Health: నిమోనియా హానియా? ఎవరికి ఎక్కువ ముప్పు? | What Is Pneumonia, Know About Its Causes, Symptoms, Diagnosis, Treatment And Prevention In Adults And Children | Sakshi
Sakshi News home page

Health: నిమోనియా హానియా? ఎవరికి ఎక్కువ ముప్పు?

Aug 18 2026 9:51 AM | Updated on Aug 18 2026 10:27 AM

Pneumonia Causes Symptoms Treatment Prevention In Children And Adults

హెల్త్‌

మన ఊపిరితిత్తులు అనునిత్యం శ్వాస తీసుకుంటూ నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. అలా అవి ఏమాత్రం విశ్రాంతి లేకుండా శ్వాస తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే ్రపాణాలు నిలుస్తాయి. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి తీసుకున్న గాలి... ఊపిరితిత్తుల్లోని అతి చివరి అంచె అయిన ‘ఆల్వియోలై’ అనే గాలి గది (ఎయిర్‌ శ్యాక్‌)ని చేరాలి. ఈ ఆల్వియోలై నుంచే బయటి నుంచి మనం తీసుకున్న ఆక్సిజన్‌ మన దేహంలోని అన్ని అవయవాల్లోని కణాలకు అందడమూ, అలాగే లోపలి కలుషితమైన గాలి అక్కడి నుంచే బయటికి రావడం వంటి ‘గ్యాసెస్‌ ఎక్స్ఛేంజ్‌’ ప్రక్రియ చోటుచేసుకుంటుంది. ఏదైనా కారణం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ రావడం వంటి కారణాలతో... గాలి గదిలో (ఆల్వియోలైలో) ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా అందులోకి చీము లేదా తెమడ / ఫ్లెమ్‌ వంటి ద్రవాలు నిండటంతో శ్వాసకు అంతరాయం కలిగితే అది నిమోనియా సమస్యకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో నిమోనియా అంటే ఏమిటో చూద్దాం.

నిమోనియా సమస్య ప్రధానంగా బ్యాక్టీరియా (ఉదా: స్ట్రెప్టోకోకస్‌), వైరస్‌లూ (ఉదా: ఫ్లూ అలాగే రెస్పిరేటరీ సిన్సీషియల్‌ వైరస్‌), ఫంగైలతో పాటు ఏవైనా ఆహార పదార్థాలూ, ద్రవాలు (ఉదా: ఆహారం, నీళ్లు వంటివి) ఊపిరితిత్తులోకి చేరడం వల్ల వచ్చే అవకాశాలెక్కువ.

కారణాలు..

  • బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్‌ బ్యాక్టీరియా (ఇది పెద్దల్లో సాధారణంగా వచ్చేందుకు కారణమవుతుంది), హీమోఫీలస్‌ (పిల్లల్లో సాధారణంగా దీనివల్ల వస్తుంది), గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల.

  • వైరస్‌ వల్ల – ఇన్‌ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సీషియల్‌ వైరస్‌... వంటి వైరస్‌లతో పాటు తరచూ వచ్చే కొత్త వైరస్‌ల వల్ల కూడా నిమోనియా రావచ్చు. ఏదైనా వైరస్‌ విజృంభించి ఒక చోట ఎపిడమిక్‌లా వచ్చి, తన ప్రభావం చూపిన తర్వాత నిమోనియాకు దారితీసే అవకాశాలు ఎక్కువ. ఆ వైరస్‌ సోకిన తర్వాత బాధితుల్లో రోగనిరోధక శక్తిని బట్టి నిమోనియా వచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

  • ఫంగస్‌ వల్ల కూడా.

  • కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్‌ క్రౌడింగ్‌)

  • ఆల్కహాల్‌ అలవాటుతో– (దీని వల్ల వ్యక్తుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ రోగనిరోధక శక్తి (డిఫెన్స్‌ మెకానిజం) తగ్గుతుంది. మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో లోన ఉన్న పడని పదార్థాలు అక్కడే ఉండిపోవడంతో నిమోనియా రావచ్చు.

  • మైక్రో యాస్పిరేషన్‌ – మనకు తెలియకుండానే ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్‌ అంటారు. ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్‌ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు.

లక్షణాలివే...
నిమోనియాలో...

  • జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, చలిగా ఉండటం, ఒక్కోసారి ఆకలి లేకపోవడం

  • తెమడ / కఫం (ఫ్లెమ్‌) ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా / పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు.

  • నిమోనియా ఇన్‌ఫ్లమేషన్‌ ఊపిరితిత్తి తాలూకు పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు.

  • నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూగా రావచ్చు. ఇక ఇంటస్టిషియల్‌ నిమోనియాలో దగ్గు ఉండదు. కాని ఆయాసం మాత్రం ఉంటుంది. ఇది ఎంతటి విషమ పరిస్థితికి దారితీస్తుందంటే... ఒక్కోసారి శ్వాసప్రక్రియ ఆగిపోవచ్చు కూడా.

  • ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. గాని నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని చీము వంటి ద్రవాలు లేదా తెమడ (ఫ్లెమ్‌) వంటివి అడ్డంకిగా ఉండవచ్చు. ఇలా గాలిగదిలో పేరుకునే పదార్థాన్ని ‘ఎగ్జుడస్‌’ అంటారు. ఈ ఎగ్జుడస్‌ కారణంగా గాలిగదిలోకి  ఆక్సిజన్‌ చేరదు. దాంతో దేహానికీ / దేహంలోని కణాలకూ అవసరమైనంత ఆక్సిజన్‌ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు పని చేయలేని పరిస్థితి వస్తుంది. దీన్నే ‘హైపాక్సిక్‌ రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌’ అంటారు.

  • ఊపిరి అందకపోవడంతో నుదుటిపై చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, అయోమయం కారణంగా డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్‌ నిమోనియా’ అంటారు.

  • కొందరు బాధితుల్లో ఛాతీలో తీక్షణమైన / తీవ్రమైన నొప్పి (షార్ప్‌ పెయిన్‌) కూడా  రావచ్చు.

సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే...
నిమోనియాకు సమయానికి తగిన చికిత్స తీసుకోకపోతే జబ్బు మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. అంటే...  సెప్టిసీమియా (రక్తానికంతా ఇన్ఫెక్షన్‌ సోకడం, దీన్నే మామూలు భాషలో రక్తం విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, మెదడుపై దుష్ప్రభావం పడటం కాంప్లికేషన్లు రావచ్చు. కొందరిలో మరణం కూడా సంభవించవచ్చు.

నిమోనియా ఎవరెవరిలో... 
నిమోనియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చాలా చిన్న పిల్లలు మొదలుకొని, అరవై ఏళ్లు దాటిన వృద్ధుల వరకు అందరిలోనూ కనిపించవచ్చు. సాధారణంగా ఈ వయసు వారిలో వ్యాధి నిరోధకశక్తి / వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరు తక్కువ కాబట్టి నిమోనియా చిన్నపిల్లల్లోనూ, వయస్సు పైబడ్డవారిలోనూ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది.

  • ఆహారంలో తగినన్ని పోషకాలు తీసుకోని వాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గడంతో.

  • సీఓపీడీ (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మునరీ డిసీజ్‌ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) వంటి వ్యాధులు ఉన్నవాళ్లలో

  • గుండె సమస్యలు ఉన్నవారిలో

  • స్పీ›్లనెక్టమీ అనే ప్రక్రియ ద్వారా స్పీ›్లన్‌ తొలగించిన వాళ్లలో

  • పొగతాగేవారిలో... వీళ్లందరిలోనూ నిమోనియా వచ్చే అవకాశాలెక్కువ.

మరికొన్ని జబ్బులతో కలసి...
మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిలో నిమోనియా సోకడం మామూలే. ఉదాహరణకు... సాధారణంగా డయాబెటిస్‌ ఉన్న వారు, క్యాన్సర్‌ కారణంగా కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్‌ బాధితులు, ఆస్తమా ఉన్నవారు, ఆల్కహాల్‌ ఎక్కువగా తాగేవారిలో నిమోనియా రావడం చాలా సాధారణం. ఇక గర్భవతుల్లో నిమోనియాను గుర్తించి, సరిగా వైద్య చికిత్స ఇవ్వకపోవడం వల్ల అదెన్నో కాంప్లికేషన్లకు దారితీసే ముప్పు ఉంటుంది.

వ్యాధి నిర్ధారణ

  • బాధితుల్లో కనిపించే లక్షణాలను బట్టి క్లినికల్‌గా.

  • సీబీపీ, సీఎక్స్‌ఆర్‌ వంటి చాలా సాధారణ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.

  • ఒక్కోసారి అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె పరీక్ష వంటి ఇతర పరీక్షలు కూడా చేయాల్సి రావచ్చు.

వీరిలో మరింత జాగ్రత్త అవసరం...
బాధితుల్లో రెండు మూడు రోజుల నుంచి జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే నిమోనియా ఉందేమోనని పరీక్షించాలి. డయాబెటిస్, పక్షవాతం, ఆస్తమా, గర్భిణుల్లో  వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. ఇక ఆసుపత్రుల్లో నిమోనియా సోకే అవకాశాలు ఎక్కువ.

నివారణ...

  • పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి.

  • బయటి వాతావారణంలో పొగ ఉంటే దానికి ఎక్స్‌పోజ్‌ కాకుండా జాగ్రత్త పడాలి.

  • ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్‌ ఉన్నవారు తప్పనసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి.

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు.

  • అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది.

చికిత్స

  • నిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. బాధితులను చాలా నిశితంగా పరిశీలించి యాంటీబయాటిక్స్‌ మోతాదును డాక్టర్లు చాలా జాగ్రత్తగా నిర్ణయిస్తారు. అందుకే నిమోనియాకు చికిత్స తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి. సొంతవైద్యం ఎట్టిపరిస్థితుల్లోనూ పనికిరాదు.

  • ఎవరికైనా మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.

చిన్నాపిల్లల్లో నిమోనియా!

  • చిన్నపిల్లలందరిలోనూ కనిపించినప్పటికీ... మరీ ముఖ్యంగా ఐదేళ్ల కంటే ఇంకా చిన్నారుల్లో ఇది చాలా ఎక్కువ. పెద్దల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంటుంది కాబట్టి కాస్త తట్టుకుంటారు. కానీ చిన్నారుల్లో ఇమ్యూనిటీ అంతే బలంగా ఉండకపోవడం వల్ల ఒక్కోసారి ఇది ్రపాణాంతకమూ అయ్యే అవకాశముంది. అయితే ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో దీన్ని చాలావరకు సమర్థంగా తగ్గించవచ్చు.

  • స్ట్రెప్టోకాకస్‌ నిమోనే, గ్రూప్‌–బి స్ట్రెప్టోకాకస్, స్టెఫలోకాకస్‌ ఆరియస్‌ వంటి బ్యాక్టీరియాతో పాటు ఐదేళ్ల కంటే మరీ చిన్న పిల్లల్లో ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్‌ వైరస్, పారా ఇన్‌ఫ్లుయెంజా వైరస్, అడినోవైరస్‌ వంటి వైరస్‌లతోనూ వచ్చే అవకాశం ఉంది. పెద్దల్లోలాగే కొన్ని సందర్భాల్లో ఫంగైలతోనూ నిమోనియా రావచ్చు.

లక్షణాలు

  • నిమోనియా వల్ల పిల్లలందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏ కారణంగా నిమోనియా వచ్చిందనే అంశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. అయితే సాధారణంగా కనిపించే లక్షణాలివి...

  • దగ్గు వస్తుంటుంది. ఇది తెమడ/ఫ్లెమ్‌ను ఉత్పత్తి చేస్తుండటం వల్ల తడిదగ్గు.

  • తీవ్రమైన జ్వరం.

  • ఆకలి తగ్గడం.

  • తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ.

  • కొందరు పిల్లల్లో వాంతులు, విరేచనాలూ కావచ్చు.

వైరస్‌ లేదా బ్యాక్టీరియా కారణంగా నిమోనియా వచ్చినా మొదట్లో లక్షణాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే వైరల్‌ నిమోనియాలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, ఆయాసం, ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దం రావడం (వీజింగ్‌) వంటివీ కనిపించవచ్చు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే నిమోనియా కంటే వైరల్‌ నిమోనియా కాస్త ప్రమాదకరం. పిల్లల్లో వణుకు, ఆయాసం, తలనొప్పి, అయోమయం వంటివి కనిపిస్తే అది ఒకింత ప్రమాదకరమని గుర్తించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

నిర్ధారణ

  • ఛాతీ ఎక్స్‌రే.

  • కొన్ని రక్తపరీక్షలు (రక్తంలో ఆక్సిజన్‌ మోతాదును తెలుసుకునే ఆర్టీరియల్‌ బ్లడ్‌గ్యాస్‌ వంటివి)

  • కళ్లె పరీక్ష (స్ఫుటమ్‌ కల్చర్‌) : ఈ పరీక్ష వల్లనే  నిమోనియాకు అసలు కారణం తెలుస్తుంది.

  • సీటీ స్కాన్‌ (ఛాతీది)

  • అవసరాన్ని బట్టి అరుదుగా బ్రాంకోస్కోపీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాని పరీక్ష వంటివి చేస్తారు.

చికిత్స 
బ్యాక్టీరియా వల్ల వచ్చే నిమోనియా మంచి యాంటీబయాటిక్స్‌తో తేలిగ్గా తగ్గిపోతుంది. అయితే వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో నిమోనియా వస్తే దానికి నిర్దిష్టంగా మందులు లేకపోయినా కొన్నిసార్లు యాంటీవైరల్‌ మందులు ఇస్తారు. ఇలాంటి పిల్లలకు తగినన్ని నీళ్లు తాగించడం, గది బాగా సౌకర్యంగా ఉండటంతో పాటు అందులో తగినంత తేమ ఉండేలా చూడటం, జ్వరం, దగ్గు వంటివి తగ్గడానికి లక్షణాలను బట్టి (సింప్టమాటిక్‌) చికిత్స ఇవ్వడం వంటివి చేస్తారు.

సెకండరీ నిమోనియా
పిల్లల్లో ఇంకేదైనా వ్యాధి (ముఖ్యంగా వైరల్‌ జ్వరాలు) వచ్చాక, అది నిమోనియాకు దారితీస్తే దాన్ని సెకండరీ నిమోనియాగా పరిగణిస్తారు. దీనికి కాస్తంత ప్రమాదకరమైన కండిషన్‌. అందుకే హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందించాలి. ఇందులో తీవ్రతను బట్టి రక్తనాళం ద్వారా లేదా నోటి ద్వారా యాంటీబయాటిక్స్‌ ఇవ్వడం, వాళ్లలో నీరు, లవణాల మోతాదుల నిర్వహణ కోసం సెలైన్‌ వంటి ఫ్లుయిడ్స్‌ ఎక్కించడం, ఆక్సిజన్‌ ఇవ్వడం, పిల్లలు తమంతట తాము కళ్లె / గల్ల / ఫ్లెమ్‌  తీయలేరు కాబట్టి వారు దాన్ని ఊసేలా వివరించి చెప్పడం, బాగా ఊపిరితీసుకోగలుగుతున్నారా అని చూడాలి. అందుకే చిన్నారుల్లో సెకండరీ నిమోనియా కనిపిప్తే వారిని తప్పనిసరిగా హాస్పిటల్‌లో ఉంచే చికిత్స అందించడం మంచిది.  

నివారణ

  • పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఇప్పుడు 13 రకాల నిమోనియాలకు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు రెండు నెలల వయసప్పుడు నిమోనియా వ్యాక్సిన్స్‌ మొదటి డోసు, రెండేళ్ల పైబడ్డ పిల్లలకు సైతం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

  • అందరు పిల్లలకు ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్‌ వేయించాలి. వర్షాకాలానికి ముందు (ప్రీ–మాన్‌సూన్‌ పీరియడ్‌లో) ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వైరల్‌ ఫ్లూని నియంత్రించవచ్చు.

  • వ్యక్తిగత పరిశుభ్రత పాటించడాన్ని పిల్లలకు నేర్పడం, బాగా దగ్గుతున్న పెద్దలు, వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్లకుండా చూస్తూ... పిల్లలను అలాంటివారి నుంచి దూరంగా ఉంచడం, చాలాకాలం పాటు ధాన్యం నిల్వ ఉంచే గరిసెలు, అలాగే కోళ్ల వంటి పెంపుడు పక్షులకు పిల్లలను దూరంగా వంటి కొద్దిపాటి జాగ్రత్తలతో నిమోనియాను చాలావరకు నివారించవచ్చు.

చివరిగా... నిమోనియాను యాంటీబయాటిక్స్‌తో చాలావరకు నయం చేయడం సాధ్యమే అయినప్పటికీ... పెద్దల్లోనైనా, పిల్లల్లో జ్వరం, ఆగకుండా దగ్గు వస్తూ, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు అంత తేలిగ్గా తీసుకోకుండా ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడమే మంచిదని గుర్తుంచుకోవాలి.

- డా. రమణ ప్రసాద్‌, సీనియర్‌ పల్మునాలజిస్ట్‌ అండ్‌ స్లీప్‌ స్పెషలిస్ట్‌

నిర్వహణ : యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement