కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్‌పై మండిపడ్డ దిగ్గజాలు | Dont use Those words: Kumble Steyn Slams SA Coach Controversial Comments | Sakshi
Sakshi News home page

కాస్త హుందాగా ఉండండి: సౌతాఫ్రికా కోచ్‌పై మండిపడ్డ కుంబ్లే, డేల్‌ స్టెయిన్‌

Nov 26 2025 12:01 PM | Updated on Nov 26 2025 12:29 PM

Dont use Those words: Kumble Steyn Slams SA Coach Controversial Comments

కాన్రాడ్‌- టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌

స్వదేశంలో టీమిండియా టెస్టుల్లో మరో ఘోర పరాభవం ఎదుర్కోవడానికి సిద్ధపడింది. గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా (IND vs SA Tests) చేతిలోనూ అదే చేదు ఫలితం పొందనుంది. గువాహటి వేదికగా ప్రొటిస్‌ జట్టు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంత్‌ సేన తడబడింది.

భారీ ఆధిక్యం లభించినా..
బర్సపరా స్టేడియంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో రెండు వికెట్లు కోల్పోయి కేవలం 27 పరుగులు చేసింది. నిజానికి నాలుగో రోజు భారీ ఆధిక్యం లభించినా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడంలో ప్రొటిస్‌ జట్టు ఆలస్యం చేసింది. ఆఖరి రోజు వరకు టీమిండియాను తిప్పలుపెట్టాలనే వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సాష్టాంగపడేలా చేస్తాం
ఈ విషయం గురించి సౌతాఫ్రికా హెడ్‌కోచ్‌ షుక్రి కాన్రాడ్‌ మాట్లాడుతూ.. టీమిండియాను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత జట్టును మైదానంలో చాలా సేపు ఉండేలా చేసి.. ఆఖరికి వారిని మా ముందు సాష్టాంగపడేలా చేయడం కోసమే ఇలా చేశాము.

వాళ్లు బ్యాటింగ్‌ చేయాలి. ఫలితం మాకు అనుకూలంగా రావాలి. ఆఖరి రోజు ఆఖరి నిమిషం వరకు వాళ్లు పోరాడుతూనే ఉండాలి. చివరికి మాదే పైచేయి అవుతుంది’’ అంటూ అవమానకర మాట్లాడాడు.

కాస్త హుందాగా ఉండండి
ఈ నేపథ్యంలో షుక్రి కాన్రాడ్‌ వ్యాఖ్యలపై భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే, సౌతాఫ్రికా లెజెండరీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ మండిపడ్డారు. అనిల్‌ కుంబ్లే స్పందిస్తూ.. ‘‘యాభై ఏళ్ల క్రితం అప్పటి ఇంగ్లండ్‌ కెప్టెన్‌ వెస్టిండీస్‌ జట్టును ఉద్దేశించి ఇలాంటి మాటలే మాట్లాడాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు.

విండీస్‌ అగ్రస్థానానికి వెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది. సౌతాఫ్రికా ఇప్పుడు చారిత్రాత్మక సిరీస్‌ గెలిచేందుకు చేరువైంది. నిజానికి మీదే పైచేయిగా ఉన్నపుడు.. మీరు మాట్లాడే మాటలు కూడా అంతే హుందాగా ఉండాలి. కోచ్‌ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు ఊహించలేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇలా ఎవరైనా మాట్లాడతారా?
ఇక ప్రొటిస్‌ మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ఇదే విషయంపై స్పందించాడు. ‘‘ఇది అసలు ఎలాంటి మాట? నిజానికి ఈ విషయంపై స్పందించాలని కూడా నేను అనుకోవడం లేదు. ఇదొక అసందర్భ ప్రేలాపన. సౌతాఫ్రికా టీమిండియాపై ఆధిపత్యం సాధించింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇలాంటి మాటలను నేను అస్సలు సమర్థించను’’ అంటూ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో స్టెయిన్‌ ఫైర్‌ అయ్యాడు.

ఓటమి అంచున టీమిండియా
ఇదిలా ఉంటే.. గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఓటమికి చేరువైంది. టీ బ్రేక్‌ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 90 పరుగులే చేసింది. విరామం తర్వాత టీమిండియా మరింత కష్టాల్లో కూరుకుపోయింది. 56 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 109 పరుగులు చేసింది. 

భారత్‌ విజయానికి 440 పరుగులు అవసరం కాగా.. సౌతాఫ్రికా కేవలం నాలుగు వికెట్లు తీస్తే సిరీస్‌ సొంతం చేసుకోగలదు. ఇప్పటికే కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికా టీమిండియాపై 30 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. 

చదవండి: టెస్టుల్లో టీమిండియా అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement