ఫరీదాబాద్: హర్యానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని సీహీ గ్రామంలో 80 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందింది. దాదాపు 10 గంటల పాటు సాగిన సహాయక చర్యల అనంతరం సోమవారం తెల్లవారుజామున చిన్నారిని బయటకు తీసి, ఆస్పత్రికి తరలించగా, ఆ చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో చిన్నారి ప్రమాదవశాత్తూ 80 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటనపై రాత్రి 7.45 గంటలకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్)కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. రాత్రి 9.05 గంటలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.
పలు విభాగాల బృందాలతో రెస్క్యూ
చిన్నారిని బయటకు తీసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు హర్యానా ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రంగంలోకి దిగారు. గజియాబాద్‌కు చెందిన యూపీ సివిల్ డిఫెన్స్ బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. చిన్నారిని సురక్షితంగా ఉంచేందుకు బోరుబావిలోకి ఆక్సిజన్‌ను కూడా పంపించారు.
బోర్‌వెల్ చుట్టూ తవ్వకాలు
చిన్నారిని బయటకు తీసేందుకు బోరుబావి చుట్టూ భారీగా తవ్వకాలు చేపట్టారు. ఘటనాస్థలంలో ఫైర్ బ్రిగేడ్, అడ్వాన్స్‌డ్ సపోర్ట్ అంబులెన్స్, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. ఫరీదాబాద్ సివిల్ సర్జన్ కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. దాదాపు 10 గంటల పాటు సాగిన తీవ్ర ప్రయత్నాల అనంతరం సోమవారం తెల్లవారుజామున 3.50 గంటలకు చిన్నారిని బోరుబావి నుంచి బయటకు తీశారు. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.
పదేళ్లుగా మూసివేసి ఉన్న బోరుబావి
స్థానికుల సమాచారం ప్రకారం.. ఈ బోరుబావి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందినదిగా తెలుస్తోంది. సుమారు పదేళ్లుగా అది వినియోగంలో లేకుండా మూసివేసి ఉంది. గతంలో బోరుబావిపై మూత ఉండేదని, అయితే కొన్ని రోజుల క్రితం ఆ మూత కనిపించకుండా పోయిందని చెబుతున్నారు. దీంతో బోరుబావి తెరిచి ఉండగా చిన్నారి అందులో పడిపోయింది.
ఇదీ చదవండి: అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి


