‘ఒప్పుకుంటే ప్రమోషన్లు.. ఒప్పుకోకపోతే థర్డ్‌ డిగ్రీనా?’ | YSRCP Leader TJR Sudhakar Babu Slams Chandrababu Sarkar | Sakshi
Sakshi News home page

‘ఒప్పుకుంటే ప్రమోషన్లు.. ఒప్పుకోకపోతే థర్డ్‌ డిగ్రీనా?’

Sep 30 2026 6:31 PM | Updated on Sep 30 2026 7:27 PM

YSRCP Leader TJR Sudhakar Babu Slams Chandrababu Sarkar

తాడేపల్లి :లిక్కర్‌ కేసు పేరుతో వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ధ్వజమెత్తారు. ముందే టార్గెట్‌ పిక్స్‌ చేసుకుని సిట్‌ విచారణ సాగిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ వద్ద పని చేసిన అధికారులు, పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకూల వాంగ్మూలాల కోసం బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడుతున్నారన్నారు.  ఒప్పుకుంటే ప్రమోషన్లు.. ఒప్పుకోకపోతే థర్డ్‌ డిగ్రీనా? అని నిలదీశారు టీజేఆర్‌. 

‘చెవిరెడ్డి మాజీ గన్‌మెన్ల వ్యవహారమే సిట్‌ విచారణ తీరుకు నిదర్శనం. ఒక గన్‌మెన్‌కు జీతం పెంపు.. మరో గన్‌మెన్‌పై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. వెంకటేష్‌ నాయుడు కోర్టులో చేసిన ప్రకటనలపై సిట్‌ సమాధానం చెప్పాలి. రూ.11 కోట్ల నగదు పట్టుకున్నామన్న వ్యవహారంలో నిజాలు బయటపెట్టాలి. ల్యాప్‌టాప్‌లు, మొబైళ్లలో డేటా ట్యాంపరింగ్‌ చేశారనే అంశాలపై సమాధానం చెప్పాలి. చంద్రబాబు జేబు సంస్థలా సిట్‌ వ్యవహరిస్తోంది. జరగని లిక్కర్‌ స్కామ్‌ను సృష్టించి రాజకీయ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్సీ వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకే లిక్కర్‌ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చారు. 

వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విక్రయాలు ప్రభుత్వ ఆధీనంలోనే జరిగాయి. ప్రభుత్వమే మద్యం అమ్మితే ప్రైవేటు వ్యక్తులకు లంచాలు ఎక్కడి నుంచి వస్తాయి?, వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించాం. కూటమి పాలనలో మద్యం షాపులు భారీగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 60 వేలకుపైగా బెల్ట్‌ షాపులు నడుస్తున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. 

ప్రస్తుత మద్యం విధానంలో టీడీపీ నేతల సిండికేట్లు నడుస్తున్నాయి. మద్యం దుకాణాల నిర్వహణలో మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యం ఉంది. ఎంఆర్‌పీపై ఒక్కో బాటిల్‌కు రూ.20–40 అదనంగా వసూలు చేస్తున్నారు. కొత్త టెండర్లు పిలవకుండా పాత లైసెన్సులనే ఎందుకు కొనసాగించారు?, టెండర్‌ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎందుకు వదులుకున్నారు?, మద్యం విక్రయ కేంద్రాలు పెరిగినా ప్రభుత్వ ఆదాయం అందుకు అనుగుణంగా ఎందుకు పెరగలేదు?, ఆ అదనపు ఆదాయం ఎక్కడికి వెళ్తోందో ప్రభుత్వం లెక్క చెప్పాలి. గత ప్రభుత్వంలో రూ.3 వేల కోట్ల స్కామ్‌ జరిగిందంటే ఆ మొత్తం ఇప్పుడు అదనపు ఆదాయంగా కనిపించాలి కదా?, రాష్ట్రంలో కల్తీ, నకిలీ మద్యం విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలి. ‘అసలైన లిక్కర్‌ స్కామ్‌ ఇప్పుడే జరుగుతోంది. కూటమి ప్రభుత్వ మద్యం విధానంలోని ప్రతి అంశంపై చట్టపరంగా పోరాడతాం’ అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అప్పుడు అన్ని వేళ్లు బాబు వైపు చూపించలేదా?: రాచమల్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement