డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది. ఈ ఐసీసీ ఈవెంట్‌ను ఫిబ్రవరి 7 -మార్చి 8 మధ్య నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
ఈసారి కూడా టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సొంతగడ్డపై టోర్నీ జరుగనుండటం భారత జట్టుకు మరో సానుకూలాంశం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్‌కప్ ఫైనల్లో గెలుస్తాం
ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలోని సౌతాఫ్రికా ఈసారి తప్పకుండా చాంపియన్‌గా అవతరిస్తుందని అంచనా వేశాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో సూర్యకుమార్ సేనను ఓడించి ఈసారి ట్రోఫీని ముద్దాడుతుందని గ్రేమ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఇటీవల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా టీమిండియాను 2-0తో వైట్‌వాష్ చేయడాన్ని ప్రస్తావించాడు.
‘‘భారత్‌లో ఆ టెస్టు సిరీస్ అద్భుతం. టీమిండియాను సొంతగడ్డపై ఓడించి.. మా జట్టు పూర్తి ఆధిపత్యం కొనసాగించడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. గత ఏడాదిన్నరకాలంగా మా టెస్టు జట్టు అద్భుతంగా ఆడుతోంది.
సౌతాఫ్రికా క్రికెట్‌ను సరికొత్తగా మార్చింది. ఇక ఈసారి భారత్‌లో జరిగే వరల్డ్‌కప్ ఫైనల్లోనూ టీమిండియాను ఓడించి మేము టైటిల్ గెలుస్తాం’’ అని గ్రేమ్ స్మిత్ పీటీఐతో పేర్కొన్నాడు.
మార్పు అవశ్యం
అదే విధంగా.. ‘‘ఈసారి కూడా టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది. వారి గెలుపు అవకాశాలను కొట్టివేయలేము. పైగా స్వదేశంలో టోర్నీ జరుగడం వారికి అదనపు బలం.
ముఖ్యంగా సీనియర్ల నిష్క్రమణ (రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి), హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ రావడం వంటి పరిణామాలతో భారత క్రికెట్‌లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పును కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
టీమిండియాదే పైచేయి
ఏదేమైనా ఈసారి టీమిండియా గనుక సెమీ ఫైనల్‌కు చేరకపోతే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉండదు’’ అని గ్రేమ్ స్మిత్ అన్నాడు. కాగా రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ గెలుచుకుంది.
బార్బడోస్ వేదికగా ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో సఫారీ జట్టుపై ఏడు పరుగుల తేడాతో గెలిచి.. తన ఖాతాలో రెండో టీ20 ట్రోఫీని జమచేసుకుంది. ఇక ఈ టోర్నీ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. సూర్యకుమార్ యాదవ్ పగ్గాలు చేపట్టాడు.
గత పద్దెనిమిది నెలల కాలంలో సూర్య సారథ్యంలో ఆడిన టీమిండియా కేవలం ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఓడిపోవడం.. జట్టు ఏ మేర పటిష్టంగా ఉందో చెప్పేందుకు నిదర్శనం. చివరగా ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1తో గెలిచింది. మరోవైపు.. సౌతాఫ్రికాకు మాత్రం గతేడాది అంత గొప్పగా ఏమీ సాగలేదు.
చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలు


