గతేడాది కాలంలో టెస్టు క్రికెట్‌లో టీమిండియా ఘోర పరాభవాలు చవిచూసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో న్యూజిలాండ్ చేతిలో చరిత్రలో లేనివిధంగా 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT) కోల్పోయింది.
ఇక ఇటీవల కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలో.. పాతికేళ్ల తర్వాత తొలిసారి సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈసారి కూడా టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2027 (WTC) ఫైనల్‌కు చేరడం కష్టమే.
గిల్ ప్రతిపాదన ఇదే
ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్ ఇటీవల బీసీసీఐ ముందు ఓ ప్రతిపాదన తీసుకువచ్చాడనే వార్త వైరల్ అయింది. టెస్టు సిరీస్‌కు ముందు కనీసం 15 రోజులు ప్రాక్టీస్ ఉండేలా షెడ్యూల్ చేయాలని గిల్ బోర్డు పెద్దలను కోరినట్లు తెలిసింది. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తాజాగా స్పందించాడు.
వింతైన, విలువైన నిర్ణయం
గిల్ నిర్ణయాన్ని సమర్థించిన ఊతప్ప... ‘‘ఓ నాయకుడి నుంచి వచ్చిన అత్యంత వింతైన, విలువైన నిర్ణయం ఇది. ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. టెస్టు క్రికెట్‌ను గిల్ చూస్తున్న కోణం ఇది. నిజంగా ఇది చాలా చాలా మంచి విషయం.
టెస్టు సిరీస్‌కు కనీసం రెండువారాల ముందు జట్టు సన్నాహకాలు మొదలుపెట్టడం మంచిది. కేవలం టెస్టు సిరీస్ గెలవడమే లక్ష్యం కాదు.. మన అంతిమ లక్ష్యం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ గెలవడం.
అది జరగాలంటే.. మన ప్రణాళిక, సన్నాహకాలు నిర్మాణాత్మకంగా ఉండాలి. టెస్టు క్రికెట్ పట్ల భక్తితో కూడిన గౌరవం ఉండాలి. గిల్ తెచ్చిన ఈ ప్రతిపాదన నాకెంతో సంతోషాన్నిచ్చింది’’ అని పేర్కొన్నాడు.
ఆకాశ్ చోప్రా సైతం
ఇక ఊతప్ప మాదిరే టీమిండియా మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం టెస్టు క్రికెట్ విషయంలో గిల్ ప్రపోజల్‌ను సమర్థించాడు. సంప్రదాయ ఫార్మాట్‌లో భారత్ మళ్లీ మునుపటి స్థాయిలో రాణించాలంటే పూర్తిస్థాయి ప్రిపరేషన్ అవసరమని పేర్కొన్నాడు.
చదవండి: ఇదీ మీ స్థాయి: పాక్ బోర్డును ఏకిపారేస్తున్న నెటిజన్లు


