జపాన్‌లో భూకంపాలు సర్వసాధారణం. అందుకే.. అక్కడి ప్రజలు భూకంపాలను చూసి భయపడటం కంటే, వాటి వల్ల జరిగే నష్టాన్ని ఎలా తగ్గించాలనే దానిపై ఎక్కువగా దృష్టి పెడతారు. గత కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు భూకంపాలను ఒక పెద్ద ప్రకృతి విపత్తుగా మాత్రమే కాకుండా, ఒక ఇంజినీరింగ్ సమస్యగా భావించి కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. భూకంపం వచ్చినప్పుడు ఇంటిని కొంత ఎత్తుకు పైకి లేపే విధానం పరిచయం చేశారు. ఈ విషయాన్ని హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
సెన్సార్లు గుర్తిస్తాయి
సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు నేల కదిలినట్టే ఇల్లు కూడా కదులుతుంది. దాంతో ఇంటి గోడలు, స్తంభాలు, పునాదులపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కానీ.. ఈ కొత్త విధానంలో భూకంపం వచ్చినట్లు సెన్సార్లు గుర్తించిన వెంటనే ప్రత్యేకమైన వ్యవస్థ పనిచేసి ఇంటిని నేల నుంచి కొంత పైకి లేపుతుంది.
ఇలా చేయడం.. వల్ల భూమి కదలిక నేరుగా ఇంటికి చేరకుండా కొంతవరకు నిరోధించవచ్చని ఇంజినీర్లు భావిస్తున్నారు. అంటే.. భూకంపం సమయంలో ఇల్లు నేలతోపాటు కదలకుండా, నేల కదలిక నుంచి వేరుగా ఉంటుందన్నమాట. దీని అర్థం ఇల్లు గాలిలో ఎగురుతుందని కాదు. ఇంటిని ఒక పరిమితిలో పైకి ఎత్తడం మాత్రమే. భూకంపం ముగిసిన తర్వాత ఇంటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావచ్చు.
ఇప్పటికే ఉన్న టెక్నాలజీలు
జపాన్‌లో ఇప్పటికే భవనాలను భూకంపాల నుంచి రక్షించడానికి.. బేస్ ఐసోలేషన్, షాక్ అబ్జార్బర్లు, ప్రత్యేక పునాది నిర్మాణాలు వంటి అనేక సాంకేతికతలు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇంటినే కొంత పైకి లేపే ఆలోచన.. వీటన్నింటికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: కరెంట్ లేనప్పుడు.. ఫోన్ ఛార్జింగ్ ఎలా చేసుకోవాలో తెలుసా?
భూకంపాలను మనం ఆపలేం. కానీ ఇళ్లు, భవనాలు, ప్రజల జీవితాలకు కలిగే నష్టాన్ని మాత్రం తగ్గించగలం. ఈ ఆలోచనతోనే జపాన్ ఎన్నో సంవత్సరాలుగా కొత్త కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీలు మరింత అభివృద్ధి చెందితే, భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ప్రజలకు మరింత సురక్షితమైన ఇళ్లు నిర్మించడం సాధ్యమవుతుంది.
Japan has spent decades turning earthquakes from a disaster into an engineering challenge. They are now developing a special technology that allows homes to rise above ground enough to protect the home in case of earthquakes. pic.twitter.com/t65sU4eYJf
— Harsh Goenka (@hvgoenka) September 30, 2026


