క్యాండిడేట్స్‌ టోర్నీకి హంపి దూరం! | Koneru Humpy away from Candidates Tournament | Sakshi
Sakshi News home page

క్యాండిడేట్స్‌ టోర్నీకి హంపి దూరం!

Mar 17 2026 4:02 AM | Updated on Mar 17 2026 4:02 AM

Koneru Humpy away from Candidates Tournament

ఈనెల 29 నుంచి సైప్రస్‌లో మెగా ఈవెంట్‌

‘వార్‌ జోన్‌’కు సమీపంలోనే ఆతిథ్య దేశం

ఇటీవల సైప్రస్‌లోని బ్రిటిష్‌ ఎయిర్‌బేస్‌పై ఇరాన్‌ డ్రోన్‌ దాడి

వేదిక మార్చేందుకు ‘ఫిడే’ అనాసక్తి  

బెంగళూరు: రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్, భారత స్టార్‌ కోనేరు హంపి ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ నుంచి వైదొలగాలనే యోచనలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటం... క్యాండిడేట్స్‌ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న సైప్రస్‌ దేశం ‘వార్‌ జోన్‌’కు సమీపంలోనే ఉండటం... మార్చి ఒకటో తేదీన సైప్రస్‌లోని బ్రిటిష్‌ ఎయిర్‌బేస్‌పై ఇరాన్‌ డ్రోన్‌తో దాడి చేయడం... కొన్ని రోజులపాటు విమాన సర్వీసులు నిలిచిపోవడం... ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావడంతో అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) టోర్నీ వేదిక మార్చేందుకు అనాసక్తి చూపించడం... వెరసి హంపి ఈ టోర్నీకి దూరంగా ఉండాలని భావిస్తోంది. 

మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు సైప్రస్‌లోని పెయియా నగరంలో క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీ జరగనుంది. గత ఏడాది నవంబర్‌లో క్యాండిడేట్స్‌ టోర్నీ ఆతిథ్య హక్కులు సైప్రస్‌కు లభించాయి. ఏకకాలంలో పురుషుల, మహిళల విభాగంలో క్యాండిడేట్స్‌ టోర్నీని నిర్వహించనున్నారు. మహిళల విభాగంలో కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి (భారత్‌), జు జినెర్, టాన్‌ జోంగి (చైనా), అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా, కాటరీనా లాగ్నో (రష్యా), బిబిసారా అసయుబయేవా (కజకిస్తాన్‌) అర్హత సాధించారు. 

పురుషుల విభాగంలో ప్రజ్ఞానంద (భారత్‌), అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌), మథియాస్‌ బ్లూబామ్‌ (జర్మనీ), హికారు నకముర, కరువానా (అమెరికా), జవోఖిర్‌ సిందరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌), వె యి (చైనా), ఆండ్రీ ఎసిపెంకో (రష్యా) బరిలో ఉన్నారు. పురుషుల విభాగం విజేత ప్రస్తుత క్లాసికల్‌ ఫార్మాట్‌ ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ (భారత్‌)తో... మహిళల విభాగం విజేత ప్రస్తుత క్లాసికల్‌ ఫార్మాట్‌ ప్రపంచ చాంపియన్‌ వెన్‌ జున్‌ (చైనా)తో ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం తలపడతారు.

ప్రస్తుతం పశ్చిమాసియాకు సమీపంలోని ఏ దేశాలకైనా వెళ్లడం సురక్షితం కాదు. రెండు వారాల క్రితం మొదలైన యుద్ధం మరింత తీవ్రంగా మారింది. ఇప్పటికే ఒకసారి సైప్రస్‌లోని బ్రిటిష్‌ ఎయిర్‌బేస్‌పై ఇరాన్‌ డ్రోన్‌తో దాడిచేసింది. లెబనాన్‌ నుంచి సైప్రస్‌కు విమానాలు కూడా రద్దయ్యాయి. క్రీడాకారుల భద్రత గురించి ‘ఫిడే’ ఆలోచించాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ‘ఫిడే’ చెబుతోంది. కానీ ఈ టోర్నీని వాయిదా వేయాలనే ఉద్దేశం చెస్‌ సమాఖ్యకు లేదనిపిస్తోంది. చెస్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాట్లాడకపోతే అర్థం లేదు. మౌనంగా ఉంటే ఈ ఆట నుంచి ఏమీ నేర్చుకోలేదని భావించాలి. 

నాకైతే క్యాండిడేట్స్‌ టోర్నీ ఎంతో కీలకం. ఇప్పటికే నాకు 39 ఏళ్లు. మళ్లీ నేను ఈ టోర్నీకి అర్హత సాధిస్తానో లేదో గ్యారంటీ లేదు. రెండేళ్లుగా ఈ టోర్నీ కోసం శ్రమిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ టోర్నీని వేరే చోట, వేరే తేదీల్లో నిర్వహించడం శ్రేయస్కరం. ఆట కంటే జీవితం గొప్పది. ఇప్పటికే నేను సైప్రస్‌కు టికెట్లు బుక్‌ చేసుకున్నాను. యుద్ధం ఆగిపోతే చివరి క్షణంలోనైనా ఈ టోర్నీలో ఆడతాను. దోహ మీదుగా కాకుండా ఫ్రాంక్‌ఫర్ట్‌ మీదుగా సైప్రస్‌ చేరుకుంటాను. అయితే ఇప్పట్లో యుద్ధం ఆగేలా కనిపించడం లేదు.   –కోనేరు హంపి

వార్‌ జోన్‌ నుంచి సైప్రస్‌ దూరంలో లేదని మాకు తెలుసు. కొన్ని రోజుల క్రితం ఇక్కడి బ్రిటిష్‌ ఎయిర్‌బేస్‌పై ఇరాన్‌ డ్రోన్‌ దాడి చేసిన మాట వాస్తవం. అయితే ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. ప్రస్తుతం సైప్రస్‌లో ప్రమాదకర పరిస్థితులు కనిపించడం లేదు. టోర్నీ ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయి. టోర్నీని వాయిదా వేయాలనే ఉద్దేశం లేదు.  సైప్రస్‌ దేశాధ్యక్షుడు స్వయంగా ఈ టోర్నీని ప్రారంభిస్తారు. –‘ఫిడే’ సీఈఓ ఎమిల్‌ సుతోవ్‌స్కీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement