అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువ సార్లు వెళ్లా : సీఎం రేవంత్‌ | Been to Jail More Often Than the Assembly : CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువ సార్లు వెళ్లా : సీఎం రేవంత్‌

Sep 28 2026 7:54 PM | Updated on Sep 28 2026 8:07 PM

Been to Jail More Often Than the Assembly : CM Revanth Reddy

సాక్షి,న్యూఢిల్లీ: అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువ సార్లు వెళ్లానంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఢిల్లీ వేదికగా జరిగిన ‘ప్రతిదిన్ కాంక్లేవ్’లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ‘ఇండియాస్ నెక్స్ట్ చాప్టర్’ అనే అంశంపై ప్రసంగించిన ఆయన  తన రాజకీయ ప్రయాణం, విద్యార్థి రాజకీయాలు, జాతీయ రాజకీయాలపై అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాను 2006లో జడ్పీటీసీగా, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచానని, ఆ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించానని సీఎం రేవంత్‌ గుర్తుచేసుకున్నారు. 2014 తర్వాత తెలంగాణ రాజకీయాలు ‘కేసీఆర్ వర్సెస్ రేవంత్’గా మారాయని, ఆ సమయంలో కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపారని సీఎం ఆరోపించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు, కేంద్రంలో ఎన్డీఏతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో రాజకీయాల శైలి భిన్నంగా ఉంటుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో విద్యార్థి సంఘాల ప్రభావం చాలా తక్కువగా ఉందని, ప్రధానంగా లెఫ్ట్, రైట్ విద్యార్థి సంఘాలే ఉన్నాయని.. ఎన్ఎస్‌యూఐ ప్రభావం పెద్దగా లేదన్నారు. యూనివర్సిటీ రాజకీయాలు వేరు, గ్రామ రాజకీయాలు వేరని స్పష్టం చేశారు.

స్టూడెంట్ పాలిటిక్స్‌లో ఏబీవీపీ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ, సాధారణ రాజకీయాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీదే పైచేయి ఉంటుందని.. తెలంగాణలో బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం లేదని అన్నారు. ఏబీవీపీలో గెలిచిన కొందరు విద్యార్థి నాయకులు తర్వాత కాలంలో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న ఉదాహరణలను ప్రస్తావించారు.

రాహుల్ గాంధీపై ప్రశంసలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తన అనుబంధాన్ని సీఎం రేవంత్ గుర్తుచేసుకున్నారు. రాహుల్ గాంధీని తొలిసారి కలిసినప్పుడు ఆయనతో 15 నిమిషాలు మాట్లాడానని, ఆ రోజే రాహుల్‌ను తన నాయకుడిగా నిర్ణయించుకున్నానని తెలిపారు. రాహుల్ గాంధీకి ఎలాంటి వ్యక్తిగత అజెండాలు లేవని, దేశమే ఆయనకు ముఖ్యమని రేవంత్ ప్రశంసించారు. అలాగే రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ తన శ్రేయోభిలాషులని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement