పంత్- అయ్యర్ (PC: BCCI/IPL)
ఫ్రాంఛైజీ క్రికెట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న ఆదరణే వేరు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఒక్కసారైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ ఆశపడతాడనడంలో సందేహం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరింత సంపన్నం కావడానికి ఐపీఎల్ ప్రధాన కారణం.
ఐపీఎల్ కంటే తమదే గొప్ప లీగ్ అంటూ..
మరోవైపు.. దాయాది దేశం కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) పేరిట టీ20 లీగ్ నిర్వహిస్తోంది. అయితే, కొంతమంది పాక్ మాజీ ఆటగాళ్లు ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ను ముడిపెట్టి అభాసుపాలయ్యారు. ఐపీఎల్ కంటే తమదే గొప్ప లీగ్ అని హెచ్చులకు పోయి ట్రోలింగ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్, అందులో భాగమైన ఆటగాళ్ల స్థాయి ఏమిటో చాటేలా తాజా పీఎస్‌ఎల్‌కు సంబంధించిన మరో అంశం తెరమీదకు వచ్చింది.
హైదరాబాద్ ఫ్రాంఛైజీ@రూ. 55.57 కోట్లు
పాక్ సూపర్ లీగ్‌లో ఇప్పటి వరకు ఆరుజట్లు పాల్గొంటుండగా.. గురువారం రెండు కొత్త జట్లకు బిడ్లు ఖరారయ్యాయి. సియాల్‌కోట్ ఫ్రాంఛైజీని ఓజీ డెవలపర్స్ 6.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 58.38 కోట్లు) సొంతం చేసుకోగా.. అమెరికాకు చెందిన ఎఫ్‌కేఎస్ గ్రూపు హైదరాబాద్ (పాక్) జట్టు కోసం 6.2 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ. 55.57 కోట్లు) వెచ్చించింది.
ఐపీఎల్‌లో ఒక ఫ్రాంఛైజీ విలువ రూ. వేల కోట్లలో ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటిది పీఎస్‌ఎల్‌లో మాత్రం కనీసం వంద కోట్లు కూడా దాటలేదు. ముఖ్యంగా హైదరాబాద్ ఫ్రాంఛైజీ విలువ.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్, పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్‌ల జీతం మొత్తానికి దాదాపుగా సమానంగా ఉండటం గమనార్హం.
పంత్, అయ్యర్ జీతం కలిపితే..
ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేయగా.. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు కొనుక్కున్న విషయం తెలిసిందే. వీరిద్దరి సాలరీ కలిపితే పీఎస్‌ఎల్‌లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ విలువకు సమానం అన్నమాట.
ఈ గణాంకాలను షేర్ చేస్తూ.. ‘‘ఇదీ మీ స్థాయి’’ ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్‌ను పోల్చే పాక్ మాజీ ఆటగాళ్లకు టీమిండియా అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. కాగా ఈసారి కూడా ఐపీఎల్‌కు పోటీగా మార్చి 26 నుంచే పీఎస్‌ఎల్ మొదలుకానుంది. గతంలోనూ ఇలాగే పోటీకి వచ్చి రేటింగ్‌లేక వెలవెలబోయింది.
చదవండి: సరికొత్త ‘తలనొప్పి’గా సర్ఫరాజ్ ఖాన్.. సెలక్టర్లకు సవాల్


