్య అంటే అమెరికా, బ్రిటన్‌లవైపే చూసే భారతీయ విద్యార్థులు ఇప్పుడు జర్మనీకి సైతం పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ప్రస్తుతం జర్మనీలో 60 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. జర్మనీలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం. ఇరు దేశాల మధ్య కుదిరిన ‘మైగ్రేషన్ అండ్ మొబిలిటీ’ ఒప్పందం ద్వారా భారతీయ నిపుణులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు మరింత సులభతరమయ్యాయి. ఇస్రో, జర్మన్ స్పేస్ సెంటర్ (డీఎల్ఆర్) మధ్య 1974 నుంచి కొనసాగుతున్న అంతరిక్ష పరిశోధనల సహకారం నేడు మరింత విస్తృతమైంది. ఐఐటీ మద్రాస్ వంటి భారతీయ విద్యాసంస్థలు జర్మన్ వర్సిటీలతో కలిసి డ్యూయల్ డిగ్రీలను ఆఫర్ చేస్తున్నాయి. ఇలా.. సంస్కృతి నుంచి సాంకేతికత వరకు, రక్షణ నుంచి వాణిజ్యం వరకు అన్ని రంగాల్లోనూ భారత్–జర్మనీ బంధం ‘డబుల్ ఇంజిన్’ వేగంతో దూసుకెళ్తోంది. గ్రీన్ ఎనర్జీకి జర్మనీ భరోసా.. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో జర్మనీ భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. 2030 నాటికి భారత్‌లో హరిత ఇంధన ప్రాజెక్టుల కోసం 10 బిలియన్ యూరోల ఆర్థిక సాయం అందించేందుకు జర్మనీ కట్టుబడి ఉంది. అహ్మదాబాద్, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టులతో పాటు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని గ్రీన్ ఎనర్జీ కారిడార్లు, కొచి్చలో వాటర్ మెట్రో ప్రాజెక్టుకు జర్మనీ ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తోంది. -
సీడీయూ, సీఎస్‌యూ కూటమిదే జర్మనీ
బెర్లిన్: ఒలాఫ్ ష్కోల్జ్ సారథ్యంలోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోవడంతో అనివార్యమైన జర్మనీ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ (సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి ఘన విజయం సాధించింది. కడపటి వార్తలు అందేసరికి సీడీయూ,సీఎస్‌యూ కూటమికి 28.6 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో సీడీయూ పార్టీ చీఫ్ ఫ్రెడరిక్ మెర్జ్ తదుపరి ఛాన్స్లర్ కావడం ఖాయమైంది. వలసలను తీవ్రంగా వ్యతిరేకించే అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి 20.8 శాతం ఓట్లు పడ్డాయి. గత మూడేళ్లుగా అధికారం చలాయించిన ఒలాఫ్ షోల్జ్ సారథ్యంలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్డీపీ) ఈసారి మూడోస్థానానికి పరిమితమైంది. ఈ పార్టీకి కేవలం 16.4 శాతం ఓట్లు పడ్డాయి. పర్యావరణ పరిరక్షణ ఉద్యమం నుంచి పురుడపోసుకుని పార్టీగా అవతరించిన ది గ్రీన్స్ పా ర్టీకి కేవలం 11.6 శాతం వచ్చాయి. ది సారా వాగెన్ కనెక్ట్–రీజన్ అండ్ జస్టిస్ పార్టీ (బీఎస్ డబ్ల్యూ) 4.97 శాతం ఓట్లు సాధించింది. 630 సీట్లున్న బండేస్టాగ్( జర్మనీ పార్లమెంట్)లో సీడీయూ, సీఎస్‌యూ కూటమి అత్యధికంగా 208 చోట్ల విజయం సాధించింది. ‘‘ అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగానే మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో అమెరికా, రష్యాల నుంచి ఏవైనా సవాళ్లు ఎదురైతే వాటిని ఎదుర్కొని యూరప్‌ను ఐక్యంగా ఉంచేందుకు పోరాడతా’’ అని మెర్జ్ అన్నారు.సంకీర్ణ ప్రభుత్వం దిశగా..ఏ కూటమి/పార్టీకి స్పష్టమైన మెజారిటీరాని కారణంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. అధిక సీట్లు సాధించిన సీడీయూ, సీఎస్‌యూ కూటమి మూడో స్థానంలో వచ్చిన ఎస్డీపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వీలుంది. రెండోస్థానంలో వచ్చిన ఏఎఫ్‌డీ పార్టీకి సీడీయూ,సీఎస్‌యూ కూటమికి మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఒలాఫ్ షోల్జ్‌కు చెందిన ఎస్డీపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనుందని వార్తలొచ్చాయి. అవస రమైతే నాలుగోస్థానంలో వచ్చిన గ్రీన్స్ పార్టీని ప్రభు త్వంలో కలుపుకోవాలని సీడీయూ, సీఎస్‌యూ కూటమి భావిస్తోంది. పెద్దపెద్ద షరతు లు పెట్టకుండా ఎస్డీపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కు కలిస్తే అంతా సవ్యంగా సాగుతుంది. లేదంటే ఏఎఫ్‌డీ పార్టీలోని నేతల కు ఎరవేసి తమ కూటమి లో కలుపుకునే ప్రయత్నా లను సీడీయూ, సీఎస్ యూ కూటమి ముమ్మరం చేయొచ్చు. గత మూడేళ్లుగా గ్రీన్స్, ఫ్రీ డెమొక్రటిక్ పార్టీతో కలిసి ఎస్డీపీ ప్రభుత్వాన్ని షోల్జ్ నడిపించారు. బలపడనున్న అమెరికాతో మైత్రిరష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తున్న సీడీయూ కూటమి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఉక్రెయిన్‌కు ఒక రకంగా సానుకూలమైన వార్త. మెర్జ్ సారథ్యంలోని సర్కార్ ఇకమీదటా ఉక్రెయిన్‌కు తగు రీతిలో ఆయుధ, ఆర్థిక సాయం చేసే వీలుంది. మరోవైపు జర్మనీ, అమెరికా సత్సంబంధాలను మరింత పటిష్టం చేస్తానని మెర్జ్ సోమవారం స్పష్టంచేశారు. ‘‘ అమెరికా మాత్రమే ఎదగాలనే ‘అమెరికా ఫస్ట్’ నినాదం వాస్తవరూపం దాల్చితే అమెరికా ఒంటరి అయిపోతుంది. అలాకాకుండా ఇరుపక్షాలు లాభపడేలా జర్మనీ, అమెరికా బంధాన్ని బలపరుస్తా. అమెరికా సత్సంబంధాలను తెంచుకుంటే యూరప్ దేశాలు మాత్రమే దెబ్బతినవు. దాని విపరిణామాలను అమెరికా కూడా అనుభవించాల్సి ఉంటుంది’’ అని ఎన్నికల ముందస్తు ఫలితా లొచ్చాక తొలి మీడియా సమావేశంలో మెర్జ్ వ్యాఖ్యా నించారు. యూరప్ దేశాల కంటే దేశ స్వీయ ప్రయో జనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తున్న వేళ మెర్జ్ ఈ అంశంపై మాట్లాడటం గమనార్హం. -
వైఫల్యం నుంచి చాన్స్‌లర్ దాకా..
జర్మనీకి కాబోయే చాన్స్‌లర్ అయిన ఫ్రెడరిక్ మెర్జ్ పేరు జర్మనీ అంతటా మార్మోగిపోతోంది. న్యాయవాదిగా అపార అనుభవం గడించి ఆర్థిక రంగంలో విశేషమైన ప్రతిభ కనబరిచిన మెర్జ్ చివరకు మళ్లీ రాజకీయాల్లో చేరి ఎట్టకేలకు చాన్స్‌లర్ పదవికి తాను సరైన వ్యక్తిని అని నిరూపించుకున్నారు. రాజకీయాల్లో ఆసక్తితో క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) వైపు అడుగులు వేసిన మెర్జ్ తదనంతరకాలంలో పార్లమెంటు సభ్యుడిగా ఎదిగారు. కానీ సిద్ధాంతపరమైన విభేదాలు ఆయనను పార్టీ వీడేలా చేశాయి. ఒక దశాబ్దంపాటు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు. తర్వాత మళ్లీ రాజకీయ గాలిసోకి రీ ఎంట్రీ ఇచ్చారు. పార్టీ పగ్గాలు సాధించేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేశారు. ఒకానొక సమయంలో విఫల రాజకీయ నాయకుడిగా మీడియా ముద్రవేసింది. అయినాసరే ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అలుపెరుగని పోరాటం చేసి ఎట్టకేలకు పార్టీ పగ్గాలను రెండేళ్ల క్రితం సాధించారు. కేవలం ఈ రెండేళ్లలోనే పార్టీని అధికార పీఠం మీద కూర్చోబెట్టి తన రాజకీయ చతురతను చాటారు. అద్భుతమైన వక్తగా పేరు తెచ్చుకున్న మెర్జ్ రాజకీయ ఆటుపోట్ల ప్రయాణాన్నిఓసారి తరచిచూద్దాం. మిలియనీర్ కార్పొరేట్ లాయర్బడా వ్యాపార సంస్థల తరఫున కేసులు వాదించే సీనియర్ న్యాయవాదిగా పేరు తెచ్చుకున్న మెర్జ్ ఆకాలంలో కోట్ల రూపాయలు సంపాదించి మిలియనీర్‌గా అవతరించారు. 70వ దశకంలో సైనికుడిగా ఆ తర్వాత చాన్నాళ్లు న్యాయవాదిగా, ఆ తర్వాత రాజకీయాల్లోనూ రాణించి సైనిక, న్యాయ, శాసన వ్యవస్థల్లో అపార అనుభవం గడించారు. మెర్జ్ 1972 నుంచి సీడీయూ పార్టీకి బలమైన మద్దతుదారుగా ఉన్నారు. 1989లో పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయారు. 1994లో హోచ్ సౌర్లాండ్ క్రీస్ నియోజకవర్గం నుంచి గెలుపొంది తొలిసారిగా పార్లమెంటులో అడుగు పెట్టారు. సీడీయూలో కీలక పదవులు నిర్వహించిన ఆయన 2000 సంవత్సరంలో పార్టీ పార్లమెంటరీ నేతగా ఎదిగారు. 2005 ఏడాది నుంచి ఆయన రాజకీయ పతనం మొదలైంది. సీడీయూ, సీఎస్‌యూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు తనకు సరైన పార్టీలో, ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని గ్రహించారు. పార్టీలో ఆధిపత్యం కోసం ఏంజెలా మెర్కల్తో పోటీపడి అలసిపోయారు. దీంతో చివరకు 2009లో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పునరాగమనం ఆరున్నర అడుగుల ఎత్తు 69 ఏళ్ల వయస్సున్న మెర్జ్ 2002 ఏడాదిలో ఏంజెలా మెర్కల్ ప్రభుత్వంలో పనిచేశారు. తర్వాత రాజకీయాలు వదిలేసి పలు పెట్టుబడుల బ్యాంకుల బోర్డుల్లో సేవలందించారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత 2018లో రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు. ఆ ఏడాది సీడీయూ నేతగా ఏంజెలా మెర్కల్ దిగిపోయారు. దీంతో తనకు రాజకీయ అవకాశాలు బలపడతాయని గ్రహించి మెర్జ్ మళ్లీ పార్టీలో చేరారు. పార్టీ చీఫ్ పదవికి పోటీచేసి 2021లో ఆర్మిన్ లాషెట్ చేతిలో ఓటమిని చవిచూశారు. దీంతో మీడియా ఈయనపై విఫలనేత ముద్రవేసింది. 2021లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో సొంత పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయింది. పార్టీలో కీలకనేతగా ఎదిగి చిట్టచివరకు 2022లో పార్టీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీ మూలాలు దెబ్బకొడతానని ప్రతిజ్ఞ చేశారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ వ్యవహారాల్లో ఉత్తర అమెరికా దేశాలతో యూరప్ దేశాలు కలిసి మెలసి ఉండాలనే ‘అట్లాంటిక్ వాదం’ను మెర్జ్ మొదట్నుంచీ గట్టిగా వినిపంచేవారు. ఈ ఒక్క విషయంలో జర్మనీలో ఎక్కువ మంది మెర్జ్‌ను గతంలో బాగా విమర్శించేవారు. అయినాసరే అమెరికా, కెనడా వంటి దేశాలతో జర్మనీ సత్సంబంధాలు దేశ భవిష్యత్తుకు బాటలు వేస్తాయని బలంగా వాదించారు. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే వాగ్ధాటి, కార్పొరేట్ లాయర్‌గా దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో కలిసి పనిచేసిన అనుభవం, లాబీయింగ్ నైపుణ్యం, వివిధ పెట్టుబడుల బ్యాంక్ బోర్డుల్లో సాధించిన అనుభవం.. మెర్జ్‌కు రాజకీయాల్లో బాగా అక్కరకొచ్చాయి. ఈ అర్హతలే మెర్జ్‌ను ఛాన్స్లర్ పీఠం వైపు నడిపించాయి. ‘జర్మనీలో ఉన్నందుకు మరోసారి గర్వపడదాం’ వంటి నినాదాలు, ‘దేశ సరిహద్దులను పటిష్టంచేస్తా. వలసలను కట్టడిచేసేలా శరణార్థి నిబంధనలను కఠినతరం చేస్తా. పన్నులు తగ్గిస్తా. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కోసం, సంక్షేమ పథకాల కోసం 50 బిలియన్ యూరోలను ఖర్చుచేస్తా. రష్యాను ఎదుర్కొనేలా ఉక్రెయిన్‌కు సాయపడతా’ వంటి వాగ్దానాలు ఈయనను నయా జర్మనీ నేతగా నిలబెట్టాయి. రెండు విమానాలకు యజమానిచాంధసవాదానికి, గ్రామ సమాజాలకు ప్రసిద్ధి చెందిన పశ్చిమ జర్మనీలోని బ్రిలాన్ పట్టణంలో 1955 నవంబర్ 11న మెర్జ్ జన్మించారు. కుటుంబానికి న్యాయవాద వృత్తి నేపథ్యం ఉంది. మెర్జ్ తండ్రి న్యాయమూర్తిగా సేవలందించారు. తర్వాత ఆయన సీడీయూ పార్టీలోనూ కొనసాగారు. మెర్జ్ సైతం న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అంతకు ముందు 1975లో జర్మన్ సైన్యంలో సైనికుడిగా దేశసేవ చేశారు. 1985లో న్యాయవిద్యను పూర్తి చేసిన తర్వాత న్యాయమూర్తి అయ్యారు. 1986లో జడ్జి పదవికి రాజీనామా చేసి కార్పోరేట్ లాయర్ అవతారం ఎత్తారు. మూడేళ్లపాటు జర్మన్ రసాయనరంగ సంఘానికి ప్రైవేట్ లాయర్‌గా పనిచేశారు. 1981లో తోటి న్యాయవాది, ప్రస్తుతం న్యాయమూర్తిగా ఉన్న షార్లెట్ మెర్జ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. మెర్జ్ రాజకీయాల నుంచి విరామం తీసుకున్న దశాబ్దం పాటు అత్యంత విజయవంతమైన కార్పొరేట్ లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. అట్లాంటిక్ సంబంధాలను సమర్థించే లాబీ అయిన ‘అట్లాంటిక్–బీఆర్ 1/4కే’కు సారథ్యం వహించారు. పైలట్ శిక్షణా తీసుకున్నారు. ఈయనకు ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. ఈయనకు సొంతంగా రెండు విమానాలు కూడా ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
13 ఏళ్లు రాజకీయాలకు దూరం.. రీఎంట్రీలో అదిరే విజయం
ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ఓడింది. ఆ మాత్రానికే అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆయన్నో ఫెయిల్డ్ పొలిటీయన్గా అభివర్ణించాయి. మరోవైపు సొంత అధిష్టానం సైతం ఆయన నాయకత్వంపై బలమైన విమర్శలు చేసింది. వాటిని ఆయన తట్టుకోలేక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈలోపు దేశాన్ని తీవ్ర సంక్షోభాలు వచ్చి పడ్డాయి. అనూహ్యంగా.. మళ్లీ ఆయనకే నాయకత్వ పగ్గాలు అప్పజెప్పింది. అధికార పక్షంపై ప్రజా వ్యతిరేకత.. అదే సమయంలో ఆయన విధానాలు ప్రజలను ఆకర్షించగలిగాయి. అద్భుత విజయంతో జర్మనీ ఛాన్స్లర్ పీఠంపై ఫ్రెడరిక్ మెర్జ్‌ను కూర్చోబెట్టబోతున్నాయి. 69 ఏళ్ల ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ. క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్(CDU) తరపున అక్కడి ప్రభుత్వంలో ఎలాంటి కీలక పదవులు, బాధ్యతలు చేపట్టిన దాఖలాలు లేవు. మరి అలాంటి వ్యక్తికి నేరుగా.. జర్మనీ ఛాన్స్‌లర్‌గా అవకాశం ఎందుకు దక్కబోతోంది?. 👉ఫ్రెడరిక్ మెర్జ్(Fedrich Merz).. 1955, నవంబర్ 11న బ్రిలన్లో జన్మించారు. వాళ్లది న్యాయవాద నేపథ్యం ఉన్న కుటుంబం. బోన్, మార్బర్గ్ యూనివర్సిటీల్లో న్యాయవిద్య పూర్తి చేశారు. 1975 నుంచి 76 దాకా మిలిటరీలో పని చేశారు. న్యాయమూర్తిగా, ఆపై కార్పొరేటర్ లాయర్గానూ పని చేశారు👉1972లో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్(CDU Party)లో చేరారు. 1989లో తొలిసారి యూరోపియన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1994లో హోచ్సౌర్లాండ్క్రీస్ నియోజకవర్గం నుంచి జర్మనీ ముఖ్య సభ బుండెస్టాగ్‌కు తొలిసారి ఎన్నికయ్యారు. జర్మనీ పార్లమెంట్లో బుండెస్టాగ్, బుండెస్రాట్ సభలు ఉంటాయి. ఇవి మన లోక్‌సభ, రాజ్యసభలను పోలి ఉంటాయి.👉2000 సంవత్సరంలో ఆయన రాజకీయ ప్రస్థానం కీలక మలుపు తిరిగింది. అప్పటి సీడీయూ అధినేత్రి.. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్(Angela Merkel) సీడీయూ పార్లమెంటరీ నేతగా మెర్జ్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే.. రెండేళ్ల తర్వాత మెర్కెల్ ఆయన్ని పక్కనపెట్టారు. అందుకు కారణాలు లేకపోలేదు. 👉2002లో జరిగిన జనరల్ ఫెడరేషన్ ఎన్నికల్లో సీడీయూపై స్వల్ప ఆధిక్యంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది. ఈ ఓటమిని ఏంజెలా మెర్కెల్ జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు.. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఫ్రెడరిక్ మెర్జ్‌ను విఫల నాయకుడిగా ఏకిపారేశాయి. అదే టైంలో.. 👉ఒకే పార్టీ అయినప్పటికీ ఏంజెలా మెర్కెల్‌కు ఫ్రెడరిక్ మెర్జ్ నడుమ రాజకీయ సిద్ధాంతాలపరంగా బేధాలున్నాయి. పదహారేళ్ల పాటు(2005 నుంచి 2021) జర్మనీ ఛాన్సలర్‌గా పని చేసిన మెర్కెల్ సెంట్రిస్ట్ కావడం.. మెర్జ్ సంప్రదాయ రాజకీయవాది, పైగా అతిమితవాద పార్టీ మద్ధతుదారుడు కావడం గమనార్హం. ఈ క్రమంలో.. జనరల్ ఫెడరేషన్ ఎన్నికల ఓటమిని సాకుగా చూపించి ఆయన్ని పార్లమెంటరీ నేత పదవి నుంచి తప్పించారని అప్పట్లో ఆమెపై సీడీయూలోనే విమర్శలు వచ్చాయి. 👉కొన్నాళ్ల సీడీయూలోనే క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన.. 2009లో రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తిరిగి న్యాయవాది వృత్తిలో కొనసాగుతూనే.. మరోవైపు లాబీయిస్ట్ అవతారం ఎత్తారు. జర్మనీ బ్లాక్‌రాక్ సూపర్వైజరీ బోర్డు చైర్మన్‌గానూ వ్యహరించారు.👉ఈలోపు ఏంజెలా మెర్కెల్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే టైంలో.. సీడీయూకి నాయకత్వం వహించేది ఎవరనే చర్చ జోరుగా చర్చ నడిచింది. 2018, 2021 రెండుసార్లు సీడీయూ నాయకత్వం మారగా.. ఆ రెండుసార్లు ఫ్రెడరిక్ మెర్జ్ పేరే వినిపించింది. కానీ, 👉అన్నెగ్రెట్ క్రాంప్(2018-21), అర్మిన్ లాస్చెట్(2021-22)లు ఆ అవకాశం దక్కించుకున్నారు. చివరకు.. 2022లో ఫ్రెడరిక్ మెర్జ్‌కు ఉన్న రాజకీయ అనుభవం పరిగణనలోకి తీసుకుని, ఆయన కన్జర్వేటివ్ విధానాలకే ఓటేస్తూ నాయకత్వ బాధ్యతలను సీడీయూ అప్పగించింది.👉2022లో రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఫ్రెడరిక్ మెర్జ్.. బుండెస్టాగ్‌లో ప్రతిపక్ష నేతగా దూకుడుతనం ప్రదర్శించారు. అదే సమయంలో.. ప్రస్తుత ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ నేతృతంలోని సోషల్ డెమొక్రటిక్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికింది. ఈ క్రమంలో.. ప్రజాకర్ష విధానాలను ప్రదర్శించారు మెర్జ్. 👉దశాబ్దాలుగా జర్మనీ ఆర్థిక, దౌత్యపరమైన సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో మెర్జ్ అక్కడి ప్రజలకు ఓ ఆశాకిరణంగా కనిపించారు. 👉 తాజాగా ఆదివారం జరిగిన జర్మనీ పార్లమెంటరీ ఎన్నికల్లో..ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ కూటమి సీడీయూ+సీఎస్‌యూ(Christian Social Union in Bavaria) విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ విషయాన్ని ఖరారు చేశాయి. విశ్వసనీయుడిచేత జర్మనీ పాలించబడబోతోంది అని ఆయన మద్ధతుదారులు సంబురాలు చేస్తున్నారు. అయితే.. ఎన్నికల ఫలితాలు ఇవాళే వెల్లడి కానున్నాయిఅయితే మెర్జ్ విధానాలపై విమర్శలు లేకపోలేదుశరణార్థులను వెనక్కి తిప్పి పంపాలన్నది ఆయన అభిమతం. అయితే ఆయన ఇమ్మిగ్రేషన్ పాలసీని ఏంజెలా మెర్కెల్ లాంటి వాళ్లే బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. అతి మితవాద మద్దతుదారుడిగా ఉన్న మెర్జ్.. అల్టర్నేటివ్ ఫర్ జెర్మనీ(AfD) పార్టీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాన్ని సీడీయూలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు మెర్జ్ రూపొందిచిన ఆర్థిక విధానాలు.. ధనవంతులకు.. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేలా ఉండడం మరో మైనస్అన్నింటికి మంచి.. వ్యాపార ధోరణితో కూడిన ఆయన నాయకత్వ లక్షణంపై అటు విమర్శలతో పాటు ఇటు పొగడ్తలూ వినిపిస్తుంటాయిఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ ఛాన్సలర్ కావడం ఏంజెలా మెర్కెల్ ఇప్పుడు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే ఓ సీనియర్ నేతగా సీడీయూ ఆమె అభిప్రాయం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది అంతే.:: సాక్షి వెబ్‌డెస్క్


