తిరువనంతపురం: శబరిమల ఆలయానికి మిల్మా నెయ్యి సరఫరా కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పత్తనంతిట్ట, కొల్లాం, తిరువనంతపురం జిల్లాల్లోని మూడు ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది. మిల్మా మాజీ అధికారి షైన్ జోసెఫ్ నివాసంతో పాటు నెయ్యి రవాణాకు సంబంధించిన కాంట్రాక్టర్ల ఇళ్లు, వాహనాలను కూడా సిట్ బృందం తనిఖీ చేసింది. సోదాల్లో కేసుకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.2.27 కోట్ల నష్టం జరిగిందా?
2025-26 మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ కోసం శబరిమల దేవస్వం బోర్డు నెయ్యి కొనుగోలుకు టెండర్ ప్రక్రియ చేపట్టింది. టెండర్‌లో అత్యల్ప ధరగా లీటరుకు రూ.369 కోట్ కాగా, మిల్మా నుంచి నెయ్యి కొనుగోలుకు లీటరుకు రూ.510 చెల్లించేలా నిర్ణయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం సుమారు 1.65 లక్షల లీటర్ల నెయ్యిని మిల్మా నుంచి కొనుగోలు చేసిన వ్యవహారంలో దేవస్వం బోర్డుకు సుమారు రూ.2.27 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక దర్యాప్తు పేర్కొంది. ఈ అంశాల ఆధారంగానే కేరళ హైకోర్టు విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించింది.
మార్గమధ్యంలో నెయ్యి దారి మళ్లించారా?
కేసులో మరో కీలక ఆరోపణ నెయ్యి రవాణాకు సంబంధించినది. పత్తనంతిట్ట మిల్మా డెయిరీ నుంచి శబరిమలకు తరలించిన నెయ్యిని మార్గమధ్యంలో దారి మళ్లించి, దాని స్థానంలో తక్కువ నాణ్యత గల నెయ్యిని ఆలయానికి సరఫరా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పత్తనంతిట్ట డెయిరీ నుంచి పంపిన నెయ్యిని బయట మార్కెట్‌లో విక్రయించి, తమిళనాడు నుంచి సేకరించిన నెయ్యిని మిల్మా ప్యాకేజింగ్‌లో శబరిమలకు తరలించినట్లు దర్యాప్తు పత్రాల్లో ఆరోపణలు నమోదయ్యాయి.


