న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వసూళ్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం ఈ-చలాన్లు జారీ చేయడం మాత్రమే సరిపోదని, వాటిని వసూలు చేసేందుకు సంబంధిత శాఖలు వినూత్నమైన, కఠినమైన మార్గాలను అన్వేషించాలని సూచించింది. ఈ నేపథ్యంలో పవర్ బిల్లులతో చలాన్లను అనుసంధానించే ఆలోచనను పరిశీలించాలని పేర్కొంది.
పెండింగ్ చలాన్లపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా మాట్లాడుతూ..‘ప్రజలు ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే, ఆ బకాయిలను వారి విద్యుత్ బిల్లులకు అనుసంధానించే అంశాన్ని పరిశీలించండి. కరెంట్ బిల్లు కట్టకపోతే ఇళ్లలో కరెంట్ నిలిచిపోతుంది కాబట్టి, ఎలాగైనా బిల్లు చెల్లిస్తారు. చలాన్ల వసూలుకు ఈ మార్గం ఏ మేరకు పనిచేస్తుందో చూడండి అని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విద్యుత్ బిల్లుల అనుసంధాన మార్గం అనేది కేవలం విచారణ సమయంలో కోర్టు చేసిన ఒక సూచన మాత్రమేనని, ఇది అమలు చేయాల్సిందని అధికారిక ఆదేశం కాదని స్పష్టం చేసింది.
రూ.45 వేల కోట్ల పెండింగ్ బకాయిలు
దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుమారు రూ.45,000 కోట్ల ఈ-చలాన్ బకాయిలు వసూలు కావాల్సి ఉండగా, అందులో సుమారు రూ.25,000 కోట్లు మాత్రమే రికవరీ అయినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. అధికారులు వాహనదారులకు వేల, లక్షల్లో చలాన్లు విధిస్తున్నప్పటికీ, ఆ జరిమానాలను క్షేత్రస్థాయిలో రాబట్టడం సవాలుగా మారిందని కోర్టు పేర్కొంది.
చలాన్ల వసూలుకు సుప్రీంకోర్టు సూచించిన ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు:
పెండింగ్ చలాన్లను సమర్థవంతంగా వసూలు చేసేందుకు పలు కఠిన చర్యలపై సుప్రీంకోర్టు చర్చించింది
ఆర్సీ రెన్యువల్ నిలిపివేత: వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల రెన్యువల్ సమయంలో పెండింగ్ చలాన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
యాజమాన్య బదిలీకి అడ్డుకట్ట: బకాయిలు ఉన్న వాహనాలను ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయకుండా అడ్డుకోవాలి
ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు: పెండింగ్ చలాన్లు పూర్తిగా చెల్లించే వరకు వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయరాదు
లైసెన్స్ నిలిపివేత: పరివాహన్ పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్‌ను నిలిపివేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న లైసెన్సుల సస్పెన్షన్‌కు చర్యలు తీసుకోవాలి.
పీయూసీ సర్టిఫికెట్లు: చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించాలి
వాహనాల జప్తు: తనిఖీల్లో భాగంగా పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను అధికారులు అవసరమైతే స్వాధీనం చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది
దేశంలో ట్రాఫిక్ నిబంధనల అమలు, ఈ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.


