breaking news
ccf
-
‘హంపి తప్పు చేసింది’
న్యూఢిల్లీ: ‘ఫిడే’ మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి భారత స్టార్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి వైదొలిగిన తీరును నిర్వాహకులు తప్పుబట్టారు. ఇది ఆటను, తోటి ప్లేయర్లను, టోర్నీ నిర్వాహకులను అవమానించడమే అని సైప్రస్ చెస్ సమాఖ్య (సీసీఎఫ్) అధ్యక్షుడు క్రిటాన్ టొర్నారిటిస్ పేర్కొన్నాడు. ఈ నెల 29 నుంచి సైప్రస్ వేదికగా ఈ పోటీలు ప్రారంభం కానుండగా... పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో... భద్రతను దృష్టిలో పెట్టుకొని టోర్నీ నుంచి తప్పుకున్నట్లు హంపి ప్రకటించింది. ఒకవైపు యుద్ధం జరుగుతుంటే... మరోవైపు ప్రశాంతంగా ఆటపై మనసు ఎలా లగ్నం చేయగలమని రెండుసార్లు ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌గా నిలిచిన హంపి ప్రశ్నించింది. ‘సైప్రస్ చెస్ అధ్యక్షుడిగా హంపి నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. సైప్రస్ సురక్షితం కాదు అని హంపి తప్పుకుంది. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చదరంగ ఈవెంట్లలో మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ ఒకటి. అనవసర ఆందోళనలతో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడం ఆటకు చేటు చేస్తుంది’ అని టొర్నారిటిస్ అన్నాడు. అయితే హంపి ఒక్కతే ఈ టోర్నమెంట్‌కు దూరం కాగా... భారత్ నుంచి ప్రజ్ఞానంద, వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. గతేడాది ఈ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన హంపి... ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీని అక్కడ నిర్వహించాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని... యుద్ధ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత కూడా పోటీలు నిర్వహించొచ్చు అని ఆదివారం ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. -
సరుగుడు తోట దగ్ధం
* 50 ఎకరాల్లోని చెట్లు అగ్నికి ఆహుతి * 40 లక్షల ఆస్తి నష్టం మలికిపురం : మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామంలోని సముద్ర తీరంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీరంలోని సీసీఎఫ్‌కు చెందిన సుమారు 50 ఎకరాల్లోని సరుగుడు తోట దగ్ధమై రూ.40 లక్షల ఆస్తి నష్టం వాటెల్లింది. బీచ్‌కు వచ్చే ఆకతాయిలు సిగరెట్లు పడేయడం వల్ల మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికు లు భావిస్తున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకూ అనగా గంట వ్యవధిలో 50 ఎకరాల్లోని పంట కాలిబూడిదైంది. ప్రమాద స్థలాన్ని తహశీల్దారు బత్తుల ఝాన్సీ పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. దిగబడిపోయిన అగ్నిమాపక వాహనం రైతులు తమ భూముల్లోని సరుగుడు పంటను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కళ్లెదుటే కాలిపోతున్న పంటను చూసి విలవిలలాడిపోయారు. ప్రమాదంపై స్థానిక అగ్నిమాపకశాఖ కేంద్రానికి సమాచారం అందించగా సిబ్బంది సకాలంలో వచ్చారు. అయితే ప్రమాదం స్థలం సమీపంలోనే కొత్తగా వేసిన రోడ్డుపై వాహనం దిగబడిపోయింది. అప్పటికే ఆందోళనలో ఉన్న రైతులు, సర్పంచ్ ఉల్లూరి గోపాలరావు, మండల ఉపాధ్యక్షురాలు రాపాక అరుణ ఆనందకుమార్, ఎంపీటీసీ సభ్యులు ఆచంట నరసింహమూర్తి, సీసీఎఫ్ అధ్యక్షుడు కొంబత్తుల చంద్ర శేఖర్, డెరైక్టర్లు పారలతో ఇసుక వేసి మంటలను కొంత అదుపు చేశారు. అగ్ని మాపక వాహనం ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో పడ్డారు. అయితే అంతకు ముందు సముద్రం నుంచి భారీ కెరటం వచ్చి సమీపంలోని సేలయేరులోకి నీరు చేరడంతో ఆ విషయాన్ని రైతులు అగ్నిమాపక సిబ్బందికి చెప్పారు. దాంతో వారు వాహనంలోని పైపులను సుమారు 200 మీటర్ల మేర వేసి సెలయేరులోని నీటిని మోటార్లుతో తోడి మంటలను ఆర్పారు. అప్పటికే సుమారు 50 ఎకరాల్లోని తోట దగ్ధమైయింది. అరుదుగా తప్ప సాధారణ సమయాల్లో సెలయేరులో నీరు ఉండదని స్థానికులు చెబుతున్నారు. ఆదుకోవాలి దగ్ధమైన సరుగుడు తోటల రైతులంతా పేదలని..వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ ఉల్లూరి గోపాలరావు, మండల ఉపాధ్యక్షురాలు రాపాక అరుణకుమారి, ఎంపీటీసీలు కోరారు. మూడేళ్లుగా వ్యయప్రయాసలతో సాగుచేస్తున్న సరుగుడు తోటలు కాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, నాలుగేళ్లకోసారి కోతకు వచ్చే సరుగుడు తోట పెంచేందుకు ఎకరానికి రూ.2 లక్షల ఖర్చు అవుతోందని రైతు నాయకులు చెప్పారు. తోటలు మరో ఏడాదిలో చేతి కొచ్చేవని, పంట కోల్పోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాద రైతులను పరామర్శించారు.


