భారత్, జర్మనీ ఉమ్మడి నిర్ణయం
ద్వైపాక్షిక చర్చలు జరిపిన భారత ప్రధాని మోదీ, జర్మనీ చాన్స్‌లర్ మెర్జ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అంశాలు, యుద్ధాలు, ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, జర్మనీ ఉమ్మడిగా నినదించాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా పరస్పరం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఇరుదేశాలు ఉమ్మడిగా నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్‌లు విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
తర్వాత సోమవారం ఢిల్లీలో ఇరుదేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. రక్షణ, వాణిజ్యం,భూ అయస్కాంత లోహాలు, సెమీకండక్టర్లు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. అంతర్జాతీయ సమస్యలకు ఉమ్మడిగా పరిష్కారాలు సూచించే స్థాయికి ద్వైపాక్షిక బంధాలను ధృడపర్చుకోవాలని నేతలు నిర్ణయించుకున్నారు.
రక్షణ పారిశ్రామిక సహకారం, ఉన్నత విద్యారంగంలో మరింత మెరుగైన సహకారం సహా 19 అంశాలపై రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పూర్తిస్థాయిలో వాణిజ్యానికి బాటలుపడేలా భారత్–యూరోíపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా సాకారం చేసుకోవాలని మోదీ, మెర్జ్‌లు అభిలíÙంచారు. విదేశాలకు విమానాల్లో ప్రయాణించే భారతీయులు జర్మనీ మీదుగా వెళ్తున్నప్పుడు అవసరమయ్యే ట్రాన్సిట్ వీసాతో పనిలేకుండా వీసారహిత ప్రయాణాలకు అనుమతించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. దీంతో భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలు సులభతరం కానున్నాయి.
పెరిగిన సహకారమే పరస్పర విశ్వాసానికి ప్రతీక
సంయుక్త ప్రకటన వేళ మోదీ మాట్లాడారు. ‘‘రక్షణ, భద్రత రంగాల్లో ఏటికేడు పెరుగుతున్న సహకారమే ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం, ఐక్య దార్శనికతకు ప్రబల నిదర్శనం. వాణిజ్య ఒప్పందం సాఫీగా సాగేలా పూర్తి స్థాయి సహాయసహకారాలు అందిస్తున్న చాన్స్‌లర్ మెర్జ్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం బలపడేలా మార్గసూచీ కోసం కలిసి పనిచేద్దాం.
దీంతో సహఅభివృద్ధి, సహ ఉత్పత్తిలో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’’అని మోదీ అన్నారు. ‘‘పారదర్శకమైన, స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నాం. సముద్ర చట్టాలపై ఐక్యరాజ్యసమితి తీర్మానాలను గౌరవిస్తాం. నూతన ద్వైపాక్షిక ఇండో–పసిఫిక్ సంప్రదింపుల వ్యవస్థను ప్రారంభిస్తున్నాం. ఇండియా–పశి్చమాసియా–యూరప్ ఆర్థిక నడువాకు మా మద్దతు కొనసాగుతుంది’’అని ఇరునేతలు సంయుక్త ప్రకటనలో స్పష్టంచేశారు. ఇండో–పసిఫిక్ సముద్రజలాల్లో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత్, జర్మనీ ఈ నిర్ణయానికొచ్చాయి.
నైపుణ్య కార్మికులకెంతో డిమాండ్
ఈ సందర్భంగా చాన్స్‌లర్ మెర్జ్ మాట్లాడారు. ‘‘ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు బలపడుతున్నాయి. భారత్ నుంచి ఏటా నైపుణ్య కార్మికులు, సహాయకులు, నర్సుల డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లోని ఆరోగ్యసంరక్షణ వృత్తినిపుణులకు జర్మనీలో ఎంతో గిరాకీ ఉంది. అయితే సరఫరా వ్యవస్థలు, ముడి పదార్థాల తరలింపులో బడా శక్తుల జోక్యం పెరిగిపోయింది. దీనిని భారత్, జర్మనీ ఉమ్మడిగా ఎదుర్కోనున్నాయి’’అని మెర్జ్ పరోక్షంగా చైనా, అమెరికాలను విమర్శించారు. ‘‘జర్మనీ విశ్వవిద్యాలయాలకు ఇదే నా స్వాగతం. భారత్‌లోకి అడుగుపెట్టి మీ వర్సిటీల క్యాంపస్‌లను ఆరంభించండి. ప్రతిభావంతులైన భారతీయ యువత మీ జర్మనీ ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి కృషిచేస్తోంది. సమగ్ర మార్గసూచీ అనేది విద్యారంగంలో భాగస్వామ్యాన్ని సమున్నత శిఖరాలకు చేర్చుతుంది’అని మోదీ అన్నారు.


