సీనియర్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పు చేశారా? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? దానం నాగేందర్ పార్టీ మారి ఉండవచ్చు. కాని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో ఫిరాయింపులపై స్పష్టమైన హామీని ఇచ్చింది. ఎవరైనా పార్టీ ఫిరాయించితే రాజ్యాంగం ప్రకారం వారిని అనర్హులుగా చేయాలన్నదే తమ అభిమతమని అందులో తెలిపింది.
అలాంటప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉంటే కాంగ్రెస్‌కు ప్రతిష్ట అయ్యేది. అలా చేయలేదు. పైగా ఆయనను సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు కాంగ్రెస్ పక్షాన పోటీచేయించింది. కనీసం అప్పుడైనా రాజీనామా చేయించాల్సింది. ఆయన గెలిచి ఉంటే ఎలాగూ రాజీనామా చేస్తారని అనుకుని ఉండవచ్చు. కాని ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డిలు స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్‌కు ఫిర్యాదు చేసినప్పుడు ఆయన విచారణ పేరుతో కొంత కాలయాపన చేశారన్న భావన ఉంది.
నిజానికి మొత్తం తొమ్మిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసి ఉంటే గౌరవంగా ఉండేది. ఏదో కారణంతో వారిపై అనర్హత వేటు వేయకుండా వారిని రక్షించారన్న విమర్శకు స్పీకర్ గురయ్యారు. మిగిలిన ఎనిమిది మంది కన్నా, దానం నాగేందర్ ఫిరాయింపు మరీ ఓపెన్ అయిపోయినట్లు లెక్క.స్పష్టమైన ఆధారాలు ఎదురుగా కనబడుతుంటే, అసెంబ్లీ వెలుపుల జరిగే పరిణామాలతో సంబంధం లేదని స్పీకర్ అభిప్రాయపడడం ఎంతవరకు హేతుబద్దమో తెలియదు.
తదుపరి బీఆర్‌ఎస్, బీజేపీలు హైకోర్టును ఆశ్రయించాయి. అక్కడ వాదోపవాదాల తదుపరి నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆ వెంటనే నాగేందర్ దానిని స్వాగతిస్తూ తాను మళ్లీ పోటీకి సిద్దమని అన్నారు. కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయమో, లేక అదిష్టానం అభిప్రాయమో తెలియదు కాని, హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లారు. హైకోర్టులో తీర్పు రాగానే రాజీనామా చేసి ఉన్నా బాగుండేది. కాని స్పీకర్ తీర్పులో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవచ్చా అన్న మీమాంసలో కాంగ్రెస్ పడింది తప్ప, నైతికంగా తప్పు చేస్తున్న సంగతిని విస్మరించింది. చివరికి సుప్రింకోర్టు తీర్పుతో కాంగ్రెస్ పార్టీకి పరువు పోయినట్లయింది.
నాగేందర్ మాత్రం తీర్పును వ్యతిరేకించకుండా పోటీకి రెడీ అని మాట్లాడడం కరెక్టుగా ఉందని చెప్పాలి. అంటే మొత్తం విశ్లేషిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి ఇష్టపడడం లేదన్న సంగతి అర్థం అవుతుంది. లేదా ఆయనకు న్యాయ సలహా ఇచ్చినవారు తప్పు దోవ పట్టించి ఉండాలి. దేశంలో ఇదొక రిఫరల్ జడ్జిమెంట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో బీజేపీ చేయిస్తున్న ఫిరాయింపులపై విమర్శ చేసే కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా వ్యవహరించి నైతికంగా నష్టపోయినట్లయింది.
లోక్ సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకం పట్టుకు తిరుగుతూ ప్రధానిని విమర్శిస్తున్నారని, అలాంటి వ్యక్తికి ఫిరాయింపుల చట్టం ఏమి చెబుతోందో తెలియదా అని బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రశ్నించడం సహేతుకమే అని చెప్పాలి. ఓవరాల్‌గా చూసినప్పుడు ఈ మొత్తం ప్రక్రియలో నాగేందర్ చేసిన తప్పుకన్నా, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమే ఎక్కువగా కనిపిస్తుంది.
ఇదీ చదవండి: బాబూ.. అమరావతిలో అసలు లెక్కేంటి?
ఇంకో సంగతి గుర్తు చేయాలి. 2004లో నాగేందర్‌కు అసిఫ్ నగర్ అసెంబ్లీ టిక్కెట్ కాకుండా సికింద్రాబాద్ లోక్‌సభ టిక్కెట్‌ను ఇచ్చారు. దానిపై ఆయన అసంతృప్తి చెందారు. రాత్రికి రాత్రే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి ఆ పార్టీ టిక్కెట్ తీసుకుని పోటీచేసి అసెంబ్లీకి గెలిచారు. కాని ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యం, కాంగ్రెస్ పవర్‌లోకి రావడంతో దానం టీడీపీకి దూరం అవ్వడానికి నిర్ణయించుకున్నారు. దానికి అంగీకరించిన వైఎస్ ఈయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారు. నాగేందర్ కూడా అందుకు భయపడలేదు.
కాకపోతే ఉప ఎన్నికలో ఓడి పోయి ఉండవచ్చు. కాని ఆయన చట్టం ప్రకారం తప్పు చేయలేదు. అప్పటి మాదిరే దానం రాజీనామాకు సిద్దపడినా కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదా అన్న సంశయం కలుగుతుంది. బీఆర్‌ఎస్ నుంచి ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన మిగిలిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా ఇదే గతి పడుతుందని ఆ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ బహిరంగంగా ఎన్నికలలో పోటీచేశారని, అందువల్ల అనర్హత వేటు పడిందని, మిగిలినవారు కాంగ్రెస్‌తో ఉంటున్నా, తాము పార్టీ మారలేదని వాదిస్తున్నారని, దాంతో వారిపై చర్య అంత తేలికగా అవుతుందా అన్న చర్చ ఉంది.
సుప్రింకోర్టు తీర్పు తర్వాత సత్యమేవ జయతే అని కేటీఆర్ అనడం బాగానే ఉన్నా, గతంలో బీఆర్‌ఎస్ వివిధ కారణాలతో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఐ మొదలైన పక్షాల నుంచి కూడా ఫిరాయింపులను ప్రోత్సహించింది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్‌కు ఏకంగా మంత్రి పదవిని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. అవి కూడా తప్పులే అవుతాయి. ఏపీలో అయితే మరీ ఘోరంగా ఫిరాయింపులు జరిగాయి. 2014 టరమ్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని అప్పుడు కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీలో చేర్చుకుని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. అయినా వారు మాట మాత్రంగా కూడా అభ్యంతరం చెప్పలేదు.
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, టీడీపీ తదితర పార్టీలు ఫిరాయింపుల విషయంలో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయన్నది వాస్తవం. చట్టాలు చేసేది ఈ పార్టీలే, వాటిని ఉల్లంఘించి, సాకులు వెదికేది ఈ పార్టీలే. దాంతో దేశంలో రాజకీయ పార్టీల పట్ల ప్రజలలో గౌరవం సన్నగిల్తుతోంది. ఇప్పుడు దానం అనర్హత వేటు వ్యవహారం స్పీకర్ పరిధి దాటి వెళ్లిపోయినట్లే అన్నది న్యాయనిపుణుల అభిప్రాయం. అలాకాకుండా ఇంకా దీనిని సాగదీయడానికి స్పీకర్‌తో కాంగ్రెస్ ప్రయత్నిస్తే అది ఆ పార్టీకి మరింత చేటు తెస్తుంది.
ఆయా రామ్, గయారామ్‌లపై న్యాయ వ్యవస్థ కూడా స్థిరమైన తీర్పులు ఇవ్వడం లేదన్న భావన కూడా లేకపోలేదు. ఫిరాయింపులకు ఆస్కారం లేని విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిది. కాని దురదృష్టవశాత్తు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్నాయి. ఏది ఏమైనా నాగేందర్ అనర్హతపై సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగింది. కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు దీనిని గుణపాఠంగా తీసుకుంటాయా? లేదా? అన్నది కాలమే తేల్చాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


