భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. ఈ ఫార్మాట్, ఆ ఫార్మాట్ అన్న తేడా లేకుండా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం భారత అండర్-19 జట్టులో భాగంగా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న అతను.. ఇవాళ (జనవరి 7) జరుగుతున్న మూడో యూత్ వన్డేలో మెరుపు అర్ద శతకం (24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 11 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేసింది. వైభవ్ (29 బంతుల్లో 57), ఆరోన్ జార్జ్ (38 బంతుల్లో 53) అర్ద సెంచరీలు పూర్తి చేసుకుని ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 2-0తో కైవసం చేసుకుంది.
గత మ్యాచ్‌లోనూ ఇంతే..!
వైభవ్ గత మ్యాచ్‌లోనూ (రెండో వన్డే) ఇదే తరహాలో మెరుపు అర్ద సెంచరీ (68) చేశాడు. అంతకుముందు విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై ఉగ్రరూపం దాల్చి (190) తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. దానికి ముందు అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈపై విధ్వంసకర శతకం (171) బాదాడు. అదే టోర్నీలో మలేషియాపై మెరుపు అర్ద సెంచరీ చేశాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవలికాలంలో వైభవ్ ప్రతి రెండు, మూడు ఇన్నింగ్స్‌లకు ఓ సుడిగాలి అర్ద శతకం కానీ మెరుపు శతకం కానీ చేశాడు. త్వరలో జరుగనున్న అండర్-19 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌కు వైభవే కెప్టెన్.
అండర్-19 ప్రపంచకప్ జింబాబ్వే, నమీబియా వేదికలుగా జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్ ఆయుశ్ మాత్రే సారథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల భారత యువ జట్టు ఆసియా కప్ ఫైనల్లో పాక్ చేతిలో ఓడిపోయి కసితో రగిలిపోతుంది.


