కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం | Supreme Court Expresses Shock Over Inflated Cancer Medicine Prices | Sakshi
Sakshi News home page

కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Sep 29 2026 6:32 PM | Updated on Sep 29 2026 6:47 PM

Supreme Court Expresses Shock Over Inflated Cancer Medicine Prices

సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఔషధ కంపెనీలు, రిటైలర్లు, ఆసుపత్రులు సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయని మండిపడింది.

అత్యవసర క్యాన్సర్ మందు తయారీదారుల నుంచి రిటైలర్లకు కేవలం రూ. 2,700 లకే లభిస్తోంది. అయితే, అదే మందు సాధారణ రోగులకు విక్రయించేసరికి దాని గరిష్ట రిటైల్ ధర ఏకంగా రూ. 27,000 వసూలు చేస్తున్నారు. తయారీ ధరకు, మార్కెట్లో విక్రయిస్తున్న ధరకూ దాదాపు 10 రెట్లు వ్యత్యాసం ఉండటంపై కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది.

ఇంత భారీ వ్యత్యాసంతో మందులను విక్రయించడాన్ని అత్యున్నత న్యాయస్థానం పగటిపూట జరిగే నిలువుదోపిడీగా అభివర్ణించింది.క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాగ్రంతో పోరాడే రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీలు, ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ దోపిడీకి పాల్పడుతున్నాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా చికిత్స పొందే రోగుల విషయంలో ఈ ధరల బాదుడు నేరుగా ప్రజాధనం పైనే పెనుభారం పడేస్తోందని కోర్టు పేర్కొంది.ఆసుపత్రులు అధిక ధరలకు మందులు కొనుగోలు చేసి, ఆ బిల్లులను ప్రభుత్వ పథకాల కింద క్లెయిమ్ చేసుకుంటున్నాయని, ఇది పరోక్షంగా ప్రభుత్వ ఖజానాకు జరుగుతున్న మోసమని వ్యాఖ్యానించింది.  

ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వుల పరిధి కేవలం కొన్ని మందులకే పరిమితం కావడం, మిగతా సుమారు 82 శాతానికి పైగా మందులు ధరల నియంత్రణ పరిధిలోకి రాకపోవడంపై కేంద్రాన్ని, నియంత్రణ సంస్థలను కోర్టు నిలదీసింది.

ప్రాణాలను కాపాడే నిత్యావసర ఔషధాల ధరలు ఇంత విపరీతంగా పెరుగుతున్నా సంబంధిత శాఖలు, డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించింది.మందుల అసలు ఉత్పత్తి ధరకు,మార్కెట్ ఎంఆర్పీకి మధ్య ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు ఉండకూడదనే అంశంపై స్పష్టమైన విధానాన్ని తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై జనరిక్ మందుల వాడకం తప్పనిసరి చేయడం,నాన్-షెడ్యూల్డ్ మందుల ధరల నియంత్రణకు సంబంధించి కఠినమైన ప్రతిపాదనలు తీసుకురావాలని కోర్టు సూచించింది.

ఇదీ చదవండి : కరెంట్‌ బిల్లులకు ట్రాఫిక్‌ చలాన్ల లింక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement