గువాహటి వేదికగా భారత్‌తో రెండో టెస్టులో సౌతాఫ్రికా (IND vs SA) సమిష్టిగా రాణించింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన సఫారీలు.. ఆతిథ్య జట్టును కేవలం 201 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటారు.
తొలి ఇన్నింగ్స్‌లో..
ఫలితంగా టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న సౌతాఫ్రికా.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్‌ను ఫాలో ఆన్ ఆడించకుండా సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. ఓవర్‌నైట్ స్కోరుకు మంగళవారం మరో 234 పరుగులు జత చేసింది.
టార్గెట్ ఎంతంటే?
తద్వారా ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది సౌతాఫ్రికా. వన్‌డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (94) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు.. టోనీ డి జోర్జి 49 పరుగులతో రాణించాడు. ఆఖర్లో వియాన్ ముల్డర్ 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా (288+260) టీమిండియాకు ఏకంగా 549 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. కాగా ఆసియాలో ఇంత వరకు ఏ జట్టు కూడా టెస్టుల్లో 400కు పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు. దీంతో టీమిండియా విజయంపై సందేహాలు నెలకొన్నాయి.
మరి టెస్టుల్లో భారత్ అత్యధిక లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? (టాప్-5 జాబితా)
🏏1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టార్గెట్ 403.. భారత్ విజయం (406/4)
🏏2008లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టార్గెట్ 387.. భారత్ విజయం (387/4)
🏏2021లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టార్గెట్ 328.. భారత్ విజయం (329/7)
🏏2011లో ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో టార్గెట్ 276.. భారత్ విజయం (276/5)
🏏2001లో కాండీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లో టార్గెట్ 264.. భారత్ విజయం (264/5).
చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి


