టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ఆడుతుందా?.. బంగ్లా డిమాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది?.. ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైఖరి ఎలా ఉండబోతోంది?.. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ అంశాల గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది.
బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడుల నేపథ్యంలో భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను బీసీసీఐ తొలగించింది. ఈ క్రమంలో భద్రతా కారణాలు చూపుతూ వరల్డ్‌కప్ ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని.. శ్రీలంకలో తమ మ్యాచ్‌లు నిర్వహించాలని బంగ్లా బోర్డు.. ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.
గందరగోళంలో ఆటగాళ్లు
అయితే, టోర్నీ ఆరంభానికి నెలరోజుల సమయం కూడా లేనందున ఈ మార్పు కుదరకపోవచ్చని ఐసీసీ బంగ్లా క్రికెట్ బోర్డు(BCB)కు సంకేతాలు ఇచ్చింది. అయినప్పటికీ బీసీబీ తమ పట్టువీడటం లేదు. దీంతో బంగ్లాదేశ్ లేకుండానే టోర్నీ నిర్వహించే పరిస్థితులు రావొచ్చనే ఆందోళనలు ఆ దేశ ఆటగాళ్లలో నెలకొన్నాయి.
ఐసీసీతో పంచాయతీ వద్దని, తెగేదాక లాగవద్దంటూ బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ హితవు పలికితే.. బీసీబీ అధికారి అతడిని ‘ఇండియన్ ఏజెంట్’ అంటూ ఆరోపణలు చేశాడు. మరోవైపు.. బంగ్లా కీలక ఆటగాళ్ల బ్యాట్ స్పాన్సర్లుగా ఉన్న భారత కంపెనీలు తప్పుకొనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో నష్టపోతారు.
అంగారక గ్రహంపైకి పంపించినా
అయినా సరే బీసీబీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్‌కప్ జట్టులో భాగమైన మెహదీ హసన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ప్రపంచకప్ ఆడే విషయంలో యాజమాన్యం తరఫు నుంచి సందిగ్దం నెలకొంది. అధికారులే ఈ సమస్యను పరిష్కరించాలి.
ప్లేయర్లుగా కేవలం ఆడటం మాత్రమే మా బాధ్యత. ఒకవేళ బోర్డు మమ్మల్ని అంగారక గ్రహంపైకి పంపించినా మేము ఆడి తీరాల్సిందే. ఈ విషయంలో ఆటగాళ్లు ఎక్కడా వెనక్కి తగ్గరు’’ అని పేర్కొన్నాడు.
మేము నటిస్తున్నామని మాకూ తెలుసు
ఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్, గత టీ20 వరల్డ్‌కప్‌లో సారథిగా వ్యవహరించిన నజ్ముల్ హుసేన్ షాంటో సైతం బంగ్లా బోర్డు తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. ‘‘ప్రతి ప్రపంచకప్ టోర్నీకి ముందు మాకు ఇలాంటి సమస్య ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది.
వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఆడిన ఆటగాడిగా నా అనుభవం గురించి చెబుతున్నా. ఇలాంటి పరిణామాలు కచ్చితంగా ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతాయి. మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఎలాంటి ప్రభావం లేదన్నట్లు పైకి చెబుతూ ఉంటాము.
నిజానికి ఆ సమయంలో మేమంతా నటిస్తున్నామన్న మాట. ఆ విషయం మాకూ తెలుసు. అయితే, ఇదేమీ తేలికైన విషయం కాదు. ఇలాంటి పరిస్థితులు రానేకూడదు. ఒకవేళ వచ్చినా ఆటగాళ్లుగా మేము చేసేదేమీ లేదు’’ అంటూ బీసీబీ వ్యవహారశైలిని విమర్శించాడు.
చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ


