సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఏళ్లు గడుస్తున్నా తమకు రావాల్సిన బిల్లులు రాకపోవడంతో విసిగిపోయిన రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన వారిని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి.
సంవత్సరాలు గడుస్తున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళనకారులు వాపోయారు. తమ సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, ఫైనాన్స్ సెక్రటరీని కలిసేందుకు ప్రయత్నిస్తే అధికారులు అనుమతించడం లేదని మండిపడ్డారు. ఎన్నిసార్లు చుట్టూ తిరిగినా భట్టిని కలిసే అవకాశం ఇవ్వడం లేదని, కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భీష్మించుకు కూర్చున్న ఆందోళనకారులు
తమకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అపాయింట్‌మెంట్ ఇప్పించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఛాంబర్ ఎదుట బైఠాయించి భీష్మించుకు కూర్చున్నారు. ప్రభుత్వ తీరుపై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
పోలీసులతో వాగ్వాదం
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సచివాలయ భద్రతా సిబ్బంది, పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సచివాలయంలో ప్రభుత్వ ప్రతినిధుల ఛాంబర్ వద్దే బాధితులు ఆందోళనకు దిగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.
ఇదీ చదవండి : సీఎంల జీతాలపై ట్యాక్స్‌లు కట్టేది మనమే!!


