పాకిస్తాన్‌కు ఘోర అవమానం | Insult To Pakistan Fans: Ahead Of T20 WC 2026 SENA Concerns Emerge | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు ఘోర అవమానం

Jan 31 2026 12:11 PM | Updated on Jan 31 2026 12:50 PM

Insult To Pakistan Fans: Ahead Of T20 WC 2026 SENA Concerns Emerge

గత కొంతకాలంగా విదేశీ జట్లు పాకిస్తాన్‌కు పర్యటనకు వచ్చి ఆల్‌ఫార్మాట్‌ సిరీస్‌లు ఆడుతున్నాయి. బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి ఆసియా జట్లతో పాటు.. SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

కెప్టెన్‌ సహా కీలక ప్లేయర్లు దూరం
ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియా పాక్‌ పర్యటనకు వెళ్లింది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి సన్నాహకంగా ఆతిథ్య జట్టుతో మూడు టీ20లకు షెడ్యూల్‌ ఖరారు కాగా.. లాహోర్‌లో తొలి టీ20లో పాక్‌ గెలిచింది. అయితే, ఈ మ్యాచ్‌కు ఆసీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో ట్రవిస్‌ హెడ్‌ జట్టును ముందుకు నడిపించాడు.

మార్ష్‌తో పాటు మార్కస్‌ స్టొయినిస్‌, జోష్‌ ఇంగ్లిస్‌, బెన్‌ డ్వార్షుయిస్‌ తదితర స్టార్లు కూడా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నారు. ఇక ఈ సిరీస్‌కు ముందే ప్యాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, టిమ్‌ డేవిడ్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, నాథన్‌ ఎల్లిస్‌ వంటి కీలక ఆటగాళ్లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) విశ్రాంతినిచ్చింది. వీళ్లంతా ఇప్పుడిప్పుడే గాయాల నుంచి కోలుకున్నందున సీఏ ఈ నిర్ణయం తీసుకుందని భావించవచ్చు.

ముగ్గురి అరంగేట్రం
అంతేకాదు పాక్‌తో తొలి టీ20 సందర్భంగా ఆసీస్‌ ఏకంగా ముగ్గురు ఆటగాళ్లను అరంగేట్రం చేయించింది. మహ్లి బియర్డ్‌మాన్‌, జాక్‌ ఎడ్వర్డ్స్‌లకు తొలిసారి క్యాపులు అందించిన సీఏ.. మ్యాట్‌ రెన్షాకు తొలి టీ20 అవకాశం ఇచ్చింది. అయితే, అంతకుముందు మిగిలిన SENA దేశాల జట్లు కూడా తమ కీలక ఆటగాళ్లను కాకుండా.. మెజారిటీ భాగం ద్వితీయ శ్రేణి జట్లతోనే పాక్‌లో పర్యటించాయి.

ఘోర అవమానం ఇది
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ స్థాయి దిగజారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాక్‌ను తేలికగా తీసుకుంటున్నందునే ఈ మేటి జట్లు తమ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయనే అభిప్రాయాలు పెరిగాయి. పాక్‌ క్రికెట్‌ విశ్లేషకుడు ఒమైర్‌ అలవి కూడా ఇదే మాట అంటున్నాడు.

‘‘తమ జట్టులోని కొంతమంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే ఆస్ట్రేలియా ఇక్కడికి వచ్చింది.  అదే విధంగా.. తొలి టీ20లో వారి అత్యుత్తమ ప్లేయర్లను ఆడించనేలేదు. నా దృష్టిలో పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానులకు ఇది ఘోర అవమానం’’ అని ఒమైర్‌ విచారం వ్యక్తం చేశాడు.

వీకెండ్‌ జట్లతో పాకిస్తాన్‌కు
ఇక పాక్‌ మాజీ కెప్టెన్‌ మొయిన్‌ ఖాన్‌ కూడా ఇలాగే స్పందించాడు. ‘‘ఇటీవల కాలంలో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు తమ వీకెండ్‌ జట్లతో పాకిస్తాన్‌కు వచ్చాయి. ఏదో సిరీస్‌ ఆడాలి కాబట్టి మొక్కుబడిగా ఈ పని చేస్తున్నాయని అనిపిస్తోంది’’ అని ఒక రకంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తీరును ఎద్దేవా చేశాడు.

సిరీస్‌ గెలిస్తే చాలు
అయితే, పాక్‌ జట్టు మాజీ చీఫ్‌ సెలక్టర్‌ హారూన్‌ రషీద్‌ మాత్రం అవమానంలో కూడా మంచి వెదికే ప్రయత్నం చేశాడు. ‘‘సిరీస్‌లో ఏ ఆటగాళ్లు ఆడుతున్నారన్న అంశంతో సంబంధం లేదు. ప్రత్యర్థి ఎవరైనా.. ఎలా ఉన్న ద్వైపాక్షిక సిరీస్‌ గెలిచామన్న సంతోషం ఉంటుంది. 

వాళ్లు బెస్ట్‌ ప్లేయర్లను పంపినా.. ఇంకెవరిని పంపినా మనకేమీ ఇబ్బంది లేదు. సిరీస్‌ గెలిస్తే చాలు’’ అని పాక్‌ ఆట తీరును కొనియాడుతూనే.. తెలియకుండానే పాక్‌ ప్రస్తుత జట్టును తక్కువ చేసేలా మాట్లాడాడు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 ప్రపంచకప్‌ టోర్నీ జరుగనుండగా.. భారత్‌లో కాకుండా.. తటస్థ వేదికైన శ్రీలంకలో పాక్‌ తమ మ్యాచ్‌లు ఆడుతుంది.

చదవండి: WC 2026: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement