కరవు కోరలు.. నీటి కోత.. బిల్డింగ్ నిర్మాణాలకు బ్రేక్! | Water Crisis Water Cuts Construction Halt Planned Amid Severe Drought | Sakshi
Sakshi News home page

కరవు కోరలు.. నీటి కోత.. బిల్డింగ్ నిర్మాణాలకు బ్రేక్!

Oct 1 2026 12:00 PM | Updated on Oct 1 2026 12:12 PM

Water Crisis Water Cuts Construction Halt Planned Amid Severe Drought

రాష్ట్రంలో ముదిరిన కరవు పరిస్థితులు, నీటి ఎద్దడి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. పట్టణ ప్రాంతాల్లో 10 శాతం మేర తాగునీటి సరఫరాలో కోత విధించడంతో పాటు తీవ్ర నీటిభయాలున్న ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. కరవు నివారణ చర్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మొదటి సమావేశంలో ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

వర్షాకాలంలో దాదాపు 18 శాతం వర్షపాత లోటు నమోదవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని 358 తాలూకాలకు గాను 265 తాలూకాల్లో కరవు పరిస్థితిని అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో పట్టణ నీటి సరఫరాలో 10 శాతం కోతపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జలవనరుల శాఖను రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే ఆదేశించారు. మరోవైపు కరవు ప్రాంతాల్లో వ్యక్తిగత, వాణిజ్య భవన నిర్మాణాలు, సిమెంట్ రోడ్ల పనులను తక్షణమే నిలిపివేయాలని పర్యావరణ మంత్రి పంకజా ముండే అధికారులను ఆదేశించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊరట

పట్టణాల్లో పొదుపు చర్యలు చేపడుతూనే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, ఆర్థిక పరిపుష్టి కోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి రూ.6,728 కోట్లు కేటాయించినట్లు ఉపాధి హామీ శాఖ మంత్రి భరత్ గోగావాలే వెల్లడించారు. ఈ నిధులతో నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు సంబంధించి 375 రకాల పనులను చేపట్టనున్నారు.

పశుగ్రాసానికి ప్రాధాన్యం

తాగునీరు, పశుగ్రాసం సరఫరాకే తొలి ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. చెరువులు, కుంటల్లోని నీటిని తాగునీటి అవసరాలకే పరిమితం చేయనున్నారు. పశుగ్రాస కొరతను ఎదుర్కొనేందుకు ముగ్గురు కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసి రాజస్థాన్ తరహా నిర్వహణ పద్ధతులను అధ్యయనం చేస్తున్నారు. కరవు సహాయక చర్యలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వార్ రూమ్‌లు ఏర్పాటు కానున్నాయి. రైతులకు పంట నష్టపరిహారం అందిస్తూనే వ్యవసాయ రుణాల వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసే అంశంపై ఆర్‌బీఐతో సంప్రదింపులు జరపాల్సిందిగా సీఎస్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీ చదవండి: మరింత అలసిపోయిన పసిడి ధర!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement