‘హంపి తప్పు చేసింది’ | President of the Cyprus Chess Federation comments on Koneru Humpy | Sakshi
Sakshi News home page

‘హంపి తప్పు చేసింది’

Mar 25 2026 4:18 AM | Updated on Mar 25 2026 4:18 AM

President of the Cyprus Chess Federation comments on Koneru Humpy

సైప్రస్‌ చెస్‌ సమాఖ్య అధ్యక్షుడు టొర్నారిటిస్‌ వ్యాఖ్య 

న్యూఢిల్లీ: ‘ఫిడే’ మహిళల క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ నుంచి భారత స్టార్‌ చెస్‌ క్రీడాకారిణి కోనేరు హంపి వైదొలిగిన తీరును నిర్వాహకులు తప్పుబట్టారు. ఇది ఆటను, తోటి ప్లేయర్లను, టోర్నీ నిర్వాహకులను అవమానించడమే అని సైప్రస్‌ చెస్‌ సమాఖ్య (సీసీఎఫ్‌) అధ్యక్షుడు క్రిటాన్‌ టొర్నారిటిస్‌ పేర్కొన్నాడు. ఈ నెల 29 నుంచి సైప్రస్‌ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానుండగా... పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో... భద్రతను దృష్టిలో పెట్టుకొని టోర్నీ నుంచి తప్పుకున్నట్లు హంపి ప్రకటించింది. 

ఒకవైపు యుద్ధం జరుగుతుంటే... మరోవైపు ప్రశాంతంగా ఆటపై మనసు ఎలా లగ్నం చేయగలమని రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా నిలిచిన హంపి ప్రశ్నించింది. ‘సైప్రస్‌ చెస్‌ అధ్యక్షుడిగా హంపి నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. సైప్రస్‌ సురక్షితం కాదు అని హంపి తప్పుకుంది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చదరంగ ఈవెంట్‌లలో మహిళల క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ ఒకటి. అనవసర ఆందోళనలతో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం ఆటకు చేటు చేస్తుంది’ అని టొర్నారిటిస్‌ అన్నాడు. 

అయితే హంపి ఒక్కతే ఈ టోర్నమెంట్‌కు దూరం కాగా... భారత్‌ నుంచి ప్రజ్ఞానంద, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్‌ ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. గతేడాది ఈ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన హంపి... ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీని అక్కడ నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని... యుద్ధ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కూడా పోటీలు నిర్వహించొచ్చు అని ఆదివారం ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.   

Advertisement
 
Advertisement
Advertisement