హరియాణాలోని గురుగ్రామ్ రోడ్లపై చెత్తను శుభ్రం చేసేందుకు ఉపయోగిస్తున్న చిన్న యంత్రానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్కూటర్‌ను పోలిన ఆకారంలో ఉన్న ఈ యంత్రం రోడ్డు పక్కన పడిన కాగితాలు, ప్లాస్టిక్ ర్యాపర్లు, ఇతర చిన్న చెత్తను పీల్చుకునే గొట్టం ద్వారా లోపలికి లాగి శుభ్రం చేస్తోంది. తెలుపు రంగులో ఉన్న ఈ చిన్న యంత్రంపై గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తు కనిపిస్తోంది. నగరంలోని రోడ్లు, బహిరంగ ప్రదేశాల శుభ్రతను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా దీన్ని ఉపయోగిస్తున్నారు.
వీడియోలో.. ఓ వ్యక్తి యంత్రాన్ని నడుపుతూ, దానికి అనుసంధానించిన పీల్చుకునే గొట్టాన్ని చేతితో చెత్త వైపు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. గొట్టాన్ని చెత్తకు దగ్గరగా తీసుకెళ్లగానే పీల్చుకునే శక్తితో కాగితాలు, ప్లాస్టిక్ ర్యాపర్లు యంత్రంలోకి వెళ్లిపోతున్నాయి. పెద్ద చెత్త వాహనాలతో పోలిస్తే రోడ్డు పక్కలు, ఫుట్‌పాత్ సమీపంలోని చెత్తను తొలగించేందుకు ఇది మరింత బాగా ఉపయోగపడుతోంది.
ఆటోమేటిక్ మెషీనా?
అయితే ఈ యంత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో ‘ఆటోమేటిక్ గార్బేజ్ క్లీనింగ్ మెషీన్’గా పేర్కొనడంతో చర్చ మొదలైంది. యంత్రాన్ని నడిపేందుకు, చెత్తను పీల్చే గొట్టాన్ని నియంత్రించేందుకు సిబ్బంది అవసరం కనిపిస్తుండటంతో, దీన్ని ఏ అర్థంలో ఆటోమేటిక్ అంటున్నారంటూ కొందరు ప్రశ్నించారు.
కొంతమంది సామాజిక మాధ్యమ వినియోగదారులు యంత్రం సామర్థ్యంపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. పెద్ద నగరమైన గురుగ్రామ్‌లో విస్తారమైన రోడ్లను ఇలాంటి చిన్న యంత్రాలు ఎంతవరకు శుభ్రం చేయగలవని ప్రశ్నించారు. మరోవైపు, చెత్తను రోడ్లపై పడేయకుండా ప్రజల్లో బాధ్యత పెరగాల్సిన అవసరం ఉందని మరికొందరు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఈ యంత్రం చిన్న చెత్తను పీల్చి తొలగించేందుకు ఉపయోగిస్తున్నట్లు వీడియో ద్వారా స్పష్టమవుతోంది. గురుగ్రామ్ పారిశుద్ధ్య వ్యవస్థలో దీని వినియోగాన్ని ఎంత మేరకు విస్తరిస్తారు? వాస్తవంగా ఎంత ప్రభావం చూపుతుందో రానున్న రోజుల్లో తేలనుంది.
🚨 Gurugram Municipality has introduced an Automatic Garbage Cleaning Machine to help keep the city’s streets clean. 🙏 https://t.co/STaFNCOBtb
— Gems (@gemsofbabus_) September 28, 2026


