సుచికా తరియాల్ ప్రయాణం స్ఫూర్తిదాయకం
ఆసియా క్రీడల ఎంఎంఏలో పతకం ఖాయం
పన్నెండేళ్ల వయసులో కుర్రాళ్లు ఏడిపిస్తుంటే... వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆత్మరక్షణ విద్య నేర్చుకున్న ఆ చిన్నది... ఇప్పుడు 36 ఏళ్ల వయసులో ఆసియా క్రీడల్లో దేశానికి పతకం ఖాయం చేసింది. ‘ఆడపిల్లలు లేడి పిల్లలుగా కాకుండా... పులి పిల్లలుగా మారాలని’ బలంగా నమ్మి ఏళ్ల పాటు దాని కోసం కృషి చేసిన హరియాణాకు చెందిన సుచికా తరియాల్... ఏషియన్ గేమ్స్‌లో కనీసం కాంస్య పతకం ఖరారు చేసుకుంది.
వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండిపోకుండా... పోరాడటం నేర్చుకోవాలని కరాటేలో శిక్షణ తీసుకున్న సుచికా... తాజా ఆసియా క్రీడల్లో సాంప్రదాయ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) 60 కేజీల విభాగంలో సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ‘దేశానికి పతకం అందించబోతుండటం ఆనందంగా ఉంది. సోమవారం స్వర్ణ పతకం కోసం పోరాడతా. చిన్నప్పటి నుంచి ఏదో ఒక రకమైన ఫైటింగ్ నేర్చుకోవాలనే కల ఉండేది.
అందుకే తొలుత జూడోను ఎంచుకున్నా. ఆ ప్రయాణం నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మాది సంప్రదాయ కుటుంబం కావడంతో మొదట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా... ఆ తర్వాత నా పట్టుదల చూసి అంతా సహకరించారు. ఇక్కడి వరకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. దీని వెనక కఠోర శ్రమ దాగి ఉంది’ అని సుచిక వెల్లడించింది. ఆసియా క్రీడల్లో తొలిసారి ఎంఎంఏ క్రీడాంశాన్ని ప్రవేశ పెట్టారు. ఇందులో స్ట్రైకింగ్, టేక్‌డౌన్, గ్రాప్లింగ్, గ్రౌండ్ ఫైటింగ్ ఆధారంగా పాయింట్లు కేటాయించి విజేతను ప్రకటిస్తారు.
జూడో నుంచి మొదలై...
రోహ్‌తక్‌కు చెందిన సుచిక మొదట జూడోలో శిక్షణ తీసుకుంది. అక్కడి నుంచి జు–జుట్సుకు మారిన ఆమె... ఇప్పుడు ఎంఎంఏలో సత్తా చాటింది. భోపాల్ ‘సాయ్’ కేంద్రంలో రాటుదేలిన సుచిక... ఇప్పటి వరకు 20కి పైగా అంతర్జాతీయ ఈవెంట్లలో పోటీపడింది. ఎనిమిదిసార్లు జాతీయ చాంపియన్‌గా నిలవడంతో పాటు పలు పతకాలు ఖాతాలో వేసుకుంది. 2019 కామన్వెల్త్ జూడో చాంపియన్‌షిప్, 2019 దక్షిణాసియా గేమ్స్‌లో పసిడి పతకాలు సాధించిన ఈ హరియాణా ఫైటర్... 2018 కామన్వెల్త్ జూడో చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది.
2022 కామన్వెల్త్ క్రీడల్లో త్రుటిలో పతకం సాధించే అవకాశం కోల్పోయిన సుచిక... ఎట్టకేలకు తాజా ఆసియా క్రీడల్లో పోడియంపై నిలవనుంది. జూడో నుంచి జు–జుట్సుకు మారిన అనంతరం... 2024 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గింది. 2017లోనే ఎంఎంఏలో అరంగేట్రం చేసిన ఆమె జూడో మీద దృష్టి పెట్టేందుకు ఏడేళ్ల పాటు ఎంఎంఏకు దూరమైంది. 2024లో ఎంఎంఏలో పునరాగమనం చేసిన సుచిక... బహ్రెయిన్‌లో జరిగిన బ్రేవ్ సీఎఫ్ 92లో విజయం సాధించింది. సీఐఎస్‌ఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా సేవలందించిన సుచికా... ప్రస్తుతం హరియాణా క్రీడా శాఖలో జూనియర్ కోచ్‌గా వ్యవహరిస్తోంది.


