అందుకే అక్కడ ఓడిపోతున్నాం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు | BJP KS Radhakrishnan Comments why his party struggles In Kerala | Sakshi
Sakshi News home page

అందుకే అక్కడ ఓడిపోతున్నాం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Oct 1 2026 11:29 AM | Updated on Oct 1 2026 11:35 AM

BJP KS Radhakrishnan Comments why his party struggles In Kerala

కేరళ రాజకీయాల్లో ఇన్నాళ్లూ వినిపించిన కథకు బీజేపీ నేత కేఎస్‌ రాధాకృష్ణన్‌ కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చారు. ‘లెఫ్ట్‌.. సెక్యులర్‌.. లిబరల్‌’ రాజకీయాలకు కేరళ కేరాఫ్‌ అడ్రస్‌ అనే ప్రచారాన్నే ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టులే కేరళలో చారిత్రకంగా ఆధిపత్య హిందూ రాజకీయ శక్తిగా పనిచేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు కేరళ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ సౌత్‌లో మాట్లాడిన కేఎస్‌ రాధాకృష్ణన్‌.. కేరళలో కమ్యూనిస్టుల ఎదుగుదల కేవలం వామపక్ష సిద్ధాంతాల ప్రజాదరణతోనే జరగలేదని వాదించారు. 1921 మలబార్‌ తిరుగుబాటు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, హిందువుల్లో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు కమ్యూనిస్టు ఉద్యమానికి అనుకూలంగా మారాయని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో మలబార్‌లో జరిగిన పరిణామాల అనంతరం బాధిత హిందువులకు కాంగ్రెస్‌ తగినంతగా అండగా నిలవలేదని రాధాకృష్ణన్‌ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌పై ఒక వర్గంలో అపనమ్మకం ఏర్పడిందని.. ఆ రాజకీయ ఖాళీలో కమ్యూనిస్టు ఉద్యమం బలపడిందని ఆయన వివరించారు.

‘శబరిమల ఘటన కూడా కీలకమే’
1950లో జరిగిన శబరిమల అగ్నిప్రమాదం ఘటనను కూడా కమ్యూనిస్టుల రాజకీయ ఎదుగుదలతో రాధాకృష్ణన్‌ ముడిపెట్టారు. ఆ ఘటన అనంతరం ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ఇచ్చిన హామీలు రాజకీయంగా కమ్యూనిస్టులకు మద్దతు పెరగడానికి దోహదపడ్డాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు.. తొలి కమ్యూనిస్టు ఉద్యమంలో వివిధ హిందూ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఉన్నారని రాధాకృష్ణన్‌ గుర్తుచేశారు. నంబూద్రిపాద్‌తో పాటు ఎన్‌ఎస్‌ఎస్‌, ఎస్‌ఎన్‌డీపీకి సంబంధించిన నాయకులు కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్నారని చెప్పారు. అందుకే కమ్యూనిస్టు పార్టీని కేవలం లౌకిక-వామపక్ష రాజకీయ శక్తిగా చిత్రీకరించడం వాస్తవాలకు దూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీకి ఎందుకు ఇబ్బంది?
కేరళలో బీజేపీకి ఇప్పటికీ పరిమిత రాజకీయ విజయం మాత్రమే ఎందుకు దక్కుతోందన్న ప్రశ్నపైనా రాధాకృష్ణన్‌ తన విశ్లేషణను వెల్లడించారు. హిందూ ఓటు కోసం బీజేపీ పోటీ పడుతున్న రాజకీయ స్థలంలో ఇప్పటికే కమ్యూనిస్టులకు బలమైన ప్రభావం ఉందని ఆయన అన్నారు. ఇతర, వర్గాలు కాంగ్రెస్‌ను తమ సహజ రాజకీయ వేదికగా ఎంచుకున్నారని రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. దీంతో బీజేపీకి ఆ వర్గాల నుంచి పెద్దగా ఓట్లు రావడం లేదని చెప్పారు. అయితే ఓటర్ల ఆలోచనా విధానంలో మార్పులు వస్తే కేరళలో బీజేపీ భవిష్యత్తులో కీలక రాజకీయ శక్తిగా ఎదగవచ్చని రాధాకృష్ణన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తంగా.. కేరళ రాజకీయాల్లో కమ్యూనిస్టుల చరిత్రను ‘హిందూ రాజకీయాల’ కోణంలో చూడాలన్న రాధాకృష్ణన్‌ వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి.

ఇదీ చదవండి: కాంగ్రెస్‌లో బిగ్‌ ట్విస్ట్‌.. పీసీసీ చీఫ్‌ రాజీనామా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement