తరం మారినా.. ముంబై వాన పాట మారలేదు! | Rimjhim Gire Sawan Sung by Lata Mangeshkar Kishore Kumar was shot in the Real Rain | Sakshi
Sakshi News home page

తరం మారినా.. ముంబై వాన పాట మారలేదు!

Jul 4 2026 7:17 AM | Updated on Jul 4 2026 7:31 AM

Rimjhim Gire Sawan Sung by Lata Mangeshkar Kishore Kumar was shot in the Real Rain

ముంబైని ముంచెత్తుతున్న ప్రస్తుత రుతుపవనాల వాన జల్లులు.. ఐదు దశాబ్దాల క్రితం నాటి అమితాబ్ బచ్చన్ కల్ట్ క్లాసిక్ సాంగ్‌ను మళ్లీ కళ్లముందుకు తెస్తున్నాయి. ‘మంజిల్’ సినిమాలో కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన ‘రిమ్‌ఝిమ్ గిరే సావన్’ నేటికీ ముంబై వర్షాలకు అసలైన బ్రాండ్ అంబాసిడర్. నాటి తరం నుండి నేటి జనరేషన్ వరకు, ముంబై మెరైన్ డ్రైవ్‌లో అరేబియా సముద్ర కెరటాల హోరును చూస్తూ ఈ పాట వినని వారుండరు. అప్పట్లో ఎలాంటి రెయిన్ మెషిన్లు లేకుండా, కేవలం ముంబైలో సహజంగా కురిసే వానలను నమ్ముకుని దర్శకుడు బసు ఛటర్జీ సృష్టించిన విజువల్ వండర్ ఇది. అమితాబ్, మౌషుమి చటర్జీలు తడుస్తూ చేసిన ఆ సహజమైన రొమాన్స్.. నేటికీ ముంబై వీధుల్లో కురుస్తున్న ప్రతి వాన చినుకులోనూ సజీవంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.  

ఎలాంటి అనుమతులు లేకుండా..
బాహుబలి లాంటి భారీ సినిమాల్లో వర్షం సీన్ల కోసం ప్రత్యేకంగా సెట్టింగులు, వేలాది లీటర్ల నీటిని వాడటాన్ని మనం చూస్తుంటాం. కానీ బాలీవుడ్ తెరపై ఐదు దశాబ్దాలుగా వర్షం అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకే పాట ‘రిమ్‌ఝిమ్ గిరే సావన్’. అమితాబ్ బచ్చన్, మౌషుమి చటర్జీలపై చిత్రీకరించిన ఈ పాటను కృత్రిమ వర్షంలో కాకుండా, నిజమైన వర్షంలో షూట్ చేశారనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అసలు ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం నటీనటులకు కూడా తెలియకుండా ఈ పాటను ఎలా చిత్రీకరించారో చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే!

ఐదు దశాబ్దాల కల్ట్ క్లాసిక్
బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన గీతాలు ఉన్నాయి. అందులో ‘మంజిల్’ (1979) సినిమాలోని ‘రిమ్‌ఝిమ్ గిరే సావన్’ పాట వర్ష కాలానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఈ పాట విడుదలై ఇన్నేళ్లు గడుస్తున్నా, నేటికీ సంగీతాభిమానుల ప్లేలిస్ట్‌లో ఇది మొదటి స్థానంలోనే ఉంటుంది. కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ తమ గాత్రంతో అమరత్వం ప్రసాదించిన ఈ మెలోడీ వెనుక సినిమా రంగాన్ని సైతం విస్మయానికి గురిచేసే ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంది.

ముంబై వర్షంలో షూటింగ్
సాధారణంగా సినిమాల్లో వర్షం సీన్ల కోసం రెయిన్ మిషన్లు వాడుతుంటారు. కానీ, ‘మంజిల్’ చిత్ర దర్శకుడు బసు ఛటర్జీ మాత్రం ఈ సీన్ చాలా సహజంగా ఉండాలని పట్టుబట్టారు. అందుకోసం ఆయన ఏకంగా ముంబైలో కురిసే అసలైన రుతుపవనాల వర్షం కోసం వేచి చూశారు. వర్షం పడటమే ఆలస్యం, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే ముంబైలోని ప్రసిద్ధ మెరైన్ డ్రైవ్ రోడ్లపై చిత్ర యూనిట్ కెమెరాలతో రంగంలోకి దిగింది.

డాన్స్ లేని అద్భుత రొమాన్స్
ఈ పాటలో ఎలాంటి కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ గానీ, క్లిష్టమైన డాన్స్ మూమెంట్లు గానీ ఉండవు. దర్శకుడు కేవలం సహజత్వాన్ని నమ్ముకున్నారు. అమితాబ్ బచ్చన్, మౌషుమి చటర్జీ ముంబై వీధుల్లో వర్షంలో తడుస్తూ, నవ్వుకుంటూ, సరదాగా నడుచుకుంటూ వెళ్తుంటారు. ఈ సహజమైన నటన, నిజమైన వర్షపు జల్లులు కలిసి ప్రేక్షకులకు ఒక మరుపురాని అనుభూతిని అందించాయి.

షూటింగ్ జరుగుతున్నట్టే తెలియదు
ఈ పాట షూటింగ్ అనుభవాల గురించి హీరోయిన్ మౌషుమి చటర్జీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు షూటింగ్ ఎప్పుడు మొదలైందో కూడా తమకు తెలియదని అన్నారు. తాము కేవలం వర్షంలో అలా నడుస్తూ, ఒకరినొకరు చూసుకుంటూ ముచ్చటించుకుంటూ వెళ్లామని, ఆ సమయంలో దర్శకుడు చాలా సైలెంట్‌గా ఆ సీన్లను కెమెరాలో బంధించారని ఆమె గుర్తుచేసుకున్నారు.

కరిగిపోయిన కాటుక.. అయినా ఆగని కెమెరా
వర్షం తీవ్రతకు మౌషుమి చటర్జీ కళ్లకు పెట్టుకున్న కాటుక కూడా పూర్తిగా కరిగిపోయి ముఖంపైకి వచ్చేసిందట. అయినా సరే దర్శకుడు బసు ఛటర్జీ కట్ చెప్పకుండా షూటింగ్ కొనసాగించారు. ఆ సహజత్వం, వర్షంలో నటీనటుల పారవశ్యం స్క్రీన్ మీద అద్భుతంగా పండటంతో ఈ రోజుకీ ఆ పాట ఒక విజువల్ వండర్‌గా నిలిచిపోయింది. ఈ గీతానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌డీ బర్మన్ సంగీతం అందించగా, యోగేష్ అద్భుతమైన లిరిక్స్ రాశారు. లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ ఆలపించిన ఈ పాట నేటికీ వర్షం పడిన ప్రతిసారీ రేడియోల్లో, టీవీల్లో సోషల్ మీడియా రీల్స్‌లో మారుమోగుతూనే ఉంటుంది.

ఇది కూడా చదవండి: 2118 నుండి టైమ్ ట్రావెలర్ రాక.. పలు రహస్యాలు వెల్లడి?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement