భారత పురుషల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిలో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. జనవరి 11 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే వడోదర వేదికగా ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి రావడంతో జట్టును నడిపించనున్నాడు. అదేవిధంగా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఇటీవల జరిగిన అన్ని ఫిట్‌నెస్ పరీక్షలో అతడు ఉత్తర్ణీత సాధించాడు. దీంతో అతడు కూడా కివీస్‌తో సిరీస్‌లో ఆడనున్నాడు.
బ్రేస్‌వెల్ సారథ్యంలో కివీస్ జట్టు కూడా భారత్ గడ్డపై అడుగుపెట్టింది. సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే పర్యాటక జట్టుతో పోలిస్తే టీమిండియా పటిష్టంగా ఉంది. ఈ సిరీస్ కివీ స్టార్ ప్లేయర్లు మిచెల్ సాంట్నర్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ దూరమయ్యారు. భారత్ మాత్రం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ప్లేయర్లతో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు కూర్పుపై ఓ లుక్కేద్దాం.
యశస్వికి నో ఛాన్స్..?
సౌతాఫ్రికా సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ దూరంగా ఉండడంతో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైశ్వాల్ ఆరంభించాడు. గిల్ తిరిగి రావడంతో ఓపెనర్ జైశ్వాల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మూడు, నాలుగు స్ధానల్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు రానున్నారు.
అయితే తుది జట్టులో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కే అవకాశముంది. కాగా హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడంతో నితీశ్‌కు ప్రధాన జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా రిషబ్ పంత్ మరోసారి తుది జట్టులో చోటు దక్కే సూచనలు కన్పించనున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా కొనసాగనున్నాడు.
సౌతాఫ్రికా సిరీస్‌లోనూ పంత్ బెంచ్‌కే పరిమతం కావాల్సి వచ్చింది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా చోటు దక్కించుకోనున్నాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో హర్షిత్ రాణాపై జట్టు మెనెజ్‌మెంట్ నమ్మకం ఉంచనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు అర్ష్‌దీప్, మహ్మద్ సిరాజ్ బంతిని పంచుకోనున్నారు. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఉండనున్నాడు.
కివీస్‌తో తొలి వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, నితీశ్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సిరాజ్
చదవండి: WPL 2026: గుజరాత్ జెయింట్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్


