PC: BCCI/X
ఆసియా గేమ్స్ 2026 మహిళల క్రికెట్ పోటీల్లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన రెండో సెమీఫైనల్లో 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి తుది పోరుకు భారత్ అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
యువ ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగింది. షెఫాలీ 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (40), స్మృతి మంధాన(37) రాణించారు. అనంతరం ఈ భారీ లక్ష్య చేధనలో బంగ్లా జట్టు భారత బౌలర్ల ధాటికి 81 పరుగులకు కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్‌లో తుపాన్ సెంచరీతో విరుచుకుపడ్డ షెఫాలీ వర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
షెఫాలీ సాధించిన రికార్డులు ఇవే
👉మహిళల ఆసియా గేమ్స్ క్రికెట్ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్‌గా షెఫాలీ రికార్డు సృష్టించింది.
👉మహిళల టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డును షాఫాలీ సమం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఇంతకుముందు న్యూజిలాండ్‌పై 49 బంతుల్లోనే శతక్కొట్టింది.
👉టీ20 సెంచరీ చేసిన మూడో భారత మహిళా బ్యాటర్‌గా షెఫాలీ నిలిచింది. ఆమె కంటే ముందు స్మృతి మంధాన (2 సెంచరీలు), హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ ఫీట్ సాధించారు.
👉మహిళల టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్ల మార్కును అందుకున్న రెండో భారత బ్యాటర్‌గా షెఫాలీ రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా ప్రపంచంలో ఐదో బ్యాటర్‌గా ఆమె నిలిచింది.
👉మహిళల టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా షాఫాలీ వర్మ (104) రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ ఫీట్ మంధాన(100) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో ఆమెను షెఫాలీ అధిగమించింది.
👉మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా షెఫాలీ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది టీ20ల్లో షెఫాలీ వర్మ ఏకంగా 35 సిక్సర్లు బాదింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (32 సిక్సర్లు, 2024) పేరిట ఉండేది.
👉ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత మహిళల జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా షెఫాలీ నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఆమె 815 పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు స్మృతి మంధాన (763 పరుగులు, 2024) పేరిట ఉండేది. తాజా నాక్‌తో మంధాన ఆల్‌టైమ్ రికార్డును షెఫాలీ బ్రేక్ చేసింది.
చదవండి: టీమిండియాతో సిరీస్‌కు వెస్టిండీస్ జట్ల ప్రకటన


