ఉత్తరప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. 56 మంది మృతి! | 56 Dead in 48 Hours as Heavy Rain Ravages Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. 56 మంది మృతి!

Sep 28 2026 7:50 AM | Updated on Sep 28 2026 7:56 AM

56 Dead in 48 Hours as Heavy Rain Ravages Uttar Pradesh

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఈదురుగాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. 48 గంటల వ్యవధిలో వర్ష సంబంధిత ఘటనల్లో 56 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 46 మంది గాయపడ్డారు. సెప్టెంబర్‌ 25 ఉదయం నుంచి సెప్టెంబర్‌ 27 ఉదయం వరకు రాష్ట్రంలో 97.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ సమయంలో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో 56 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర సహాయ కమిషనర్‌ హృషీకేశ్‌ భాస్కర్‌ యశోద్‌ తెలిపారు. వర్షాలు, సంబంధిత ఘటనల కారణంగా 1,020కుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 107 జంతువులు మృతి చెందాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నష్టాలు, ప్రాణనష్టంపై వివరాల సేకరణ కొనసాగుతోంది.

ఫరూఖాబాద్‌లో సాధారణం కంటే ఏకంగా 7,385 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కన్నౌజ్‌లో 5,664 శాతం, షాజహాన్‌పూర్‌లో 4,408 శాతం, హమీర్‌పూర్‌లో 4,240 శాతం, మహోబాలో 4,100 శాతం అధిక వర్షం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 48 గంటలకు పైగా కొనసాగిన ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే తరాయ్‌ ప్రాంతంలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఒడిశాకు వరద ముప్పు
భారీ వర్షాల కారణంగా ఒడిశాలోని పలు లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. మహానది నదీ వ్యవస్థలోని నీరు ముండలి వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు 8 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రికి సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు ముండలి మీదుగా ప్రవహించే అవకాశం ఉందని ఒడిశా జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ దిలీప్‌ కుమార్‌ రౌత్‌ తెలిపారు.

నాలుగు జిల్లాలపై ప్రభావం
మహానది వ్యవస్థలోని లూనా, కరాండియా, చిత్రోత్పల, కాఠజోడి, కువాఖై నదుల్లో నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉంది. ఖుర్దా, కటక్‌, పూరీ, జగత్సింగ్‌పూర్‌ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేవి, కండాలా, కుషభద్ర, దయా, భార్గవి, రాజువా, మకర నదుల్లోనూ వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర ఒడిశాలో బైతరణి, సాలంది, సువర్ణరేఖ నదులు ఇప్పటికే ప్రమాద స్థాయి కంటే ఎగువన ప్రవహిస్తుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

రిషికేశ్‌లో రివర్‌ రాఫ్టింగ్‌ నిలిపివేత
ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాల ప్రభావం కనిపిస్తోంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో రిషికేశ్‌లోని ముని-కి-రేతి ప్రాంతంలో గంగానదిపై రివర్‌ రాఫ్టింగ్‌ను నిరవధికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, నదిలో నీటిమట్టం సురక్షిత స్థాయికి తగ్గిన తర్వాతే రాఫ్టింగ్‌ను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. గఢ్వాల్‌ ప్రాంతంలో వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పర్యాటక, అడ్వెంచర్‌ అధికారి సోబత్‌ సింగ్‌ రాణా వెల్లడించారు.

ఇదీ చదవండి: 80 అడుగుల బోరుబావిలో పడి చిన్నారి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement