టీమిండియా సెలెక్టర్లకు సరికొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటికే టీ20 జట్టులో ఖాళీలు లేక కొట్టుకుంటుంటే, కొత్తగా మరో ఆటగాడు నా స్థానం ఏదీ అంటూ సవాల్ విసురుతున్నాడు. వరుస విధ్వంసాలతో సెలెక్టర్లను ఇరకాటంలో పడేస్తున్నాడు. ఇంకా ఏం కావాలంటూ ఒత్తిడి పెంచుతున్నాడు. నాకు అర్హమైన స్థానాన్ని ఇవ్వకపోతే ఇంకా చెలరేగిపోతానంటున్నాడు.
ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే..? ముంబైకి చెందిన 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్. ఈ ఆల్ ఫార్మాట్ స్టయిలిష్ బ్యాటర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ, టీ20 బెర్త్ కోసం భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికైన మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ గాయపడిన నేపథ్యంలో సర్ఫరాజ్ తన ఆటలో మరింత వేగాన్ని పెంచి, ఆ స్థానం నాదే అంటూ బ్యాట్‌తో రాయభారం పంపుతున్నాడు.
ఇటీవలి అతని ప్రదర్శనలే ఇందుకు నిరద్శనం. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గతేడాది చివరి రోజు గోవాతో జరిగిన మ్యాచ్‌లో అతడు మహోగ్రరూపం దాల్చాడు. 75 బంతుల్లో 157 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. ఒక్క ఇన్నింగ్స్‌లో ఇన్ని సిక్సర్లు అంటే సర్ఫరాజ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగి ఉంటుందో ఇట్టే అర్దమవుతుంది.
తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ తన విధ్వంసం డోసును మరింత పెంచాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి నన్ను ఎవడ్రా అపేది అంటూ చెలరేగిపోయాడు. పంజాబ్ కెప్టెన్, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా 6,4,6,4,6,4 బాది తాండవం చేశాడు.
దీనికి ముందు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ సర్ఫరాజ్ విధ్వంసాల పరంపర ఇలాగే కొనసాగింది. ఆ టోర్నీలో రాజస్థాన్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లో 7 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 73 పరుగులు చేశాడు. దీనికి ముందు మ్యాచ్‌లో హర్యానాపై కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. 25 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు.
ఇంత చేసినా సర్ఫరాజ్‌కు టీమిండియాలో ఏ ఫార్మాట్‌లోనూ అవకాశం దక్కడం లేదు. ఇందుకు కారణమేంటో సెలెక్టర్లే పరిశీలించుకోవాలి. ముందుగా సర్ఫరాజ్‌ను సెలెక్టర్లు టెస్ట్ ప్లేయర్లగా పరిగణించారు. 6 మ్యాచ్‌ల్లో సెంచరీ, 3 అర్ద సెంచరీలు చేసి రాణించినా పక్కకు పెట్టారు.
టెస్ట్ బెర్త్ కోసం చాలాకాలం ఎదురుచూసిన సర్ఫరాజ్, ఇంక లాభం లేదంటూ మిగతా రెండు ఫార్మాట్లపై దృష్టి పెట్టాడు. దేశవాలీ వన్డే, టీ20 టోర్నీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఇక్కడైనా అవకాశం ఇవ్వండంటూ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. టీమిండియా ఏ ఫార్మాట్‌కు సిద్దమవుతున్నా, దానికి ముందు అదే ఫార్మాట్‌లో సత్తా చాటుతూ సెలెక్టర్ల సవాల్ చేశాడు.
న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందు కూడా అదే పని చేశాడు. అయినా సెలక్టర్లను కనికరించలేదు. తాజాగా టీ20 జట్టు సభ్యుడు తిలక్ వర్మ గాయపడటంతో, ఈ అవకాశాన్నైనా తనకు ఇవ్వాలంటూ వరుస మెరుపు ఇన్నింగ్స్‌లో సెలెక్టర్లకు సందేశం పంపుతున్నాడు. మరి, సర్ఫరాజ్ సత్తాకు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు తిలక్ ప్రత్యామ్నాయాన్ని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ లోపు సర్ఫరాజ్ మరిన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడితే సెలెక్టర్లు కరుణించవచ్చు. తిలక్ స్థానానికి సర్ఫరాజ్‌కు పోటీగా మరికొంత మంది కూడా ఉన్నారు. రుతురాజ్, పడిక్కల్, శ్రేయస్ అయ్యర్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంది. సెలెక్టర్లు ఏం చేస్తారో చూడాలి.


