Koneru Humpy
-
‘హంపి తప్పు చేసింది’
న్యూఢిల్లీ: ‘ఫిడే’ మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి వైదొలిగిన తీరును నిర్వాహకులు తప్పుబట్టారు. ఇది ఆటను, తోటి ప్లేయర్లను, టోర్నీ నిర్వాహకులను అవమానించడమే అని సైప్రస్ చెస్ సమాఖ్య (సీసీఎఫ్) అధ్యక్షుడు క్రిటాన్ టొర్నారిటిస్ పేర్కొన్నాడు. ఈ నెల 29 నుంచి సైప్రస్ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానుండగా... పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో... భద్రతను దృష్టిలో పెట్టుకొని టోర్నీ నుంచి తప్పుకున్నట్లు హంపి ప్రకటించింది. ఒకవైపు యుద్ధం జరుగుతుంటే... మరోవైపు ప్రశాంతంగా ఆటపై మనసు ఎలా లగ్నం చేయగలమని రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచిన హంపి ప్రశ్నించింది. ‘సైప్రస్ చెస్ అధ్యక్షుడిగా హంపి నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. సైప్రస్ సురక్షితం కాదు అని హంపి తప్పుకుంది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చదరంగ ఈవెంట్లలో మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ ఒకటి. అనవసర ఆందోళనలతో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం ఆటకు చేటు చేస్తుంది’ అని టొర్నారిటిస్ అన్నాడు. అయితే హంపి ఒక్కతే ఈ టోర్నమెంట్‌కు దూరం కాగా... భారత్ నుంచి ప్రజ్ఞానంద, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. గతేడాది ఈ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన హంపి... ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీని అక్కడ నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని... యుద్ధ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కూడా పోటీలు నిర్వహించొచ్చు అని ఆదివారం ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. -
క్యాండిడేట్స్ టోర్నీకి హంపి దూరం!
బెంగళూరు: రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్, భారత స్టార్ కోనేరు హంపి ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి వైదొలగాలనే యోచనలో ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటం... క్యాండిడేట్స్ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న సైప్రస్ దేశం ‘వార్ జోన్’కు సమీపంలోనే ఉండటం... మార్చి ఒకటో తేదీన సైప్రస్‌లోని బ్రిటిష్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ డ్రోన్‌తో దాడి చేయడం... కొన్ని రోజులపాటు విమాన సర్వీసులు నిలిచిపోవడం... ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావడంతో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) టోర్నీ వేదిక మార్చేందుకు అనాసక్తి చూపించడం... వెరసి హంపి ఈ టోర్నీకి దూరంగా ఉండాలని భావిస్తోంది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు సైప్రస్‌లోని పెయియా నగరంలో క్యాండిడేట్స్ చెస్ టోర్నీ జరగనుంది. గత ఏడాది నవంబర్‌లో క్యాండిడేట్స్ టోర్నీ ఆతిథ్య హక్కులు సైప్రస్‌కు లభించాయి. ఏకకాలంలో పురుషుల, మహిళల విభాగంలో క్యాండిడేట్స్ టోర్నీని నిర్వహించనున్నారు. మహిళల విభాగంలో కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి (భారత్), జు జినెర్, టాన్ జోంగి (చైనా), అలెగ్జాండ్రా గొర్యాక్చినా, కాటరీనా లాగ్నో (రష్యా), బిబిసారా అసయుబయేవా (కజకిస్తాన్) అర్హత సాధించారు. పురుషుల విభాగంలో ప్రజ్ఞానంద (భారత్), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), మథియాస్ బ్లూబామ్ (జర్మనీ), హికారు నకముర, కరువానా (అమెరికా), జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్), వె యి (చైనా), ఆండ్రీ ఎసిపెంకో (రష్యా) బరిలో ఉన్నారు. పురుషుల విభాగం విజేత ప్రస్తుత క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ (భారత్)తో... మహిళల విభాగం విజేత ప్రస్తుత క్లాసికల్ ఫార్మాట్ ప్రపంచ చాంపియన్ వెన్ జున్ (చైనా)తో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం తలపడతారు.ప్రస్తుతం పశ్చిమాసియాకు సమీపంలోని ఏ దేశాలకైనా వెళ్లడం సురక్షితం కాదు. రెండు వారాల క్రితం మొదలైన యుద్ధం మరింత తీవ్రంగా మారింది. ఇప్పటికే ఒకసారి సైప్రస్‌లోని బ్రిటిష్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ డ్రోన్‌తో దాడిచేసింది. లెబనాన్ నుంచి సైప్రస్‌కు విమానాలు కూడా రద్దయ్యాయి. క్రీడాకారుల భద్రత గురించి ‘ఫిడే’ ఆలోచించాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ‘ఫిడే’ చెబుతోంది. కానీ ఈ టోర్నీని వాయిదా వేయాలనే ఉద్దేశం చెస్ సమాఖ్యకు లేదనిపిస్తోంది. చెస్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేను ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాట్లాడకపోతే అర్థం లేదు. మౌనంగా ఉంటే ఈ ఆట నుంచి ఏమీ నేర్చుకోలేదని భావించాలి. నాకైతే క్యాండిడేట్స్ టోర్నీ ఎంతో కీలకం. ఇప్పటికే నాకు 39 ఏళ్లు. మళ్లీ నేను ఈ టోర్నీకి అర్హత సాధిస్తానో లేదో గ్యారంటీ లేదు. రెండేళ్లుగా ఈ టోర్నీ కోసం శ్రమిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ టోర్నీని వేరే చోట, వేరే తేదీల్లో నిర్వహించడం శ్రేయస్కరం. ఆట కంటే జీవితం గొప్పది. ఇప్పటికే నేను సైప్రస్‌కు టికెట్లు బుక్ చేసుకున్నాను. యుద్ధం ఆగిపోతే చివరి క్షణంలోనైనా ఈ టోర్నీలో ఆడతాను. దోహ మీదుగా కాకుండా ఫ్రాంక్ఫర్ట్ మీదుగా సైప్రస్ చేరుకుంటాను. అయితే ఇప్పట్లో యుద్ధం ఆగేలా కనిపించడం లేదు. –కోనేరు హంపివార్ జోన్ నుంచి సైప్రస్ దూరంలో లేదని మాకు తెలుసు. కొన్ని రోజుల క్రితం ఇక్కడి బ్రిటిష్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసిన మాట వాస్తవం. అయితే ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. ప్రస్తుతం సైప్రస్‌లో ప్రమాదకర పరిస్థితులు కనిపించడం లేదు. టోర్నీ ఏర్పాట్లు చివరి దశలో ఉన్నాయి. టోర్నీని వాయిదా వేయాలనే ఉద్దేశం లేదు. సైప్రస్ దేశాధ్యక్షుడు స్వయంగా ఈ టోర్నీని ప్రారంభిస్తారు. –‘ఫిడే’ సీఈఓ ఎమిల్ సుతోవ్‌స్కీ -
టైటిల్‌కు చేరువలో హంపి
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి టైటిల్‌కు చేరువైంది. అలీనా కష్లిన్స్కాయ (పోలాండ్)తో మంగళవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను హంపి 61 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మరోవైపు చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినెర్ 50 ఎత్తుల్లో భారత్‌కే చెందిన జూనియర్ ప్రపంచ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్‌ను ఓడించింది. ఎనిమిదో రౌండ్ తర్వాత హంపి, జు జినెర్ ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరులో జు జినెర్పై హంపి పైచేయిగా ఉంది. నేడు జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)తో హంపి; పొలీనా షువలోవా (రష్యా)తో జు జినెర్ తలపడతారు. భారత ఇతర గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్‌బాబు తమ ఎనిమిదో రౌండ్ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మెలియా సలోమి (జార్జియా)తో గేమ్‌ను హారిక 116 ఎత్తుల్లో... సలీమోవాతో గేమ్‌ను వైశాలి 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా), పొలీనా షువలోవా మధ్య జరిగిన మరో గేమ్ 91 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. ఎనిమిదో రౌండ్ తర్వాత దివ్య దేశ్‌ముఖ్ ఐదు పాయింట్లతో మూడో స్థానంలో, నాలుగు పాయింట్లతో హారిక ఐదో స్థానంలో, 3.5 పాయింట్లతో వైశాలి ఆరో స్థానంలో ఉన్నారు. -
హంపి, హారిక తొలి గెలుపు
పుణే: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె చెస్ టోర్నమెంట్లో మూడో రోజు భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక సత్తా చాటుకున్నారు. వీరిద్దరు ఈ టోర్నీలో తొలి విజయాన్ని అందుకున్నారు. బుధవారం జరిగిన మూడో రౌండ్ గేముల్లో ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి హంపి తెల్ల పావులతో ఆడుతూ 53 ఎత్తుల్లో ప్రపంచ జూనియర్ చాంపియన్, భారత్‌కే చెందిన రైజింగ్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్‌ను ఓడించింది.తొలి రెండు రౌండ్ గేముల్లో నెగ్గిన దివ్యకిది తొలి ఓటమి కావడం గమనార్హం. మరో గేమ్‌లో హైదరాబాద్‌కు చెందిన హారిక 68 ఎత్తుల్లో నుర్గుల్ సలీమోవా (బల్గేరియా)పై గెలిచి ఈ టోర్నీలో తొలి గెలుపు రుచి చూసింది. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు రెండో ‘డ్రా’ నమోదు చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను వైశాలి 63 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. మరోవైపు బత్కుయాగ్ మున్‌గున్‌తుల్ (మంగోలియా) 34 ఎత్తుల్లో అలీనా కష్లిన్స్కాయా (పోలాండ్)పై గెలుపొందగా... జు జినెర్ (చైనా)–మెలియా సలోమి (జార్జియా) మధ్య గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. -
రన్నరప్ హంపి
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): అద్భుతమైన ఎత్తులతో ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ... భారత చెస్ స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. గురువారం ముగిసిన మహిళల ర్యాపిడ్ ఈవెంట్లో కోనేరు హంపి విజేతను నిర్ణయించిన ‘ప్లే ఆఫ్’ టైబ్రేక్స్‌లో 1.5–2.5 పాయింట్ల తేడాతో అనస్తాసియా బొద్నారుక్ (రష్యా) చేతిలో ఓడిపోయి రజత పతకం సొంతం చేసుకుంది. ఒత్తిడిలో సంయమనంతో ఆడిన అనస్తాసియా తొలిసారి ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీ చరిత్రలో హంపికిది మూడో పతకం కావడం విశేషం. 2019లో విశ్వవిజేతగా నిలిచిన హంపి 2012లో కాంస్య పతకం సాధించింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత బొద్నారుక్, హంపి, టింగ్జె లె (చైనా) 8.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా బొద్నారుక్, హంపి తొలి రెండు స్థానాల్లో నిలవడంతో వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ నిర్వహించారు. బ్లిట్జ్ పద్ధతిలో జరిగిన తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడిన హంపి 56 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో హంపి 38 ఎత్తుల్లో ఓడిపోయింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. దాంతో తదుపరి గేమ్‌లో గెలిచిన ప్లేయర్‌కు టైటిల్ ఖరారు చేసే ‘సడన్‌డెత్’ గేమ్‌ను నిర్వహించారు. అయితే ఈ గేమ్ 52 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. అయితే నాలుగో గేమ్‌లో బొద్నారుక్ 39 ఎత్తుల్లో హంపిపై గెలిచి టైటిల్‌ను ఖరారు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు నూతక్కి ప్రియాంక, సాహితి వర్షిణి 7 పాయింట్లతో వరుసగా 22వ, 23వ స్థానాల్లో నిలిచారు. 13 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ 9 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద 9 పాయింట్లతో 8వ స్థానంలో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 8.5 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచారు. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 10 పాయింట్లతో మరోసారి ప్రపంచ చాంపియన్ అయ్యాడు. -
సీఎం జగన్‌ను కలిసిన ఏషియన్ గేమ్స్ క్రీడాకారులు
సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న ఏపీ క్రీడాకారులు కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి.. సీఎం జగన్‌ను ఇవాళ క్యాంప్ కార్యాలయంలో కలిశారు. క్రీడాకారుల్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దగ్గరుండి సీఎం జగన్‌కు కలిపించారు. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో సాధించిన పతకాలను విజేతలు సీఎం జగన్‌కు చూపించారు. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. మొత్తం రూ. 4.29 కోట్లను క్రీడాకారులకు ప్రభుత్వం అందించింది. ఇదీ చదవండి: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్ -
మూడో ర్యాంక్‌లో హంపి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) మహిళల ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి 2,577 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. రెండేళ్ల విరామం తర్వాత... ఇటీవల రష్యాలో జరిగిన గ్రాండ్‌ప్రి టోరీ్నలో పాల్గొన్న హంపి విజేతగా నిలిచి 17 రేటింగ్ పాయింట్లను సంపాదించింది. హు ఇఫాన్ (చైనా–2,659) టాప్ ర్యాంక్‌లో... ప్రపంచ చాంపియన్ జూ వెన్ జున్ (చైనా–2,586) రెండో స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ హారిక 2,495 రేటింగ్ పాయింట్లతో 13వ ర్యాంక్‌లో ఉంది. ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ (2,748) 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
హంపికి రెండో విజయం
షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ మూడో ర్యాంకర్ కోనేరు హంపి రెండో విజయం సాధించింది. తాతియానా కొసింత్సెవా (రష్యా)తో సోమవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో హంపి 60 ఎత్తుల్లో గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగో ‘డ్రా’ నమోదు చేసుకుంది. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన గేమ్‌ను హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఏడో రౌండ్ తర్వాత హంపి ఖాతాలో మూడు, హారిక ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. మంగళవారం జరిగే ఎనిమిదో రౌండ్లో అనా ఉషెనినాతో హంపి; చెన్ జూ (ఖతార్)తో హారిక తలపడతారు. -
ఆధిక్యంలో హంపి
తాష్కెంట్: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆధిక్యంలో కొనసాగుతోంది. కాటరీనా లాగ్నో (ఉక్రెయిన్)తో శనివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను హంపి 23 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కూడా తన గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. జూ వెన్జున్ (చైనా)తో జరిగిన గేమ్‌ను హారిక 43 ఎత్తుల్లో ‘డ్రా’ చేసింది. నాలుగో రౌండ్ తర్వాత హంపి మూడున్నర పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉండగా... మూడు పాయింట్లతో హారిక రెండో స్థానంలో ఉంది. ఆదివారం విశ్రాంతి దినం. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీ ఈనెల 30న ముగుస్తుంది.


