తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ తన కాన్వాయ్‌లో అదనపు భద్రతా వాహనాన్ని చేర్చాలన్న పోలీసుల ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రస్తుతం తన కాన్వాయ్‌లో పైలట్ వాహనం, ఎస్కార్ట్ వాహనం మాత్రమే ఉన్నాయని, మరో భద్రతా వాహనం అవసరం లేదని బుధవారం పోలీసులకు తెలిపారు.
ఇటీవల భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు సతీశన్, ఇతర మంత్రులకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసనలు చేపట్టిన నేపథ్యంలో ఆయన కాన్వాయ్‌లో మరో భద్రతా వాహనాన్ని చేర్చాలని రాష్ట్ర పోలీసులు ప్రతిపాదించారు. బుధవారం ఉదయం కూడా సతీశన్ విమానాశ్రయం నుంచి తిరిగి వస్తుండగా భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌కు అడ్డంగా వెళ్లేందుకు ప్రయత్నించి నల్లజెండాలు ప్రదర్శించారు.
అయితే, అదనపు వాహనం అవసరం లేదని సతీశన్ స్పష్టం చేశారు. ఉదయం ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో తన కాన్వాయ్‌లో అదనపు పోలీసు వాహనం కనిపించడంతో ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి. దీనిపై అధికారులు వివరణ ఇచ్చారు. అదనపు వాహనం ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో భాగం కాదని, అదే ప్రాంతానికి వెళ్తున్న కారణంగా అనుకోకుండా కాన్వాయ్‌కు ముందు వెళ్లిందని సీనియర్ పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.


