ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 15వ సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. యాషెస్ సిరీస్ ముగియడంతో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు తమ తమ బీబీఎల్ ఫ్రాంచైజీల్లో చేరేందుకు సిద్దమయ్యారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఉస్మాన్ ఖవాజాతో పాటు మార్నస్ లబుషేన్ ఇప్పటికే బ్రిస్బేన్ హీట్ జట్టులో చేరారు.
ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లలో బ్రిస్బేన్ హీట్ కెప్టెన్‌గా ఖవాజా వ్యవహరించనున్నాడు. జనవరి 10న సిడ్నీ థండర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో లబుషేన్, ఖవాజా ఆడనున్నారు. అదేవిధంగా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ సిడ్నీ సిక్సర్స్ తరపున బరిలోకి దిగనున్నారు.
హోబర్ట్ హరికేన్స్‌తో జరిగే మ్యాచ్‌కు వీరద్దరూ అందుబాటులో ఉండనున్నారు. యాషెస్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' నిలిచిన స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వారం రోజులు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఆ తర్వాత జనవరి 16న సిడ్నీతో జరిగే మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్ తరపున స్టార్క్ ఆడనున్నాడు.
స్టార్క్ బీబీఎల్‌లో ఆడనుండడం 11 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలెక్స్ కారీ (అడిలైడ్ స్ట్రైకర్స్), జోష్ ఇంగ్లిష్ రిచర్డ్‌సన్ (పెర్త్ స్కార్చర్స్), బ్రెండన్ డాగెట్ (మెల్బోర్న్ రెనెగేడ్స్) కూడా తమ జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు.
హెడ్, గ్రీన్ దూరం...
అయితే ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్ దూరంగా ఉండనున్నారు. వాస్తవానికి హెడ్ అడిలైడ్ స్ట్రైకర్స్, గ్రీన్ పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడాల్సి ఉండేది. కానీ వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా వీరిద్దరూ విశ్రాంతి తీసుకోనున్నారు. నేరుగా వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. హెడ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో హెడ్ 629 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! ఆంధ్ర ప్లేయర్‌కు ఛాన్స్?


