భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ | BCCI 1st Reaction On Bangladesh's Demand To Move Its T20 World Cup Matches Out Of India | Sakshi
Sakshi News home page

T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ

Jan 9 2026 9:25 PM | Updated on Jan 9 2026 9:37 PM

BCCI 1st Reaction On Bangladesh's Demand To Move Its T20 World Cup Matches Out Of India

టీ20 ప్రపంచకప్‌-2026లో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారత్‌కు రావడంపై ఇంకా సందిగ్థత కొనసాగుతోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ తమ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఐసీసీని కోరిన సంగ‌తి తెలిసిందే.

అయితే  అందుకు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ విముఖ‌త చూపించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఐసీసీ నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. ఇక ఈ విష‌యంపై బీసీసీఐ తొలిసారి స్పందించింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవిష్యత్తు ప్రణాళికలను రచించేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులు శుక్రవారం ముంబైలో సమావేశమయ్యారు.

ఈ మీటింగ్‌లో బీసీసీఐ సెక్ర‌ట‌రీ దేవజిత్ సైకియాతో పాటు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సీఓఈ హెడ్ వీవీయ‌స్ లక్ష్మణ్ పాల్గోన్నారు. అయితే ఈ స‌మావేశంలో కేవ‌లం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించిన విష‌యాలు మాత్ర‌మే చ‌ర్చించిన‌ట్లు దేవజిత్ సైకియా స్ప‌ష్టం చేశారు.

"కేవ‌లం సీఓఈ, క్రికెట్ క్రికెట్ అభివృద్ధిపైనే చర్చించాం. బంగ్లాదేశ్ ప్రపంచకప్ మ్యాచ్‌ల తరలింపు అనేది మా పరిధిలోని అంశం కాదు. దానిపై ఐసీసీయే తుది నిర్ణ‌యం తీసుకుంటుంది" సైకియా పేర్కొన్నారు. అదేవిధంగా సీఓఈలో ఖాళీగా ఉన్న హెడ్ ఆఫ్ క్రికెట్ ఎడ్యుకేషన్, హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ పోస్ట్‌ల‌ను భ‌ర్తీ చేసేందుకు బోర్డు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.

కాగా ఇటీవ‌ల భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య దౌత్య‌ప‌ర‌మైన ఉద్రిక్తలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. అయితే బంగ్లా స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 నుంచి తప్పించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని, తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు తరలించాల్సిందిగా ఐసీసీకి బంగ్లా లేఖ రాసింది. బంగ్లా అభ్యర్ధను ఐసీసీ తిరస్కరించినట్లు క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే మరోసారి ఐసీసీకి బీసీబీ లేఖ రాసినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement