స్వదేశంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు సౌతాఫ్రికా (IND vs SA) చేతిలో 2-0తో వైట్‌వాష్ అయింది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో భారత బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్ జట్టుకు టెస్టు సిరీస్ సమర్పించుకోవడమే గాకుండా.. క్లీన్‌స్వీప్‌నకు గురైంది.
అశూ, రో-కోలను పంపించేశాడు!
ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లతో పాటు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై విమర్శల వర్షం కురుస్తోంది. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, లెజెండరీ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలను పొమ్మనలేక పొగబెట్టాడని.. బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ పిచ్చి ప్రయోగాలతో భారత జట్టు ఘోర పరాభవానికి కారణమయ్యాడని అభిమానులు సైతం మండిపడుతున్నారు. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
బీసీసీఐదే తుది నిర్ణయం
ఈ విషయంపై గంభీర్ స్పందించాడు. సఫారీల చేతిలో గువాహటి టెస్టులో ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ నేను కాదు.. టీమిండియానే అందరికీ ముఖ్యం. నా మార్గదర్శనంలోనే ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్టు సిరీస్ 2-2తో సమం చేసింది.
చాంపియన్స్ ట్రోఫీతో పాటు.. ఆసియా కప్ కూడా గెలుచుకుంది. ఈ జట్టు ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది. ఏదేమైనా కోచ్‌గా నా బాధ్యత కూడా ఉంటుంది. ముందుగా నన్నే అందరూ నిందిస్తారు. ఆ తర్వాత జట్టును విమర్శిస్తారు.
అందరూ నన్నే నిందిస్తారు
ఈ మ్యాచ్‌లో మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. 95/1 నుంచి 122/7కు పడిపోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యనీయం కాదు. ఏదో ఒక షాట్‌ను సాకుగా చూపి వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయలేము.
ప్రతి ఒక్కరిపై విమర్శలు వస్తాయి. నేను మాత్రం వ్యక్తిగతంగా ఎవరినీ నిందించను. నా విధానం ఇదే’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా గంభీర్ కోచింగ్‌లో టీమిండియాకు టెస్టుల్లో సొంతగడ్డపై ఇది రెండో ఘోర పరాభవం.
దారుణ వైఫల్యాలు
గతేడాది న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 3-0తో వైట్‌వాష్ అయింది. తాజాగా కోల్‌కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. గువాహటిలోని బర్సపరా స్టేడియంలో మరీ దారుణంగా 408 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే ఆలౌట్ అయి.. మరో వైట్‌వాష్‌ను ఎదుర్కొంది.
అంతకు ముందు స్వదేశంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అయితే, అంతకంటే ముందుగా ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వేళ్లన్నీ గంభీర్ వైపే చూపిస్తున్నాయి.
చదవండి: కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్‌పై మండిపడ్డ కుంబ్లే, డేల్ స్టెయిన్


