మేయర్‌గా ఉంటూనే మెటర్నిటీ లీవ్‌.. ఏకంగా టైమ్‌-100లో చోటు! | Japan Mayor Shoko Kawata Maternity Leave Time100 Next | Sakshi
Sakshi News home page

మేయర్‌గా ఉంటూనే మెటర్నిటీ లీవ్‌.. ఏకంగా టైమ్‌-100లో చోటు!

Oct 2 2026 12:35 PM | Updated on Oct 2 2026 1:14 PM

Japan Mayor Shoko Kawata Maternity Leave Time100 Next

మేయర్‌గా బాధ్యతలు.. మరోవైపు తల్లిగా కొత్త ప్రయాణం. బిడ్డకు జన్మనిచ్చేందుకు 16 వారాల విరామం తీసుకున్న జపాన్‌ మేయర్‌ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కుటుంబం కోసం తీసుకున్న నిర్ణయమే ఆమెకు అరుదైన గుర్తింపును తీసుకొచ్చింది.

జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చర్‌లోని యావటా సిటీ మేయర్‌ షోకో కవాటా ‘TIME100 Next’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 36 ఏళ్ల కవాటా సెప్టెంబర్‌ 15న తొలి బిడ్డకు జన్మనిచ్చారు. మేయర్‌గా కొనసాగుతూనే మెటర్నిటీ లీవ్‌ తీసుకున్న జపాన్‌ తొలి మేయర్‌గా ఆమె నిలిచారు. అయితే, ఆమె నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మహిళలు రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉంటూనే కుటుంబ బాధ్యతలను నిర్వహించడానికి అవసరమైన పరిస్థితులు కల్పించాలనే చర్చ మొదలైంది.

అలాగే, కవాటా నిర్ణయానికి చాలామంది మద్దతు తెలపగా.. మరికొందరు విమర్శలు చేశారు. ప్రజాప్రతినిధిగా విధులకు దూరంగా ఉండటం బాధ్యతారాహిత్యమని కొందరు వ్యాఖ్యానించారు. అయితే, కవాటా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. మహిళలు కుటుంబ బాధ్యతలు, మాతృత్వం కారణంగా రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఉండకూడదని ఆమె అన్నారు. ఈ క్రమంలో కుటుంబం, ఉద్యోగం రెండింటినీ సమన్వయం చేసుకోవడానికి మహిళలకు అనుకూలమైన వ్యవస్థలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే, జపాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్‌ నిబంధనలు ఉన్నప్పటికీ.. స్థానికంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక చట్టపరమైన విధానం లేదు. దీంతో, కవాటా తన కార్యాలయంతో కలిసి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. 16 వారాల పాటు తన అధికారాలను డిప్యూటీ మేయర్‌ షిగెటో నోసేకు అప్పగించారు. వీలైనప్పుడు రిమోట్‌గా విధులకు సంబంధించిన పనులను కొనసాగించారు. సెప్టెంబర్‌ 15న పాపకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించి, తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ నేపథ్యంలో తల్లిగా తన అనుభవాలను భవిష్యత్తులో ప్రజా విధానాల్లో ప్రతిబింబించాలని ఆమె ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరగా అర్థం చేసుకుని పరిష్కారాల కోసం పనిచేస్తానని తెలిపారు.

ఇదీ చదవండి: రెండు విషపు సూదులు.. అయినా చావలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement