ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. లాహోర్ వేదికగా పర్యాటక జట్టును 22 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తాము టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడే విషయాన్ని పరోక్షంగా ధ్రువీకరించాడు.
నేను మూడో స్థానంలోనే వస్తా
ఆసీస్‌తో తొలి టీ20లో తాను వన్‌డౌన్‌లో వచ్చానన్న సల్మాన్.. వరల్డ్‌కప్ టోర్నీలోనూ ఇదే కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. ‘‘ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ ముందు నుంచి బాగుంది. అయితే, అనుకున్న రీతిలో భారీ స్కోరు సాధించలేకపోయాము.
పది ఓవర్ల ఆట ముగిసిన తర్వాత బంతి బ్యాట్ మీదకు రాలేదు. నేను మూడో స్థానంలోనే కొనసాగుతాను. మున్ముందు మేము ఎక్కువగా స్పిన్ బౌలింగ్‌నే ఎదుర్కోబోతున్నాం. అందుకే పవర్ ప్లేలో నేను ఆధిపత్యం కొనసాగించగలనని భావిస్తున్నా.
ఈ మ్యాచ్‌లో 170 పరుగులు మెరుగైన స్కోరు అని భావించాను. ఇంకో 10- 15 పరుగులు ఎక్కువగా చేసినా బాగుండేది. ఈరోజు అబ్రార్ అద్భుతంగా ఆడాడు. మా స్పిన్నర్లు అదరగొట్టడం ఖాయం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.
బాబర్‌కు షాక్
కాగా టీ20లలో సల్మాన్ ఆఘా సాధారణంగా టాప్-6లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. వన్‌డౌన్‌లో బాబర్ ఆజం బ్యాటింగ్ చేసేవాడు. అయితే, ఆసీస్‌తో తొలి టీ20లో సల్మాన్ తనను తాను టాప్-3కి ప్రమోట్ చేసుకోగా.. బాబర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము వరల్డ్‌కప్ నుంచి వైదొలుగుతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రగల్బాలు పలుకుతున్న వేళ.. కెప్టెన్ సల్మాన్ ఆఘా మాత్రం తాను టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని చెప్పడం గమనార్హం.
సయీమ్ అయూబ్ ధనాధన్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆసీస్‌తో తొలి టీ20లో మొదట పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సయీమ్ అయూబ్ (22 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ సల్మాన్ ఆఘా (39; 1 ఫోర్, 4 సిక్స్‌లు), బాబర్ ఆజమ్ (24; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. కామెరాన్ గ్రీన్ (36; 3 ఫోర్లు, 1 సిక్స్), జేవియర్ బార్ట్‌లెట్ (34 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది.
కెప్టెన్ హెడ్ (13 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... మిగిలినవాళ్లు విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో సయీమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడే రెండో టీ20 జరగనుంది.
చదవండి: ICC vs BCB: బంగ్లాదేశ్‌కు షాక్.. తొలిసారి స్పందించిన శ్రీలంక


