వాయు కాలుష్యం కట్టడికి చర్యలను ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
నిర్మాణాల కూల్చివేత పైనా కఠిన ఆంక్షలు
పార్కింగ్ ఛార్జీలు రెట్టింపు , వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యం
నో పీయూసీ– నో ఫ్యూయల్ విధానం
న్యూఢిల్లీ: శీతాకాలం సమీపిస్తున్న వేళ ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశరాజధాని వాసులపై తీవ్ర ప్రభావం చూపే వాయు కాలుష్యం కట్టడికి నడుం బిగించింది. వాహనాల్లో ఇంధనం నింపాలంటే పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయడం, కార్యాలయాల పని వేళలను కుదించడం వంటి పలు చర్యలను కఠినంగా అమలు చేయనుంది. ఢిల్లీ పర్యావరణ శాఖమంత్రి మంజిందర్ సింగ్ సిర్సా సోమవారం ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించారు.
నవంబర్ ఒకటి నుంచి 2027 జనవరి 31వ తేదీ వరకు ధూళిని వ్యాప్తి చేసే నిర్మాణాల కూల్చివేత, బహిరంగ సివిల్ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం ఉంటుందన్నారు. అదేవిధంగా, డిసెంబర్ 10 నుంచి జనవరి 20వ తేదీ వరకు అన్ని రకాల నిర్మాణ, కూల్చివేతల కార్యకలాపాలన్నింటిపై పూర్తి స్థాయి నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. నవంబర్ ఒకటి నుంచి పార్కింగ్ చార్జీలు రెట్టింపు చేస్తామని, ఎలక్ట్రిక్ వాహనాలకైతే పార్కింగ్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. ఆఫీసు పని వేళలను తగ్గించడం తోపాటు సగం పనిని వర్క్ ఫ్రం హోం విధానంలో పూర్తి చేసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని వివరించారు.
నవంబర్ ఒకటో తేదీ నుంచి ఉద్గారాలు బీఎస్–6 ప్రమాణాల కంటే తక్కువగా ఉండే వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశం ఉండదని తెలిపారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సారథ్యంలో సీఎం రేఖా గుప్తా తదితరులతో ఏర్పాటైన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నామని సిర్సా వివరించారు. ‘నో పీయూసీ– నో ఫూయల్’విధానం కఠినంగా అమలవుతుందన్నారు. అదేవిధంగా, కాలం చెల్లిన వాహనాలను గుర్తించేందుకు ఢిల్లీ వ్యాప్తంగా 500 పెట్రోల్ బంక్‌ల్లో ఏఎన్‌పీఆర్(ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) పరికరాలను అమర్చామని వివరించారు. ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం తమ బాధ్యతన్నారు. ఇందుకుగాను, అక్టోబర్‌లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, నవంబరులో కాలుష్య పరీక్ష కేంద్రా(పీయూసీ)లను అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు. ఢిల్లీ–ఎన్‌సీఆర్ వ్యాప్తంగా గుర్తించిన 62 కాలుష్య హాట్‌స్పాట్లకు గాను ఇప్పటివరకు 42 చోట్ల కాలుష్య తీవ్రతను అదుపులోకి తెచ్చామన్నారు.


